Chandrababu Naidu : గత పాలకులు విధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టి… రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తద్వారా గతంతో పోలిస్తే మెరుగైన వృద్ధి రేటు గణాంకాలు నమోదు అవుతున్నాయని ఆయన వివరించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో నమోదైన గణాంకాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ప్రస్తుత ధరల వద్ద నమోదైన ఆర్ధిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.
చిన్నాభిన్నమైన వ్యవస్థను సరి చేయడం చేత కాదని పారిపోవటం లేదు… రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తాం. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. ప్రజలు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు. ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని ముందుకు తీసుకెళ్లగలిగాం.
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టాం. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లాం. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ రివైవ్ చేయగలిగాం. గత పాలకులు పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను యూనిట్ కు రూ.15 చొప్పున కొనుగోలు చేసిన పరిస్థితి.
పీపీఎల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కక్ష పూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనానికి నష్టం కలిగించారు. ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. సమర్ధవంతమైన సాగునీటి వ్యవస్థను కూడా చేపట్టాం. తద్వారా 950 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉంది. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి.”అని ముఖ్యమంత్రి అన్నారు.
వారసత్వంగా అప్పులే కాదు… చెత్త కూడా ఇచ్చారు
“రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాం. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియ చేశాం. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు… ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకువచ్చాం. గత పాలకులు విద్య శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోంది. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉంది. జీవన ప్రమాణాలు పెరగాలంటే… జీఎస్డీపీ పెరగాలనే అంశం ప్రజలకు తెలియాల్సి ఉంది. విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగింది.
2019-24 లో జరిగిన పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయింది. గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ. 7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయాం. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయాం. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలిగింది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి బ్రాండ్ తగ్గితే బ్యాంకులు ఎక్కువ వడ్డీలు చెల్లించాలని డిమాండ్ పెడతాయి. దీని ద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ నా ఆలోచన.”అని సీఎం వివరించారు.
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం
“25 ఏళ్ల క్రితం రూపొందించిన పాలసీల కారణంగా తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు ఆదాయం సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ అభివృద్ధి సాధించాలని ట్వీట్ చేశాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సహా వివిధ మౌలిక సదుపాయాలు కల్పించటం వల్ల పరిశ్రమల రంగంలో వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వ్యయం తగ్గింపు, ప్రాడెక్టు పర్ఫెక్షన్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను సమర్ధంగా అమలు చేస్తున్నాం. వెంటిలేటర్ లో ఉన్న రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోయగలిగాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఏడాది కొనుగోలు చేస్తున్నాం.
ప్రజలు తినే ఆహారానికి అనుగుణంగా పంటలను పండించటం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. దీనిపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాలను కూడా మరింతగా ప్రోత్సహిస్తున్నాం. సమీకృత వ్యవసాయం ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో అగ్రిటెక్ అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో రైతు సేవా కేంద్రం వారీగా వ్యవసాయ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ప్రకాశం సహా 9 రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన క్లస్టర్ గా తయారు చేస్తున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
తలా తోక లేని పార్టీ
“తప్పులు చేస్తారు… తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు. ఇలాంటి వారు సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారు. పరకా మణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరం అని కామెంట్ చేయడాన్ని ఏమనాలి…? ఓ దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేయించాం. దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా..? కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారు..?
గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇస్తే దానినీ సమర్ధించారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా..? ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోంది. సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి ఆయన భార్యతోనే మాపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టించారు. హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో ఓ పాస్టర్ మరణిస్తే.. ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తుల పై కఠినంగా వ్యవహరిస్తాం.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెషన్ నిబంధనలు అమలు చేశారు. విమాన ప్రయాణికుల భద్రత పెంచటంలో భాగంగా పైలట్లు, క్రూ సభ్యులకు విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు పెట్టింది. ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జరిగిన పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది… పరిస్థితిని చక్కదిద్దుతోంది.”అని సీఎం చెప్పారు.
2025-26 ఆర్ధిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 11.28 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు
2025- 26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికానికి సంబంధించిన రాష్ట్రస్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్ సహా వివిధ గణాంకాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఆ గణాంకాల వివరాలు ఇవీ..
రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి నమోదు.
రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్డీపీ నమోదు. ఇదే సమయానికి భారతదేశ జీడీపీ 8.7 శాతంగా ఉంది.
• గత ఏడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.17 శాతంగా ఉంది. దీని విలువ రూ.3,59,778. అంటే ఈ త్రైమాసికంలో జీఎస్డీపీ గత ఏడాదితో పోల్చుకుంటే 1.11 శాతం పెరిగింది.
• 2వ క్వార్టర్‌కి రాష్ట్ర జీవీఏ 11.30 శాతం ఉండగా, జాతీయ జీవీఏ 8.7 శాతంగా నమోదైంది.
• రాష్ట్రంలో వ్యవసాయ-అనుబంధ రంగాల జీవీఏ 10.70 శాతం , పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం వృద్ధి నమోదైంది.
• జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి చూస్తే వ్యవసాయ రంగం 1.8 శాతం, పరిశ్రమల రంగం 8.5 శాతం, సేవల రంగం 10.6 శాతంగా ఉంది.
వ్యవసాయం-అనుబంధ రంగాలు
• ఈ త్రైమాసికంలో వ్యవసాయం-అనుబంధ రంగాల్లో జీవీఏ విలువ రూ.1,25,571 కోట్లు, పరిశ్రమల రంగం విలువ రూ.86,456 కోట్లు, సేవల రంగం విలువ రూ.1,60,075 కోట్లు.
• పరిశ్రమల రంగంలో అనూహ్య ప్రగతి వచ్చింది. 2.78 శాతం నుంచి 12.20 శాతానికి వృద్ధి పెరిగి… జాతీయ సగటును దాటింది.
• వ్యవసాయ రంగంలో 11.43 శాతం, హర్టీకల్చర్ 4.35 శాతం, ఫిషింగ్, ఆక్వాకల్చర్ రంగాల్లో 26.27 శాతం, లైవ్ స్టాక్‌లో 4.18 శాతం వృద్ధి రేటు సాధించాం.
• వరి 3.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా… గతంతో పోలిస్తే 23.95 శాత మేర వృద్ధి వచ్చింది.
• అరటిలో అనూహ్యంగా 37.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతంతో పోలిస్తే ఇది 151.2 శాతం అధికం. మత్స్య దిగుబడి 17.30 శాతం, రొయ్యలు 27.09 శాతం మేర పెరిగింది.
• గుడ్లు 6.68 శాతం, మీట్ 7.95 శాతం పెరగ్గా… పాల దిగుబడి 3.62 శాతం తగ్గింది.
పరిశ్రమల రంగం
• పరిశ్రమల రంగానికి వచ్చే సరికి మొత్తంగా 12.20 శాతం వృద్ధి నమోదుకాగా… ఇందులో మైనింగ్-క్వారింగ్‌లో 18.43 శాతం పెరిగింది.
• తయారీ రంగంలో రూ.41,201 కోట్ల విలువైన జీవీ నమోదు కాగా 11.66 శాతం పెరుగుదల ఉంది. నిర్మాణం రంగంలో కూడా పురోగతి వచ్చింది. 11.81 శాతం పెరుగుదలతో జీవీఏ రూ.28.625 కోట్లకు చేరింది.
• విద్యుత్ ఉత్పత్తిలో 19.12 శాతం వృద్ధి నమోదైంది. 26,837 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తి చేరుకుంది. అలాగే విద్యుత్ వినియోగం కూడా 4.17 శాతం పెరిగింది.
సేవల రంగం
• ఆతిధ్య రంగంలో రూ.25,292 కోట్ల విలువైన జీవీఏతో 8.50 శాతం వృద్ధి నమోదైంది. ఈ రంగంలో ట్రేడ్, మాల్స్, రెస్టారెంట్లలో 6.95 కోట్ల ఫుట్ ఫాల్.
• రవాణా, గిడ్డంగులు తదితర విభాగాల్లో రూ.24,927 కోట్ల జీవీఏతో 5.99 శాతం వృద్ధి. 21.55 లక్షల వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ జరిగాయి.
• జల రవాణా ద్వారా 52.50 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. అలాగే ఈ త్రైమాసికంలోనే 14.98 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు.
• రియల్ ఎస్టేట్ రంగంలో రూ.32,951 కోట్లతో 14.31 శాతం పెరుగుదల నమోదు.
2014-19, 2019-24 మధ్య వృద్ధిలో వ్యత్యాసం
• 2014-19 మధ్య జీఎస్డీపీ వృద్ధి 13.49 శాతంగా నమోదు కాగా… 2019-24 మధ్య జీఎస్డీపీ 10.32 శాతానికి పడిపోయింది.
• మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 2024-25లో రూ.15.93 లక్షల కోట్లతో 12.02 శాతానికి జీఎస్డీపీ పెరిగింది. అదే సమయానికి జాతీయ జీడీపీ వృద్ధి 9.8 శాతంగా ఉంది.
• 2019-24 మధ్య వృద్ధి రేటు పడిపోవడంతో రూ.7 లక్షల కోట్ల జీఎస్డీపీ రాష్ట్రం నష్టపోయింది. 2014-19 వృద్ధి రేటు తర్వాత కాలంలోనూ కొనసాగి ఉంటే అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.
• తలసరి ఆదాయంలో కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 2014-2019 మధ్య 13.21 శాతం పెరగ్గా… 2019-24 మధ్య 9.8 శాతం మాత్రమే పెరిగింది.
• 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 11.89 శాతం మేర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది.
• రాష్ట్రంలో తలసరి ఆదాయం 2018-19లో రూ.1,54,031 ఉండగా, 2023-24 నాటికి రూ.2,37,951కి మాత్రమే పెరిగింది. 2024-25 కల్లా ఇది రూ.2,66,240కి తీసుకువచ్చాం. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.2,05,324గా ఉంది.
• 2014-19 మధ్య నమోదైన 13.49 శాతం వృద్ధి రేటు కొనసాగితే… సర్ణాంధ్ర-2047 లక్ష్యం నాటికి రూ.292 లక్షల కోట్ల జీఎస్డీపీ, రూ.49 లక్షల తలసరి ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
• అదే 15 శాతం వృద్ధి నమోదైతే 25 రెట్లకు జీఎస్డీపీ పెరిగి రూ.396 లక్షల కోట్ల విలువకు చేరుకుంటుంది. తలసరి ఆదాయం కూడా రూ.66 లక్షలు అవుతుందని అంచనా.
2025-26 తొలి అర్థ సంవత్సరం ఫలితాలు
• ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు కాగా… జీవీఏ విలువ మొదటి రూ.7,03,767 కోట్లుగా ఉంది.
• వ్యవసాయ రంగంలో 10.26 శాతం వృద్ధితో రూ.2,07,073 కోట్లుగా నమోదన జీవీఏ.
• పరిశ్రమల రంగంలో 12.05 శాతం వృద్ధితో రూ.1,79,299 కోట్లుగా నమోదన జీవీఏ.
• సేవల రంగంలో 11 శాతం వృద్ధితో రూ.3,17,396 కోట్లుగా నమోదన జీవీఏ.
• గత ఏడాది ఇదే కాలానికి జీఎస్డీపీ 9.89 ఉండగా, అది ఇప్పుడు 10.91 శాతానికి పెరిగింది. మరోవైపు ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి 6 నెలలు జాతీయ జీడీపీ 8.8 శాతం నమోదైంది.
• ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో తొలి రెండు త్రైమాసికాలు కలిపి 41 శాతం జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకున్నాం.
2025-26 ఆర్ధిక సంవత్సరం లక్ష్యం
• రానున్న రెండు త్రైమాసికాలు కలిపి జీవీఏ రూ.10,09,033 కోట్లు… జీఎస్డీపీ రూ.11,07,434 కోట్లు సాధనే లక్ష్యం.
• 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ రూ.17,12,800 కోట్లు… జీఎస్డీపీ రూ.18,65,704 కోట్లు… మొత్తంగా 17.11 శాతం వృద్ధి సాధించాలనేది లక్ష్యం.
• ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలంలో సాధించిన జీఎస్డీపీ 44.64 శాతం, రూ.7,58,270 కోట్లు.
• ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలంలో సాధించిన జీవీఏ 41.09 శాతం, రూ.7,03,767 కోట్లు.
• వ్యవసాయ రంగంలో 16.47 శాతం వృద్ధితో రూ.6,02,728 కోట్ల జీవీఏ లక్ష్యం… సాధించింది 34.36 శాతం… విలువ రూ.2,07,073 కోట్లు.
• పరిశ్రమల రంగంలో 17.32 శాతం వృద్ధితో రూ.3,99,358 కోట్ల జీవీఏ లక్ష్యం… సాధించింది 44.90 శాతం… విలువ రూ.1,79,299 కోట్లు.
• సేవల రంగంలో 16.12 శాతం వృద్ధితో రూ.7,10,714 కోట్ల జీవీఏ లక్ష్యం. సాధించింది 44.66 శాతం… విలువ రూ.3,17,396 కోట్లు.
