Telangana: తెలంగాణలో సామాజిక భద్రత పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తీసుకురావాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కీలకమైన పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా అన్ని రకాల పింఛన్ల పెంపుపై సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే, అంటే ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేయాలన్న యోచనపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పింఛన్ల పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయడానికి ఆర్థిక శాఖ విస్తృతంగా లెక్కలు వేస్తోంది. 2025–26 బడ్జెట్‌లో ఇప్పటికే పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.11,635 కోట్లు కేటాయించింది.
ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల సంఖ్య, ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పింఛన్లు పెంచినట్లయితే వార్షిక వ్యయం రూ.22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ వ్యయాన్ని బడ్జెట్‌లో ఎలా సర్దుబాటు చేయాలి? అదనపు నిధులు ఎలా సమీకరించాలి? అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.
పింఛన్లను ఎంత మేరకు పెంచాలన్న అంశంపై కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి రూ.500 పెంచాలా? లేక రూ.1,000 వరకు పెంచాలా? అన్న దానిపై వివిధ ప్రత్యామ్నాయాలపై లెక్కలు తీస్తున్నారు. ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేసే అవకాశం కూడా పరిశీలనలో ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ విధానం ప్రకారం వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందుతోంది. దివ్యాంగులకు నెలకు రూ.4,016 ఇస్తుండగా, డయాలసిస్ రోగులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు అమలులో ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పింఛన్లను రూ.4,000కి, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000కి పెంచాల్సి ఉంది. చేయూత గ్యారంటీ కింద పింఛన్ల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచుతామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమలులోకి రాగా, ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి కేంద్రీకరించింది.
ఇదిలా ఉండగా, బోగస్ పింఛన్ల నియంత్రణకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆదా అయ్యే నిధులను పింఛన్ల పెంపుకు వినియోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పెంపు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో, కొత్తగా పింఛన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పింఛన్ల పెంపుపై లబ్ధిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలవుతుందా? అనే అంశం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: Hyderabad : హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy : సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిద్దాం: రేవంత్
