HomeAstrologyVenu Swamy : ప్రగతికి మెడల్ రావడంలో నా పాత్ర ఉంది.. వశీకరణం చేస్తాను కానీ...

Venu Swamy : ప్రగతికి మెడల్ రావడంలో నా పాత్ర ఉంది.. వశీకరణం చేస్తాను కానీ తప్పు కాదు! – జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy : టాలీవుడ్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు తన వద్దకు జాతకాలు, పూజల కోసం వస్తుంటారని ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వృత్తి, తంత్ర మార్గం, వామాచారం, వశీకరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన వృత్తి జ్యోతిష్యమని, తన వద్దకు వచ్చే వ్యక్తి బ్యాగ్రౌండ్‌ ఏమిటన్నది తనకు ముఖ్యం కాదని వేణు స్వామి స్పష్టం చేశారు. డాక్టర్ అయినా, మంగలి అయినా, ఎవరు వచ్చినా వారి సమస్యలకు పరిష్కారం చూపడం, పాపపరిహారాలు చేయడమే తన బాధ్యత అని తెలిపారు. జాతకం చెప్పడమే కాకుండా అవసరమైతే పూజలు కూడా నిర్వహిస్తానన్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ నటి ప్రగతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కెరీర్‌తో పాటు రెజ్లింగ్‌లోనూ ఎదగాలనే లక్ష్యంతో ప్రగతి తన వద్దకు వచ్చి పూజ చేయించుకుందని తెలిపారు. ఆ తర్వాత ఆమె రెజ్లింగ్‌లో రజత పతకం సాధించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. “ఆమె విజయానికి నా పూజల పాత్ర కూడా ఉంది” అంటూ వేణు స్వామి వ్యాఖ్యానించారు.

తన పూజల్లో వామాచారం, వశీకరణం వంటి తాంత్రిక పద్ధతులు ఉపయోగిస్తానని వేణు స్వామి బహిరంగంగానే చెప్పారు. వశీకరణం అంటే ఆకర్షించడం మాత్రమేనని, అందులో తప్పేమీ లేదని ఆయన సమర్థించారు. వామాచారాన్ని క్షుద్ర పూజలుగా భావించడం అజ్ఞానమని వ్యాఖ్యానించారు. శ్రీకాళహస్తిలో నిమ్మకాయలతో చేసే రాహుకేతు పూజలు, పసుపు–కుంకుమల వినియోగం కూడా తంత్ర మార్గంలో భాగమేనని వివరించారు.

మద్యం, మాంసం వాడకం గురించి వచ్చిన విమర్శలపై స్పందిస్తూ… మందుల్లో గంజాయి వాడకం, వైద్యంలో స్టెరాయిడ్స్ వినియోగం ఎలా సహజమో, తంత్ర మార్గంలో కొన్ని పద్ధతులు అలాంటివేనని అన్నారు. గణేశుడు, తిరుమల వెంకన్న వంటి దేవుళ్లకు సాత్విక పూజలు ఉంటాయని, తాను పూజించే కామాఖ్యా దేవత వంటి ఉగ్ర దేవతలకు భిన్నమైన విధానాలు అవసరమని వివరించారు.

కామాఖ్యా ఆలయంలో గురుముఖతః తంత్ర మంత్రాలను నేర్చుకుని దక్షిణాదిన వామాచార పద్ధతులను పరిచయం చేసిన వ్యక్తి తానేనని వేణు స్వామి ప్రకటించారు. ఈ మార్గంలో నడవాలంటే ధైర్యం, దమ్ము అవసరమని స్పష్టం చేశారు. తనను నమ్మినా నమ్మకపోయినా ఫర్వాలేదని, తాను మాట్లాడేది శాస్త్రంలో భాగమేనని అన్నారు.

వామాచారం, కామాఖ్యా ఆలయం, తంత్ర పూజలపై నిజాలు తెలుసుకోవాలంటే గూగుల్‌, చాట్ జీపీటీ వంటి వాటిలో స్వయంగా పరిశీలించుకోవాలని వేణు స్వామి సూచించారు. తన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

ఇవీ చదవండి: Karkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!
Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు