HomeAndhra PradeshAndhra Pradesh : తిరుమల లడ్డూ పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్

Andhra Pradesh : తిరుమల లడ్డూ పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్

Andhra Pradesh : ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చడానికే తిరుమల లడ్డూ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, మరోవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించక విద్యార్ధులు కాలేజీలకు దూరమవుతుంటే… సీఎం చంద్రబాబు మాత్రం మతాన్ని అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని ఆధారాలు లేకపోయినా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు… విశాఖలో బట్టబయలైన గోవధపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు. టీడీపీ నేతకు చెందిన గోదాములో సుమారు 2 లక్షల కేజీల గోమాంసం పట్టుబడితే… చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పురంధేశ్వరి, మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఎందుకు నోరిప్పడం లేదని ప్రశ్నించారు. వీటి నుంచి డైవర్షన్ కోసమే కల్తీ నెయ్యి పేరుతో వైయస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…

కూటమి పాలనలో అపచారం- రాష్ట్రంలో యధేచ్చగా గోవధ..

గోమాత హిందువులకు దైవసమానం. అలాంటి గోమాత మాంసాన్ని మన రాష్ట్రం నుంచి కూటమి పాలనలో విచ్చలవిడిగా ఎగుమతిచేస్తూ పట్టుబడింది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే.. విశాఖపట్నం కేంద్రంలో సుమారు 200 టన్నుల అంటే దాదాపు 2 లక్షల కేజీల గోమాంసం బయపడింది. వధించిన గోమాంసాన్ని విశాఖపట్నం నగరానికి ఆనుకుని శొంఠ్యాంలోని మిత్ర కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ లో నిల్వ ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. భారీ కంటెయినర్ల ద్వారా విచ్చలవిడిగా అమ్మకాలు, ఎగుమతులు సాగిస్తుండగా పట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ ఐ) ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. మన ఏపీ పోలీసులకు ఇస్తే.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తారని నమ్మకం లేక.. నేరుగా డీఆర్ ఐ కి సమాచారం ఇచ్చారు. పట్టుబడిన మాంసాన్ని పరీక్షించి అది గోమాంసమే అని నిర్ధారించిన తర్వాత తప్పనిసరి పరిస్ధితుల్లో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీ నేతల కనుసన్నల్లోనే గోవధ…

అక్టోబరు 3 వ తేదీన ఇంత పెద్ద ఎత్తున లక్షల కేజీల గో మాంసం పట్టుబడితే నోరు విప్పిన మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు… హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి, నీచంగా ప్రచారం చేయడానికి మాత్రం నిత్యం పనిచేస్తూ ఉంటారు. గోవుల్ని వధించి, ఆ మాంసాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తుంటే… దానిమీద మాత్రం చంద్రబాబు పల్లెత్తు మాట కూడా మాట్లాడ్డం లేదు. ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ యజమాని అధికారి పార్టీకి చెందిన బాపట్ల ఎమ్మెల్యే వర్మకి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైన గోమాతను వధించి… టన్నుల, టన్నుల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం చంద్రబాబు పల్లెత్తు మాట అనరు. కానీ కల్తీ లేని నెయ్యిలో కల్తీ జరిగిందని… లడ్డూలో ఆవు కొవ్వు ఉందని విపరీతంగా దుష్ప్రచారం చేస్తాడు.

మన రాష్ట్రంలో హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా… అతి పవిత్రమైన గోమాంసాన్ని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు. మొన్న మాత్రమే పట్టుకున్నారు… వాస్తవానికి ఈ దారుణానికి ఎప్పుడు తెరతీశారో… దానిమీద పూర్తిస్ధాయిలో విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది. డీఆర్ ఐ వాళ్లు అడిగినా స్పందించడం లేదు… కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ యజమానిని, సుబ్రమణ్య గుప్తాను అరెస్టు చేయకుండా వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు.
హిందూమతం మీద ఏ మాత్రం గౌరవం లేని చంద్రబాబు… హిందూమతాన్ని అడ్డుపెట్టుకుని వైయస్సార్సీపీ మీద బురద జల్లే కార్యక్రమం మాత్రమే చేస్తున్నాడు.

గోవధపై నోరు విప్పని బీజేపీ నేతలు..

ఆశ్యర్యకరంగా చంద్రబాబుతో పాటు హిందూమతం గురించి గొప్పగా చెప్పే భారతీయ జనతాపార్టీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరితో సహా ఎవరూ దీని గురించి మాట్లాడ్డం లేదు. సాక్షాత్తూ విశాఖలో ఉంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సైతం…విశాఖలో జరిగిన ఈ దారుణం గురించి మాట్లాడ్డం లేదు. పైగా వాళ్లను రక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ముందుకు వచ్చే చంద్రబాబు… అదే హిందూ మతానికి అగౌరవం జరిగితే మాత్రం కనీసం నోరెత్తడం లేదు సరికదా అలా అపరాధానికి పాల్పడిన వ్యక్తులను రక్షించే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

మరోవైపు చారిటిబుల్ ట్రస్టు పేరిట పశువులను రవాణా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు, హోంమంత్రికి చెందిన వ్యక్తులు కూడా గోవులను రవాణా చేసి వధకు పంపిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇది చాలా అపచారం. చంద్రబాబు మాట్లాడకపోయినా.. కూటమిలో భాగస్వామి, భారతీయ జనతాపార్టీకి మద్ధతుదారు, జనసేన పార్టీ అధ్యక్షుడు సనాతని పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడ్డం లేదు. చంద్రబాబు చెప్పగానే వైయస్సార్సీపీపై మాత్రం మాట్లాడే పవన్ కళ్యాణ్… దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెబుతాడు కానీ.. రాష్ట్రంలో జరుగుతున్న గోవధ గురించి, తెలుగుదేశం పార్టీ నేతలు పరిశ్రమలా గోవులను వధించి ఎగుమతి చేస్తుంటే.. మాత్రం కనీసం ఖండించలేదు. మీరైనా నోరు విప్పండి పవన్ కళ్యాణ్? మతాన్ని మా మీద ఎగదోసే సంఘటనలకు మాట్లాడతారు తప్ప… గోవధ జరుగుతుంటే మాత్రం నోరు విప్పడం లేదు. విశాఖలో గోవధ జరగడం హిందువులకు అన్యాయం అని ప్రజలు భావిస్తుంటే కూటమి నేతలు మాట్లాడకపోవడం దుర్మార్గం.

సిట్ విచారణపై నీచమైన రాతలు..

ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన లోపల ఉండగానే… టీవీ5, ఆంధ్రజ్యోతి ఛానెల్స్ లో కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్ గా మారిన ధర్మారెడ్డి అని వార్తలు ప్రచారం చేశారు. విచారణ జరుగుతుండగానే.. ఆయన భయటకు రాకముందే ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. అప్రూవర్ గా మారిపోవడమే కాకుండా టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగాయని… ధర్మారెడ్డి చెప్పాడంటూ ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ కు ధర్మారెడ్డి వాంగ్మూలం అంటూ అత్యంత నీచమైన స్థితికి దిగజారారు.
టీటీడీ చైర్మన్ గా ఉన్న టీవీ 5 చైర్మన్ బీ ఆర్ నాయుడు తన ఛానెల్ లో కూడా అత్యంత దుర్మార్గంగా అప్రూవర్ గా మారిన టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ స్ధానంలో ఉండి కూడా.. ఇలాంటి వార్తలు రాయడానికి ఏం పోయేకాలం వచ్చింది? కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చొబెట్టినట్టు చంద్రబాబు నాయుడు నిన్ను పవిత్రమైనస్ధానంలో కూర్చొబెట్టాడు. సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మారెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. దైవాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నానని చెప్పారు.

చంద్రబాబుకు సుప్రీం కోర్టు చురకలు…

మరి ఈ అబద్దపు కథనాలు ఎందుకు? అనేక సందర్భాలలో మా పార్టీ తరపున చెప్పాం… చంద్రబాబు దైవాన్ని అడ్డం పెట్టుకున వైయస్సార్సీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నెయ్యిలో జంతువులు, పందికొవ్వు కలిసిందని.. ఆ లడ్డూను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిన్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఆధారాల్లేకుండా ఒక ముఖ్యమంత్రి పవిత్రమైన లడ్డూ గురించి ఈ విధంగా ఎలా మాట్లాడుతారని సుప్రీం కోర్టు సైతం నిలదీసింది.

అంతే కాకుండా అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు సైతం కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు. నెయ్యి పై అనుమానాలు వస్తే వెనక్కి పంపించామని చెప్పారు. అలా వెనక్కి పంపించడం అదే తొలిసారి కాదు. చంద్రబాబు హయాంలోనూ, వైయస్సార్ హయాంలోనూ, వైయస్.జగన్ హయాంలోనూ వెనక్కి పంపించారు. టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పూర్తిస్ధాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తిరుమల కొండపైకి పంపిస్తారు. నాణ్యత లేదని తేలితే వెనక్కి పంపిస్తారు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన వ్యవహారంలో విఫలమైన మీరు ఆ నెపాన్ని వైయస్.జగన్ మీదనో, వైవీ సుబ్బారెడ్డి మీదనో, ధర్మారెడ్డి మీదనో నెట్టాలని చూస్తున్నారా? ఇంత దుర్మార్గంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్నారు.

అంతే కాకుండా వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే బోలేబాబా డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్టారు. అంతేకాకుండా హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకుని అమూల్యమైన లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబునాయుడు కల్తీగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.. దీనిమీద సీబీఐ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి దేశఅత్యున్నత న్యాయస్దానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం అనేక ప్రశ్నలను సంధించడంతోపాటు.. వాటికి జవాబులు చెప్పకుండా చంద్రబాబు తనకు అనుకూల మైన ఎల్లో మీడియాతో పాటు ఇతరులతో మాట్లాడిస్తూ ఉంటాడు.

నెయ్యి సరఫరాలో ప్రమాణాలు పెంచిన వైయస్.జగన్ ప్రభుత్వం..

నెయ్యి సరఫరా విషయంలో ప్రమాణాలు నిర్ధారించే క్రమంలో 2016లో 8 పారామీటర్స్ ఉంటే.. 2019నాటికి వాటిని 9కి పెంచారు. 2023కు వచ్చేనాటికి 10, 2024 నాటికి వచ్చేసరికి నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి 16 నిబంధనలను వైయస్.జగన్ ప్రభుత్వం విధిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎల్లో మీడియాలో రూ.330 మంచి నెయ్యి ఎలా వస్తుంది, కల్తీ నెయ్యి కదా అన్న ప్రచారం చేస్తే.. చంద్రబాబునాయుడు అయితే మంచి నెయ్యి అయితే రూ.3వేలు పెడితే కాని రాదు అని చెప్పాడు. ఇదే చంద్రబాబు వైస్.జగన్ అధికారంలోకి రాకముందు 2014-19 మధ్యలో కేజీ నెయ్యి రూ.276 లకే కొన్నాడు. దానికి సమాధానం లేదు? రేటుని బట్టి నెయ్యి నాణ్యతను నిర్దారించాల్సిన వస్తే.. చంద్రబాబు చెప్పినదాని ప్రకారం ఆయన హయాంలో వాడినదంతా కల్తీ నెయ్యే? ఇలా లాజిక్ లేని ప్రశ్నలు, వార్తలు రాస్తూ లేని తప్పు జరిగిందని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు దౌర్భాగ్య విధానాలను ప్రజలు అర్ధం కోవాలి.

చంద్రబాబు అబద్దాలను భగవంతుడు కూడా క్షమించడు…

శ్యామలరావు ఈవో గా ఉన్నప్పుడు తిప్పి పంపిన నెయ్యి లారీలను లడ్డూ ప్రసాదంలో వాడామని చెపుతున్న చంద్రబాబును ఆ భగవంతుడు కూడా క్షమించడు. వాస్తవానికి ఆ రోజు ఈవో శ్యామలరావుగారు నెయ్యిలో వనస్పతి కలిసిందని చెప్పినప్పుడు.. దాన్ని పరీక్షించిన ల్యాబ్ వాళ్లు కొన్ని సందర్భాల్లో మా నివేదక కూడా తప్పయ్యే అవకాశం ఉందని డిస్ క్లైమర్ కూడా ఇచ్చారు. సదరు ల్యాబ్ ఈ రకమైన నివేదిక ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న మిగిలిన ల్యాబ్ లలో మీరు ఎందుకు పరీక్షించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే… దానికి మాత్రం చంద్రబాబు సమాధానం చెప్పడు. గోమాంసం ఎగుమతి మీదా సమాధానం చెప్పడు కానీ తనకున్న మీడియా సహకారంతోనూ, సోషల్ మీడియాలోనే బురద జల్లే కార్యక్రమం మాత్రం చేస్తాడు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా కూడా చంద్రబాబు దాన్ని పెడచెవిన పెట్టి… నిత్యం దేవుడి పేరుతో రాజకీయం చేస్తూనే ఉన్నాడన్న విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసినట్టు ఆధారాలు లేవన్నది ముమ్మూటికీ నిజం. అయినా కూడా దీనికి మసిపూసి మారేడు కాయ చేసి నిరూపించాలన్న తాపత్రయంలో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

కేవలం ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏకంగా దేవుడి పేరుతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని మరోసారి స్పష్టీకరించిన అంబటి రాంబాబు.. మరోవైపు ఈ రాష్ట్రంలో లక్షలాది గోవులను వధిస్తూ.. విచ్చలవిడిగా గోమాంసాన్ని విదేశాలకు సరఫరా చేస్తుంటే మాత్రం భారతీయ జనతాపార్టీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం పాత్రికేయల ప్రశ్నలకు బదులిస్తూ…

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ ర్యాలీ చేశాం. కేవలం గుంటూరులో మాత్రమే చేయలేదు. ర్యాలీకి అనుమతి అడిగితే మంజూరు చేశారు. తీరా ర్యాలీకి వెళ్లినప్పుడు బారికేడ్లు అడ్డం పెట్టారు. లోకేష్ బంధువైన ఓ సీఐతో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. బారికేడ్లు పెట్టి రెచ్చగొట్టే పనిచేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడే రాజకీయ నాయకుడిగా మీరెన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆగదు. నన్ను వేధించడానికి కుట్రపన్నారు కాబట్టే.. నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అయినా భయపడేది లేదు. వెనక్కి తగ్గేది లేదు. పచ్చమీడియాలో నాపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. గతంలో పోలీసులు ఆపినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్లను తోసుకుంటూ వెళ్లలేదా? పోలీసులు తెలుగుదేశం పార్టీ సైన్యంలా వ్యవహరిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: Ambati Rambabu : జగన్ కాలు బయటపెడితే టీడీపీలో వణుకు: అంబటి
Ambati Rambabu: దేవుడి దర్శనానికి వెళ్తామంటే ఎందుకీ అనైతిక చర్యలు: అంబటి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు