Karnataka : వినాయక నిమజ్జన శోభాయాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. డ్యాన్సులు, హర్షధ్వానాలతో కొనసాగుతున్న ఊరేగింపులో ఒక్కసారిగా భయంకర ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. Karnataka
ఈ ప్రమాదం హసన్-మైసూర్ జాతీయ రహదారి-373పై మోస్లెహోసల్లి గ్రామం వద్ద జరిగింది. గణేష్ ఊరేగింపు జరుగుతుండగా వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి నేరుగా ఊరేగింపులోకి దూసుకెళ్లింది.
ఒక్క క్షణంలో ఆనందం విషాదంగా మారింది. కొద్దిసేపటి క్రితం డ్యాన్సులు చేసిన భక్తులు క్షణాల్లో నేలపై కుప్పకూలడం, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ప్రభుత్వ స్పందన
ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర షాక్‌కు గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల పరిహారం, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. “హసన్‌లో గణేష్ నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపులో జరిగిన ఈ దుర్ఘటన బాధాకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని సీఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ ప్రమాదాన్ని భయంకరమైనదిగా పేర్కొన్నారు. ఘటన స్థలానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గణేష్ నిమజ్జన వేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: Portugal : పోర్చుగల్‌లో ఘోర విషాదం.. లిస్బన్‌లో గ్లోరియా ఫునిక్యులర్ రైలు ప్రమాదం
DJ Sound : గణేష్ నిమజ్జన వేడుకలో విషాదం.. డీజే సౌండ్స్‌తో డ్యాన్స్.. యువకుడికి గుండెపోటు
