Kodangal: కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో (Kodangal) యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ – లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధి బృందం సీఎం గారిని సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని గుర్తుచేశారు.
కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు.
సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో పాటు ఇతర నాయకులు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు.
30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు
ప్రజా ప్రభుత్వ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30 మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.
వ్యవసాయ శాఖ, ఈ నెల 30 వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సు వంటి అంశాలపై ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఇటీవలి కాలంలో వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
రైతుల్లో అవగాహన పెంచడానికి వీలుగా సదస్సును ఒకరోజు కాకుండా 28 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా స్టాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు ఉపయోగపడాలన్నారు.
రుణమాఫీ అంశం చర్చకు వచ్చినప్పుడు, రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. కొన్నిచోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో నమోదైన పేర్లలో తప్పులు, కుటుంబాల నిర్ధారణ వంటి కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకి నివేదికను అందించారు.
ఇవీ చదవండి: Cosmetic charges: తెలంగాణలో డైట్ కాస్మొటిక్ చార్జీల సవరణ
University: విశ్వవిద్యాలయాల ప్రక్షాళన.. తెలంగాణ సర్కార్ కీలక అడుగులు?
