Chandrababu: సీఎం చంద్రబాబు మరోసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం బహిరంగ సభలో చంద్రబాబు (Chandrababu) పాల్గొని ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..
రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రి విజయనగరం నుంచి వెన్నెలపాలెంకు మార్చాం. అక్కడ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అప్పటికి అప్పుడు చెప్పినా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. గుంతలు లేని రోడ్లకు వెన్నెలపాలెంలో ఫౌండేషన్ వేశాం.. ఈ గ్రామమే స్ఫూర్తిగా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మారుస్తాం. గత ఐదేళ్లు రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లాడు. రాష్ట్రానికి పెద్ద పెద్ద గోతులు తవ్వాడు, నరకానికి దారులుగా మార్చాడు. ఇప్పుడు మనం ఆ గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాం.
గత ఐదేళ్లలో కేవలం రూ.1000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారంటే అది వాళ్ల అహంభావానికి పరాకాష్ట. ఇప్పుడు రోడ్లను చూస్తే మా ఆడబిడ్డలు ఆస్పత్రికి వెళ్లకుండానే రోడ్లపై డెలవరీ చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూస్తాం. రోడ్లు నాగరికతకు చిహ్నం. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం వల్ల సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతాయి. మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి.
25, 30 సంవత్సరాల క్రితం రోడ్లు చూస్తే అధ్వానంగా ఉండేవి. నేను మొదటి సారి సీఎం అయ్యాక మలేషియా వెళ్లాను. అక్కడ 2 కోట్ల జనాభా మాత్రమే ఉన్నారు. రోడ్లు చూస్తే 8 లైన్ల రోడ్లు ఉన్నాయి. టోల్ గేట్లు ఉన్నాయి. చిన్న వాహనాలైన ఆటోలు, మోటర్ బైక్‌లకు ఏ మాత్రం చార్జీ లేకుండా నడుపుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడే మొట్ట మొదటి రోడ్డు నెల్లూరు నుంచి చెన్నై వరకు వేశాం. అది మా ప్రభుత్వం ఘనత. ఆ తర్వాత దేశం మొత్తం పెద్ద ఎత్తున రోడ్లు వేసేందుకు ముందుకు వెళ్లారు.
ఆంధ్రా ఎస్కోబార్..
రోడ్లు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి. రోడ్లు బాగుంటే రైతుల పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. దళారులు మోసం చేసే పరిస్థితి ఉండదు. సంక్రాంతికి ఏ రోడ్డులో గుంతలు లేకుండా పూడ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఆంధ్రలో ఎస్కోబార్ ఒకడు ఉండేవాడు.. గుంతలు పెట్టి ఇంటికి పోయాడు. ఇప్పుడు అవి పూడ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఆ ఎస్కోబార్ రోడ్లు పాడు చేయడం వలన కొంతమంది రోడ్లపై వరినాట్లు నాటారు. కొంతమంది ఆ రోడ్లపై ఈత కొట్టారు. రోడ్లను స్విమ్మింగ్‌పూల్స్ గా తయారు చేసి వెళ్లిపోయాడు.
24 వేల కి.మీ. సిమెంటు రోడ్లు
మనం అలా చేయం.. అభివృద్ధి రాజకీయాలు కావాలి. 2014-19 మధ్య రోడ్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయన్నది మీరే చూడండి. రాష్ట్ర హైవేలను అభివృద్ధి చేశాం.. గ్రామాల్లో సిమెంట్లు రోడ్డు వేశాం.. 24వేల కిలోమీటర్ల సిమెంట్లు రోడ్లు వేశాం అంటే అది మా చరిత్ర. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు. అలా చేస్తాం. ఆ బాధ్యత మేం తీసుకుంటాం.
మళ్లీ ఆ భూతాన్ని రాకుండా చేయండి
గతంలో పాలించిన ఆ భూతాన్ని మళ్లీ రానీయకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. మనం ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నవ్వులు చూసి ఎన్ని రోజులు అవుతుందో మీరే చెప్పండి.. మళ్లీ భూతం వస్తే ఇలాంటివి కనిపించకుండా పోతాయి. ఇప్పుడు పరదాలు ఉన్నాయా? చెట్లు నరికేసేమా? ఆంక్షలు పెట్టామా? ఇళ్లల్లోనే ఎవరినైనా అరెస్టులు చేశామా? బస్సులు పెట్టి బలవంతంగా తీసుకువచ్చామా? డ్వాక్రా సంఘాల వాళ్లను తీసుకువచ్చామా? చుట్టూ కందకాలు తవ్వి కూర్చోపెట్టామా? అలాంటి ఏమీ ఇప్పుడు లేవు.
నిన్ననే దీపావళి చేసుకున్నాం. నరకాసురవర జరిగింది. చెడుపై మంచి గెలిచిన సమయం. మళ్లీ మంచి రోజులు వచ్చాయి. మంచి రోడ్లు వస్తాయి. అది ఈ గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో 45,378 కిలోమీటర్లు ఆర్ అండ్ బి కి ఉన్నాయి. ఇవి కాకుండా 8వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలో ఉన్నాయి.. ఆ దుర్మార్గుడు దిగిపోయే సమయంలో 1060 కోట్ల బకాయిలు ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు పెట్టి వెళ్లాడు. రాష్ట్రంలో ఒక లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు అప్పు పెట్టి వెళ్లాడు. 10 లక్షల 50వేల కోట్లు అప్పు పెట్టి వెళ్లాడు.
ఇప్పుడు నేను అప్పు అడగాలన్నా ఇచ్చేవాడు లేడు. ఎమ్మార్వో ఆఫీసులను సైతం కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చాడు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 25 సంవత్సరాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25వేల కోట్లకు అప్పుకు వెళ్లాడంటే రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించాడో మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు ప్రజలు గెలవాలని చెప్పాం.. ఎన్డీఏ గెలవాలని చెప్పాం. మీరు బ్రహ్మాండంగా గెలిపించారు.
ఇవీ చదవండి: Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
