Tirumala: సత్యయుగంలో నాలుగు పాదాలా నడిచిన ధర్మం.. త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై, ప్రస్తుతం కలియుగంలో ఒంటికాలిపై నడుస్తోందంటారు పెద్దలు. అందుకు కారణం కలి ప్రభావమేనని చెప్పక తప్పదు.
కలియుగంలో ఎక్కడ చూసినా అధర్మమే రాజ్యమేలుతుందని పురాణాల్లోనూ ఉంది. అంతా అన్యాయం, మంచి వాళ్లకు చెడు కలుగడం, అసలు భగవంతుడంటే లెక్కలేని వారి సంఖ్య పెరుగుతుంది. స్త్రీ, డబ్బుకు అమిత ప్రాధాన్యం పెరుగుతుందని పెద్దలు చెబుతారు.
కలియుగ వైకుంఠ నాథుడుగా పేరు గాంచి భక్తులను రక్షిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తలచుకుంటూ, అప్పుడప్పుడూ తిరుమలకు వెళ్లి వస్తుంటారు భక్తులు. కానీ ఇప్పుడు ఆయన దివ్య ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదంపై వివిధ రకాలైన వార్తలు రావడం భక్తులను కలవరపెడుతోంది. ఏమీటీ వైపరీత్యం వేంకటనాథా.. అంటూ ఉలికిపాటుకు గురవుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో గానీ, టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో గానీ, లడ్డూ ప్రసాదాల విషయంలోగానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు వ్యాప్తి చెందుతున్నాయి. అవి నిజం అని కొందరు నమ్ముతున్నారు. కానీ ఒక వర్గం వారు, వారి పార్టీ, మీడియా, సోషల్ మీడియాలో కావాలనే విష ప్రచారానికి దిగుతున్నారని, ఇందుకు స్వామి పేరును వాడుకోవడం అత్యంత హేయమని మరోవర్గం వాదిస్తోంది. అయితే, ఈ వర్గాలు అందరూ కలిసి వేంకటేశ్వరస్వామి వారి విషయంలో తీవ్రమైన అపచారం చేస్తున్నారన్నది మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు.
రాజకీయాలకు టీటీడీ వేదికగా మారిందా?
చాలా సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం.. తన ప్రస్థానం కొనసాగిస్తోంది. కానీ ఎప్పుడూ ఇంతలా విమర్శలు రాలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు, మీడియా వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. అది ఎంతలా అంటే.. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత జీవితాలపై ట్రోలింగ్, దారుణమైన అబద్ధాల ప్రచురణ, ప్రసారం.. ఏ మాత్రం విలువలు పాటించకుండా బ్లాక్ మెయిల్ వార్తలు వేస్తూ, రాస్తూ సామాన్య ప్రజలు సైతం విసుగెత్తిపోయేలా పరిస్థితి మారిపోయింది. రాజకీయ పార్టీలు స్వార్థం కోసం టీటీడీని, స్వామి వారి పేరును నిస్సిగ్గుగా వినియోగించుకోవడం శోచనీయం. దారుణం.
కలియుగాన అందరూ రాక్షసులే..
కలియుగంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారు శిలారూపుడై మనకు సాక్షాత్కరిస్తున్నారన్నది తెలిసిందే. త్రేతాయుగం, ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారని, వారిని సంహరించడానికి శ్రీమహావిష్ణువు అవతారాలు ఎత్తాడని చదువుకున్నాం. కథలుగా విన్నాం. కానీ ఈ కలియుగంలో అందరూ రాక్షసులే కదా. కలి ప్రభావం పట్టి పీడిస్తున్న తరుణంలో ఆ ప్రభావానికి లోనైన వారు కోర్కెలతో రగిలిపోతారు. అహం, ఈర్ష్య, ద్వేషంతో తమ పంతం నెగ్గాలని పట్టుబట్టి మన:శ్శాంతి లేకుండా జీవితం గడుపుతారు. రాక్షసులుగా మారి పక్కనున్న వారిపై కక్ష తీర్చుకోవడానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మరి ఇంత మంది రాక్షసులను శ్రీహరి ఎలా చంపుతాడు? కాబట్టి మార్చే ప్రయత్నం చేస్తాడు. ప్రతి నిత్యం ప్రజల్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయన వద్దకు వెళ్లినప్పుడు కలి ప్రభావం మాపై పడకుండా చూసి ఎల్లవేళలా నీ నామస్మరణ చేసేలా చూడాలని కోరుకుంటే ఈ కలి కలిగించే అవలక్షణాలు తప్పే అవకాశం ఉంటుంది.
తప్పు అని తెలిసినా మనిషి చేస్తాడు
కలి ప్రభావం ఎలా ఉంటుందంటే.. నేటి కాలం మాటల్లో చెప్పాలంటే.. ఒక పని తప్పు అని తెలిసినా మనిషి చేస్తాడు. తన మనసును సంతృప్తి పర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. నాకు ఫలానిది కావాలి, నేనే ఆ స్థాయికి చేరుకోవాలి.. అందుకోసం నేను ఏం చేసినా ఫర్వాలేదు.. దాని వల్ల అవతలివాళ్లను ఇబ్బందిపెట్టినా ఫర్వాలేదు.. వాళ్లు సర్వనాశనమైనా, ఏమైపోయినా లెక్కేలేదు. నేను అనుకున్నది సాధించాలి.. అన్న ధోరణి కొందిరికి ఉంటుంది. తన మనసులో నుంచి వచ్చిన కోర్కె తీర్చుకోవడమే మనిషికి ఆ సమయానికి ముఖ్యం. ఇదే ఇప్పుడు కలి ప్రభావంతో లోకంలో జరుగుతోంది.
స్వామి పేరు ఇలా వాడుకోవడం ధర్మమేనా?
ప్రస్తుతం కులం, మతం, ప్రాంతం, వర్గం వారీగా ప్రజలను విడగొట్టి రాజకీయం నడపడం మొదలైపోయింది. రాజకీయానికి కాదేదీ అనర్హం.. అన్న చందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పాలిటిక్స్ మరీ దిగజారిపోయాయి. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడిని తొక్కేయాలంటే బాగా దిగజారిపోవాల్సిందేనన్న సూత్రాన్ని అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయి. ఇందులో భాగమే ఏ అంశాన్ని అయినా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి పేరును, టీటీడీని రాజకీయాల్లోకి లాగి అపవిత్రం చేస్తున్నాయి. మరి స్వామిని ఇలా అపవిత్రం చేసే చర్యలు ధర్మమేనా? అన్నది రాజకీయ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
సత్కర్మలను చేయడం మరిచిపోతున్నారా?
కలియుగంలో కర్మలు చేయడమే ముఖ్యం. ద్వాపర యుగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు కూడా ఇదే బోధిస్తాడు.
కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచన..
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ..
అంటే కర్మలను ఆచరించడంపై మాత్రమే నీకు అధికారం కలదు. కానీ వాటి ఫలితంపై లేదు. నీకు కర్మ ఫలమునకు కారణం కారాదు. అలాగని కర్మలను చేయడం మానరాదు.
అంటే కలియుగంలో ఘోరాలు, నేరాలన్నీ చేసేమని కాదు. సత్కర్మలను చేయడం ముఖ్యం. మంచి కర్మలను చేయడం ద్వారా భగవదనుగ్రహం పొందవచ్చు.
స్వామి చూసుకుంటాడా?
వేంకటేశ్వర స్వామిని ఇంతలా రాజకీయాలు చేస్తున్నారు కదా.. మరి స్వామి చూస్తూ ఊరుకుంటాడా.. వీరందరికీ బుద్ధి చెబుతాడా? అంటే.. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కర్మ చేసేటప్పుడే సరిచేస్తే జీవితానికి అర్థం, పరమార్థం ఏముంటుంది? కర్మ చేసిన అనంతరం ఫలితం అనుభవించక తప్పదు. భగవంతుడైనా మన్నించమని వేడుకుంటే కరుణించి వదిలేస్తాడేమో.. కర్మ మాత్రం చచ్చినా వదలదు. మరో జన్మలో అయినా వెంటాడి తీరుతుంది. వేంకటేశ్వర స్వామి పేరును రాజకీయాలకు వాడుకున్న వారిని పట్టుకుని వెంటనే శిక్షించి చంపేస్తాడనుకోవడం పొరపాటు. తప్పు చేసి ఉంటే వారి కర్మను బట్టి కచ్చితంగా అనుభవించి తీరుతారన్నది గ్రహించాలి.
ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయే తరాలు?
కలియుగం.. దాదాపు 4,32,000 సంవత్సరాలు గడవాలి. ఇప్పుడు సుమారు 5 వేల ఏళ్లు మాత్రమే గడిచాయి. ఇప్పుడే కలియుగ ప్రభావం ఇంతలా ఉంటే ఇక మీదట పరిస్థితి ఏంటి? అనేది ఊహకు కూడా అందదు.
ఇందుగలడందులేడని.. సందేహము వలదు..
చక్రి సర్వోపగతుండు..
ఎందెందు వెదకి చూచినా..
అందందే గలడు.. దానవాగ్రణి వింటే..!
తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం శ్రీహరిని ధ్యానిస్తుండగా కోపోద్రిక్తుడైన రాక్షస రాజు హిరణ్యకశిపుడు.. శ్రీమహావిష్ణువు అంతా ఉన్నాడా..? అని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం ఇది. శ్రీహరి ఇక్కడున్నాడు, అక్కడున్నాడన్న సందేహం వద్దు. ఆయన అన్ని చోట్లా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ వెతికినా అక్కడే కనిపిస్తాడు.. ఇదీ దాని అర్థం.
దేవుడు సృష్టించిన మానవుడు ఎన్ని అడ్డదిడ్డమైన పనులు చేసినా.. ఆ భగవంతుడు అక్రమాలన్నింటినీ అరికట్టడానికి ఎపుడో అపుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తిరుమల కొండపై శిలారూపుడై అన్నీ చూస్తున్న శ్రీనివాసుడు.. ఒక చెయ్యి తన పాదాలను చూపుతూ ఉంటాడు. దాని అర్థం.. పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే.. తన పాదాలను ఆశ్రయించిన వారికి అవన్నీ తొలగిపోయేలా చేస్తానన్న సంకేతం. శరణాగత వత్సలుడు, సర్వజగద్రక్షకుడైన శ్రీవేంకటేశ్వర పాద పద్మాలను స్మరించుకుంటూ.. కొందరు నేతలు చేస్తున్న పాపాలను మన్నించి వారిని మంచి దారిలో పయనించేలా చేయాలని కోరుకుందాం.
ఓం నమో వేంకటేశాయ..
ఇవీ చదవండి: Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!
Lord Venkateswara: శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎవరిని ఇష్టపడతారు? స్వామి గురించి రహస్యం ఇదిగో..!
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..
