HomeAndhra PradeshReddy Community: సొంత సామాజికవర్గమే జగన్‌ను ముంచేసిందా? అంత వ్యతిరేకతకు కారణాలేంటి?

Reddy Community: సొంత సామాజికవర్గమే జగన్‌ను ముంచేసిందా? అంత వ్యతిరేకతకు కారణాలేంటి?

Reddy Community: మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత సామాజికవర్గమే దూరం అయ్యిందా? వైయస్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా అండగా ఉంటున్న వర్గం నేడు ఇంత బద్ధ వ్యతిరేకం అవడానికి కారణాలేంటి? ఎన్నడూ లేని విధంగా జగన్ చేజేతులా అధికారాన్ని దూరం చేసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వస్తోంది. గడచిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్ పార్టీ.. ఇప్పుడు పుంజుకోవడం, దూరమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకోవడం కత్తిమీద సాము లాంటిదే.

ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలంగా కమ్మ సామాజికవర్గం టీడీపీతోనే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న బలమైన సామాజికవర్గం రెడ్లు. ఆ పార్టీ ఏపీలో కనుమరుగై పోయిన తర్వాత రెడ్డి సామాజికవర్గమంతా జగన్ వెంట నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది. రెడ్డి నేతలంతా జగన్ వెంట ఉండేవారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంలో రెడ్డి సామాజికవర్గీయులదే కీలక పాత్ర. ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ అంటే బద్ధ శత్రువులా చూశారు. ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, రెడ్డి సామాజికవర్గానికి చెందిన సాధారణ ఓటర్లు సైతం జగన్ కు ఓటేయలేదని స్పష్టమవుతోంది. వైయస్సార్ సీపీకి బాగా పట్టు ఉన్న రాయలసీమలోనూ జగన్ ను రెడ్లు ఆదరించలేదని రిజల్ట్ చెప్పకనే చెబుతోంది.

రాష్ట్రంలో సుమారు 70కి పైగా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గంలో బలమైన నేతలు ఉన్నారు. దశాబ్దాలుగా రాజకీయాలను ఈ సామాజికవర్గం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయాలను శాసిస్తోంది. రెడ్లలో ఎక్కువ మంది ఆర్థికంగా బలంగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో జగన్ కు రెడ్లంతా దూరం అయ్యారు. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. రాయలసీమలో రెడ్లు దూరమయ్యారనే దానికి నిదర్శనం సాక్షాత్తూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పులివెందులలో మెజార్టీ తగ్గడమే. సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా తమకు ఓట్లేస్తారని భావించిన జగన్ పార్టీ.. ప్రధానమైన రెడ్డి సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారన్న భావన ఏర్పడింది.

మరోవైపు టీడీపీకి మాత్రం ఎంత కష్టం వచ్చినా కమ్మ సామాజిక వర్గం మాత్రం వీడలేదు. ఎన్ని కేసులైనా పెట్టించుకుని టీడీపీకి అండగా నిలిచింది ఆ సామాజికవర్గం. జగన్ ప్రతిపక్షంలో ఉండగా సభలకు, సమావేశాలకు, నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతు పలికిన సామాజికవర్గాల్లో రెడ్లు ముందు వరుసలో ఉండేవారు. పాదయాత్ర సమయంలో వేలాది మంది ప్రజలను ఏకం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కోసం చాలా వరకు ఖర్చులు పెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డా అధికారంలోకి వచ్చిన తర్వాత తమను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదన్న భావన రెడ్డి సామాజికవర్గంలో బలంగా ఏర్పడింది.

సొంత వర్గం ఎందుకు దూరం?
ఎంత సేపూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటాడే తప్ప.. సొంత సామాజికవర్గాన్ని కూడా పట్టించుకోవాలన్న విషయం జగన్ మరిచిపోయారని కొందరు రెడ్లు బహిరంగంగా కామెంట్లు చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రెడ్డి వర్గమంతా దాదాపు జగన్ కు దూరం అయ్యింది. ఇక సామాజిక న్యాయం పేరుతో చాలా కాలంగా తమకు వస్తున్న పదవులను కూడా రెడ్లకు కాకుండా ఇతర వర్గాలకు కట్టబెట్టడం వీరికి మింగుడుపడలేదు. తాము నష్టపోయినా జగన్ పట్టించుకోలేదని రెడ్డి సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లు అసంతృప్తితో రగిలిపోయారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి. అయితే, ఈ ఐదేళ్లు పూర్తయ్యే సరికి సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. జిల్లాలకు జిల్లాలే కూటమి స్వీప్ చేసిన పరిస్థితులు వచ్చాయి. ఏ వర్గమైతే జగన్ ముఖ్యమంత్రి కావాలని కష్టపడిందో ఆ వర్గమే ఇప్పుడు దూరమై కూటమికి అధికారం కట్టబెట్టింది. జగన్ కు బాగా బలం ఉన్న కడప లాంటి అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందడం ఆయన మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోంది. కడప జిల్లాలో కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఇక నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి కూటమి మొత్తం అన్ని సీట్లలో పాగా వేసింది.

రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు టీడీపీ వైపు మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సొంత వర్గాన్ని పట్టించుకోకపోవడం జగన్ ను ఇంతటి దారుణ స్థితికి చేరేలా చేసిందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మేకపాటి, ఆనం, కోటంరెడ్డి, మాగుంట లాంటి బలమైన నేతలను దూరం చేసుకోవడం, ఆఖర్లో వేమిరెడ్డిని కూడా దూరం పెట్టడం జగన్ కు ఈ జిల్లాలో కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు, పార్టీలో కీలక పదవుల విషయంలోనూ జగన్ సొంత సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల విషయంలోనూ చాలా మంది రెడ్లు నిరుత్సాహానికి గురి కావడం వల్ల జగన్ కు తీవ్ర నష్టం జరిగింది. కీలక పాత్ర పోషించాల్సిన చోట మిన్నకుండిపోయే పరిస్థితిని చాలా మంది రెడ్లు జీర్ణించుకోలేకపోయారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని కొందరు రెడ్డి నేతలు వాపోతున్నారు. ఏది ఏమైనా సొంత సామాజికవర్గాన్ని ఇప్పటికైనా జగన్ చేరదీయాలని కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి: YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?
YS Jagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ షెడ్యూల్‌లో మార్పు
Weight Loss Foods: బరువు తగ్గిపోవాలా? ఈ ఆహారాలను తినకండి!!
Sun Stroke: వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? నీళ్లు తాగించరాదు!!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు