Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వం మారడంతో సలహాదారులంతా రాజీనామాలు సమర్పిస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో సలహాదారులు వరుసగా రాజీనామాలు చేశారు. సీఎస్ కు 20 మందికి పైగా సలహాదారులు రాజీనామాలు పంపారు. జాతీయ మీడియా సలహాదారు అమర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి సీఎస్‌కు రాజీనామా లేఖలు పంపారు. టీటీడీ ఈవోకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు.
మరోవైపు తమ సర్వీసును పొడిగించాలంటూ గతంలో అభ్యర్థన పెట్టుకున్న ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి, ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమను సర్వీసు నుంచి రిలీవ్ చేయాలంటూ అభ్యర్థన చేసుకున్నారు. ఈ మేరకు సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తనను రిలీవ్ చేయాలని ప్రభుత్వానికి విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఫైళ్లను సీఎస్ జవహర్‌రెడ్డి తిప్పుతున్నట్లు తెలుస్తోంది. రిలీవ్ కోసం అనుమతిని మంజూరు చేసే అధికారం ఆపధర్మ సీఎం జగన్‌కు ఉంటుందా? లేదా అంటూ సచివాలయ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయంలో కీలక పత్రాలను భద్రపరచాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతి ఆఫీస్ లకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా ఆయా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూముల కేటాయింపు, కాంట్రాక్టర్లకు నిధులు విడుదల, అధికారుల బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారిక పత్రాలు, ఎలక్ట్రానిక్ విధానంలో రికార్డులను తక్షణం భద్రపరచాలని ఆదేశించారు. మంత్రుల పేషీల్లోని రికార్డులను సైతం భద్రపరచాలని సూచించారు. కీలక నోట్ ను జీఏడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.
మరోవైపు ఏపీ సెక్రటేరీయట్ లోని ఐటీ విభాగంలో తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఉపకరణాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సెక్రటేరీయట్ లోని కంప్యూటర్ల నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ల్యాప్ టాప్ లు బయటకు తీసుకెళ్లొద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఐటీ వింగ్ ఎస్పీ ప్రకాష్, తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఉద్యోగులు ఉపయోగించే పెన్ డ్రైవ్ లు, హర్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్ స్లైడ్ విక్టరీతో చంద్రబాబు హవా
Cancer Screening: ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ
Contaminated food: మీకు తెలుసా? భారత్‌లో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయట!
Exit Polls: 2019లో ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వచ్చాయి? ఏవి నిజమయ్యాయి?
