Prannoy Roy Interview with YS Jagan: సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, మూడు రాజధానులు, రాష్ట్ర అప్పులు, మద్యం విధానంపై జగన్ వెనక్కు తగ్గడం, విద్యపై జగన్ విజన్.. తదితర కీలక అంశాలను పంచుకున్నారు. ప్రణయ్ రాయ్ పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి.
ప్రజలు మీ పాలన పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ పొలిటికల్ పార్టీల నేతలు మాత్రం అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు. దీనిపై మీ కౌంటర్ ఏమిటి?
అభివృద్ధి అంటే ఏమిటి? చరిత్రలో తొలిసారి ఈ ప్రాంతంలో 4 పోర్టులు కడుతున్నాం. రాష్ట్రంలో మొత్తం 4 ప్రాంతాల్లో దశాబ్దాలుగా 6 పోర్టులు ఉంటే.. కేవలం మా పాలనలోనే కొత్తగా 4 పోర్టులు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. 5 ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతావి శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కర్నూలు ఎయిర్ పోర్టు, కడప ఎయిర్ పోర్టు విస్తరణ చేశాం. విశాఖలో భోగాపురం ఎయిర్ పోర్టు వేగంగా నిర్మాణంలో ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి. మా హయాంలోనే.
3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్.. ఇవన్నీ చాలా చాలా వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాం. ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం వచ్చింది. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి 2 వేల మందికి ఓ సచివాలయం ఉంది. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించాం. ప్రజలను చేయి పట్టుకుని నడిపిస్తూ 600 రకాల సేవలు అందిస్తున్నాం. పౌర సేవలు సచివాలయాల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్షకు తావు లేదు.
ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వస్తోంది. గతంలో ఇవన్నీ ఎప్పుడూ లేవు. రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం. క్వాలిటీ విత్తనాలు, పురుగు మందులు వాటి ద్వారా అందిస్తున్నాం. నాడు నేడు ద్వారా రాష్ట్రంలో 45 వేల స్కూల్లు బాగుపడ్డాయి. 3వ తరగతి నుంచే టోఫెల్ ఒక పీరియడ్‌గా మారింది. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తెచ్చాం. 6వ తరగతి ఆపై విద్యార్థులకు డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా చేశాం. ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు తెచ్చాం. ఇంటర్నేషనల్ బకలారియేట్ అందుబాటులోకి తెచ్చాం. 2025 కల్లా ఫస్ట్ బ్యాచ్ ఐబీ సిలబస్ మొదలవుతుంది. 2035 కల్లా మన పిల్లలు ఐబీ సిలబస్‌లో సర్టిఫికెట్లు అందుకుంటారు.
అంతర్జాతీయంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలతో టై అప్ అయ్యి ఆన్ లైన్ వర్టికల్స్ ను అందుబాటులోకి తెచ్చాం. ఎల్‌ఎస్ఈ, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి వర్సిటీలతో కలిసి పని చేస్తూ ఆ వర్సిటీల సర్టిఫికెట్లు మన విద్యార్థులు పొందేలా చేస్తున్నాం. ఈరోజు మన విద్యార్థి 1వ తరగతిలో చేరాడంటే మరో 10 ఏళ్లపాటు టోఫెల్ పీరియడ్‌గా చదివి ప్రతి తరగతిలో ఇంగ్లీషు సమర్థంగా మాట్లాడగలిగి, 30 శాతం కోర్సు ఎల్ఎస్‌సీ, హార్వర్డ్, ఎంఐటీ, స్టాన్ ఫోర్డ్ లాంటి వర్సిటీలు సర్టిఫైడ్ చేసి సర్టిఫికెట్లు అందిస్తే.. ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడి సీఈఓలు, పెద్ద పెద్ద పోస్టులకు పోటీ పడి ఉద్యోగాలు చేయగలుగుతాడు.
అప్పులు ఎక్కువ చేస్తున్నారనే ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు?
ప్రతి రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తుంది. ఆర్థిక బాధ్యత ప్రతి రాష్ట్రంపైనా ఉంటుంది. బడ్జెట్ మేనేజ్ మెంట్ యాక్ట్ ఉంటుంది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు పరిశీలిస్తే ఇప్పుడేం జరుగుతోంది, గతంలో ఏం జరిగిందన్నది తెలుస్తుంది. 14.5 శాతం మన హయాంలో గ్రోత్ రేటు ఉంటే, గత ప్రభుత్వంలో అది 21 శాతం. ఇవన్నీ ఆర్బీఐ చెప్పిన గణాంకాలే. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నంబర్లే. ఈ డేటా ప్రతి చోటా అందుబాటులో ఉంది. దీనిపై నేను చాలా సార్లు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాను.
దురదృష్టవ శాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోబెల్ ప్రచారం చేసే వాళ్లు ఉన్నారు. అలాంటి వైఖరితో ఉన్న మీడియా ఇక్కడ ఉంది. నేను ఫైట్ చేస్తున్నది కేవలం చంద్రబాబు నాయుడుతో మాత్రమే కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అన్నీ చంద్రబాబుతో కలిసి వస్తున్నాయి. వీరందరితో నేను పోరాడుతున్నాను.
ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా అభివృద్ధి, సంక్షేమానికి జరుగుతున్న పోరాటంగా భావిస్తారా? ఈ ఎన్నికలను ఎలా చూస్తారు?
ఇదివరకే నేను అభివృద్ధి గురించి మాట్లాడాను. ఈ తరహా అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేదు. వాస్తావానికి మా హయాంలో కేపిటల్ ఎక్స్‌పెండిచర్.. చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువే. వాళ్ల యావరేజ్ 15 వేలు అయితే, మా యావరేజ్ 17 వేలు.
ధనికులు సంతోషంగా ఉన్నారా? పేదలు సంతోషంగా ఉన్నారా? ఎవరూ సంతోషంగా లేరా?
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాష్ట్రం ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా జరుగుతున్నది డీబీటీ పద్ధతి. ఈ 59 నెలల్లోనే మొట్ట మొదటి సారిగా ప్రతి పథకం ప్రజలకు చేరువయ్యేలా ఛానలైజ్ చేశాం. ఎక్కడా అవినీతి లేదు. వివక్షకు తావు లేదు. డీబీటీ ద్వారా ప్రజలకే నేరుగా డబ్బులు జమ చేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. గతంలో డబ్బులు వాళ్లలో వాళ్లే పంచేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు చేరుతోంది.
ఈ ఎన్నికల్లో మీరు కొత్తగా చేయదల్చుకున్న రెండు మూడు పనులేంటి?
ఈ ఎన్నికలు కేవలం ఒకే అంశం మీద జరుగుతున్నాయి. అదే విశ్వసనీయత. నా ఎన్నికల ప్రచారంలో కూడా నేను ఒక్కటే అడుగుతూ వచ్చాను. ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందని అనుకుంటేనే, నేను సీఎం కుర్చీలో కూర్చొంటేనే మీ జీవితాలు మారుతాయని భావిస్తేనే నాకు ఓటు వేయండని చెబుతూ వస్తున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నెన్స్ లో మార్పులు తీసుకొచ్చింది ఈ 59 నెలల కాలంలోనే. నా వల్ల పేదల భవిష్యత్తు బాగుంటుందని నమ్మితేనే నాకు ఓటు వేయండని చెబుతూ వస్తున్నాను.
ఇది అభివృద్ధి సంక్షేమానికి జరుగుతున్న యుద్ధం కాదు, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నారు? దీని గురించి వివరించండి..?
ఈ ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్యే. పెత్తందార్లంటే కేవలం డబ్బు ఉన్న కాదు. డబ్బులు ఎక్కువగా ఉండి, పేదలపై వివక్ష చూపిస్తున్న వారు పెత్తందార్లు. వారి పిల్లలను మాత్రం ఇంగ్లీషుమీడియంలో కార్పొరేట్ బడుల్లో చదివించవచ్చు కానీ, ప్రభుత్వ స్కూళ్లలో పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం అందుబాటులోకి తెస్తే సహించలేకపోతున్నారంటే మీరు నమ్ముతారా? ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న వివక్ష. మేము 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు అందించాం. మీరు నమ్ముతారా? పెత్తందార్లంతా కలిసి ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు. ఈ పట్టాల పంపిణీని ఆపాలని ప్రయత్నించారు. పైగా డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ పిటిషన్లలో పేర్కొంటున్నారు. దీన్నే పెత్తందారీ పోకడ అంటారు. అందుకే నేను పెత్తందార్లు వర్సెస్ పేదలు అంటాను.
అభివృద్ధి విషయంలో కోస్తా, ఆంధ్ర ఒక ఎత్తు. రాయలసీమ మాత్రం ప్రత్యేకం. రెండు ప్రాంతాలను ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారు?
అభివృద్ధి వికేంద్రీకరణ మా ఫార్ములా. గ్రామ స్థాయిలోకి ప్రభుత్వానికి తీసుకెళ్లడం. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు.. ఈ మోడల్ లో డీసెంట్రలైజేషన్ చేశాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. పరిపాలన ప్రజలకు చేరువ చేయగలిగాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా పరిపాలన చేయగలిగాం. మూడు రాజధానులు మా విధానం. రాయలసీమను న్యాయ రాజధానిగా, సెంట్రల్ ఆంధ్రను శాసన రాజధానిగా కొనసాగిస్తూ, వైజాగ్ ను ఎకనామిక్ పవర్ హౌస్ గా చేయాలన్నది మా విధానం. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలి. ఇదీ మా విజన్.
అమరావతి సంగతి ఏమిటి?
కొందరు అమరావతి సంగతి ఏమిటి అని నన్ను అడుగుతున్నారు. మొదట అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే అమరావతి ఎక్కడుంది? అమరావతి ఏమిటి? అమరావతి అన్నది విజయవాడలో లేదా గుంటూరులో లేదు. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే అమరావతి. 50 వేల ఎకరాల వ్యవసాయ భూమి తీసుకున్నారు. కానీ, బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా సమకూర్చలేకపోయారు. రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రెయినేజీ, సీవరేజ్ లాంటి బేసిక్ సదుపాయాలు కూడా లేవు. ఎకరాకు 2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలు అంటే.. ఇప్పుడు దాని విలువ ఒక లక్ష కోట్లు. ఇప్పుడు దానికి పెట్టుబడి పెట్టాలంటే మరో 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది అభివృద్ధి చెందాలంటే. ఒక లక్ష కోట్లు కాస్తా 15 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇది పూర్తిగా ఒక కలగా మిగిలిపోతుంది.
మరోవంక వైజాగ్ ను తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సిటీ. బిగ్గెస్ట్ పవర్ ఇంజిన్. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి సీఎంవో అక్కడ కూర్చొని పాలన చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని ఐకానిక్ భవనాలు వెలుస్తాయి. వీటికి ఖర్చు కూడా ఎక్కువగా కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు భోగాపురంలో రాబోతోంది. ఇలా మూడు నాలుగు మోన్యుమెంటల్ భవనాలకు పెద్ద ఖర్చు కూడా కాదు. ఇలాంటి సదుపాయాలు వైజాగ్ లో ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి అక్కడి నుంచే పరిపాలన చేయడం ద్వారా విశాఖను అభివృద్ధి చేయడమే కాదు, పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడేలా చేయడం సాధ్యమవుతుంది. కానీ అమరావతి రాజధాని అనుకుంటే అది కేవలం కలగానే మిగిలిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో ఎప్పటికీ పోటీ పడలేం. అదే విశాఖలో అయితే ఇప్పటికే కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ప్రత్యేక హోదా ఏపీకి కావాలంటున్నారు. కానీ సాధించలేకపోయారు. పైగా బీజేపీకి మద్దతుగానే వెళ్తున్నారు?
ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి ఇప్పటికీ అవసరం. ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆ ప్యాకేజీ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక హోదా చాలా ముఖ్యం అన్నది ఆయనే, హోదా సంజీవని కాదన్నదీ ఆయనే. కానీ మాకు ప్రత్యేక హోదా అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ. దురదృష్టవ శాత్తూ కాంగ్రెస్ కూడా న్యాయం చేయలేదు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో చేర్చకుండా తీవ్ర అన్యాయం చేసింది. చేర్చి ఉంటే మేము కోర్టుకు వెళ్లేవాళ్లం. బీజేపీ వాళ్లు కూడా ఈ విషయంలో తప్పించుకుంటున్నారు. నాడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో బీజేపీతో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. అదే మా విషయానికి వస్తే.. ప్రత్యేక హోదా అడగని సందర్భం లేదు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సందర్భంలోనూ నేను లెటర్లు రాశాను. ప్రతి లెటర్ లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంటుంది. హోదా అంశాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోతే, అప్పుడు మా వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే ప్రత్యేక హోదా అన్నది సాకారం అవుతుంది.
మద్దతు అవసరమైతే మీరు సపోర్ట్ చేస్తారా?
ప్రత్యేక హోదా అన్నది కార్యరూపం దాల్చాలి. అంతిమంగా మాకు కావాల్సింది ఏమిటి? రాష్ట్రానికి కావాల్సిందేమిటి? ప్రత్యేక హోదా లేనప్పుడు.. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు మరెవైరా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? హోదా ఇస్తామని చెప్పి వేదికపై ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ వారి ఎజెండాలోనే హోదా అంశం లేదు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే సాధిస్తారంటున్నారు. కానీ 2014-19 మధ్య డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నట్లే కదా. అప్పుడేం చేశారు? సేమ్ ఇదే పవన్ కల్యాణ్ బీజేపీని ఉద్దేశించి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అని కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు 2024 వచ్చే సరికే అందరూ కలిసిపోయారు.
మద్యం విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. లిక్కర్ క్వాలిటీ లేకపోవడం, అవినీతి చోటు చేసుకోవడం అనే ఆరోపణలపై మీరిచ్చే సమాధానం?
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక్క లిక్కర్ కంపెనీకి కూడా మేము లైసెన్సులు ఇవ్వలేదు. నేను ఒక శాతం కూడా మద్యానికి మద్దతు ఇవ్వను. నేను తాగను. ఒక్క డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. ప్రతి లైసెన్సు కూడా చంద్రబాబు ఇచ్చినదే. మేము వచ్చిన తర్వాత ట్యాక్సులు పెరిగాయి. మద్యం అమ్మకాలు 40 శాతం తగ్గిపోయాయి. ఎవరైనా మద్యంపై ఆసక్తి ఉన్న వారు అమ్మకాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మేము రేట్లు పెంచేశాం. ఆదాయం చూసుకోలేదు. ప్రయివేటు వ్యక్తులు బెల్ట్ షాపులను నడిపిస్తారు. ఎక్కువ ఆదాయం వచ్చేలా చేసుకుంటారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇప్పుడు బెల్ట్ షాపులు లేవు. ఫిక్స్ డ్ టైమింగ్ అమలు చేస్తున్నాం. పర్మిట్ రూములు తీసేశాం. గతంలో పర్మిట్ రూములో కూర్చొని తాగుతుండేవారు. పక్కనే రోడ్డుపై మహిళలు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇందులో ఆదాయం కోణం ఏ మాత్రం లేకుండా చేశాం.
కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు కదా?
గతంలో ఎమ్మార్పీ ఒకటి ఉంటే విక్రయ ధర మరొకటి ఉండేది. వేలంలో టీడీపీ కేడర్ మాత్రమే పాల్గొనేవారు. రూ.100కి దొరికే మద్యం రూ.140 పెట్టి కొనేవారు. ఇది అందరికీ తెలిసినదే. మేము ఏం చేశామంటే.. 100కి దొరికే మద్యం రూ.140 చేశాం. ట్యాక్సులతో కలిపి రేటు ఫిక్స్ చేశాం.
నాన్న ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారా? చివరగా ఏం చెబుతారు?
ఇప్పుడు చేస్తున్న మంచి కొనసాగిస్తాం. నాన్న ఆశయాలను నెరవేర్చే దిశగా నా అడుగులు ఎప్పటికీ పడుతూనే ఉంటాయి. నాన్నను చాలా మిస్ అవుతున్నా. అని సీఎం జగన్ ముగించారు.
Read Also: Attack on CM Jagan: సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడికి బెయిల్
YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్ కాన్ఫిడెన్స్ ఇదీ
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్ గుర్తుకు గుద్దితే బ్యాలెట్ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
YS Jagan in Kaikaluru: చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి: కైకలూరులో సీఎం జగన్
