Jawahar Reddy: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా కలిసి ఒంటికాలిపై లేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు.. అంతకు ముందు ఎప్పుడూ ఏ ఆరోపణలూ సీఎస్ పై చేయని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీల చోటా మోటా నేతలు.. ఎన్నికల సమయం వచ్చే సరికి సీఎస్, డీజీపీపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. డీజీపీపై అంటే శాంతిభద్రతలు, తమ కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేస్తున్నారనే కారణాలు చెప్పి విమర్శలు చేయొచ్చు. కానీ… సీఎస్ జవహర్ రెడ్డి తొలి నుంచి ఒకే రకంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే.. ఆయనపై వీరంతా ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు. ఇంతకీ సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక అసలు సంగతి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో 2019లో అధికారం మార్పు జరిగిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐపీఎస్ లు, ఐఏఎస్ లకు స్థాన చలనం, మార్పులు, ట్రాన్స్ ఫర్లు, డిస్మిస్ లు మొదలుకొని చాలా జరిగాయి. అందులో భాగంగా సీఎం జగన్ వచ్చీ రాగానే డీజీపీని మార్చేశారు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా జరిగేదే అయినా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేలా అప్పటి చంద్రబాబు సర్కార్ కు అప్పటి డీజీపీ సహకరించారు కాబట్టి.
ఇక అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఏకంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అది ఐదేళ్లయినా సరే.. ఇప్పటికే ఓ అంతూపొంతూ లేకుండా చిక్కుముడిగానే కొనసాగుతోంది. ఇది అలా ఉంచితే, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత జీడీపీగా గౌతమ్ సవాంగ్ ను ఏరికోరి తెచ్చుకుంది. మూడేళ్లపాటు బాగానే జరిగినా, ప్రభుత్వ ఉద్యోగుల మార్చ్ కోసం సహకరించారనే కారణంతో డీజీపీపై వేటు వేసింది జగన్ సర్కార్. అటు తర్వాత సీఎస్ లు కూడా పలువురు మారారు. నీలం సాహ్ని వచ్చి కొన్నాళ్లు కొనసాగి వివాదం లేకుండా వెళ్లిపోయారు.
ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అయితే పెద్ద దుమారమే రేపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా తెలుగుదేశం పార్టీకి సహకరించాలని చూడటంపై అధికార వైసీపీ భగ్గుమంది. ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నా కోర్టుల్లో చుక్కెదురైంది. తమిళనాడు నుంచి ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి నియమించాలని చూసినా అది బెడిసి కొట్టింది. దీంతో చేసేదేమీ లేక నిమ్మగడ్డ రిటైర్ మెంట్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఇలా అధికారుల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లలో చాలా దెబ్బలు తగిలాయి. తనకు అనుకూలురైన వారిని నియమించుకోవడం అంత తేలికగా జరగలేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ సర్కార్.. ఎన్నికల తరుణంలో ఆయనపై కూడా సానుకూలంగా ఉండలేకపోయిందట. అయితే, డీజీపీ మాత్రం ప్రభుత్వ పెద్దలతో సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ప్రతిపక్షాలు మాత్రం గగ్గోలు పెట్టాయి.
అమాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారంటూ కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేసిన పరిస్థితులు కనిపించాయి. సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సైతం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికలు జరిగే ముందు డీజీపీని తప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. అదే జోరులో సీఎస్ ను సైతం తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
కానీ జవహర్ రెడ్డి తొలి నుంచి వివాద రహితుడిగా ఉండటంతో కేంద్రం కూడా చూసీ చూడనట్లు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జవహర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, బీజేపీలోని టీడీపీ అనుకూల చంద్రబాబు మనుషులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఓ వర్గం మీడియా కక్ష గట్టాయి. ఆరోపణలు వర్కవుట్ కాలేదనే సాకుతో ఇక అవినీతి ఆరోపణలు చేయడం మొదలు పెట్టాయి. ఇదంతా 40 ఏళ్ల ఇండస్ట్రీ సూచనల మేరకేనంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేసింది కూడా.
కానీ… జవహర్ రెడ్డిపై ఇంతలా ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణమా? లేదా సామాజిక వర్గం కోణంలో చూశారా? లేదా తమ అనుకూలమైన వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టలేదనే కసి పెంచుకున్నారా? లేదా మరే ఇతర కారణాలు అయినా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. మరో నెల రోజుల్లో సీఎస్ జవహర్ రెడ్డి రిటైర్ కానున్నారు. పదవీ విరమణ చేసే ముందు కెరీర్లో ఏ మచ్చా లేకుండా ఉద్యోగం చేసిన ఆయనను భ్రష్టు పట్టించాలనే కుట్రతోనే అందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారన్నది మాత్రం వాస్తవం అంటూ అధికార పార్టీలోని కొందరు నాయకులు బాధపడుతున్నారట.
Read Also: CS Jawahar Reddy: రక్తహీనత, పౌష్టికాహార లోపాల నివారణకు తక్షణ చర్యలు
CS Jawahar Reddy review: దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు
Jawahar Reddy on employees: మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం: సీఎస్ జవహర్‌రెడ్డి
Education: పిల్లలకు బడిపై ఆసక్తి పెంచేవి వృత్తి విద్యా కోర్సులు
