CM Jagan on Land Titling Act: ఇటీవల కాలంలో ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుమారం రేగుతోంది. రైతుల భూములను సీఎం జగన్ లాక్కుంటున్నారంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాల దుష్ప్రచారం ఆగడం లేదు. దీంతో నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి.. ఇవాళ హిందూపురంలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఈ చట్టంపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ చట్టం వల్ల ఏం జరుగుతుందో ఆయన మాటల్లోనే…
“ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తున్నారు. మీ ఇంటికి ఫోన్లు కూడా చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబూ నువ్వసలు మనిషివేనా? మీ జగన్.. మీ బిడ్డ భూములిచ్చేవాడే కానీ, భూములు లాక్కునే వాడు కాదు. అసలు చంద్రబాబునాయుడిని అడుగుతున్నాను.. అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే తెలుసా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే దాని అర్థం ఏమిటంటే భూములు మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేలలా ఉండేటట్టుగా ఒక యాక్టు చేయడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఫస్టు అది తెలుసుకో చంద్రబాబూ.
ఇవాళ ఈ పెద్దమనిషి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి కాబట్టి.. మీ అందరితో రెండు నిమిషాలు దాని గురించి చెబుతాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలన్నా…ఆ భూముల్లో వివాదాలున్నాయి. ఆ భూముల్లో ఎక్స్ టెంట్ అన్నా తక్కువ ఉంటుంది. సబ్ డివిజన్ జరగకపోవడమో, సర్వే జరగకపోవడమే, రికార్డులు అప్ డేట్ కాకపోవడమో జరిగి ఉంటుంది. వీటన్నింటి వల్లా భూవివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు అందరూ కోర్టులు, అధికారులు చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతుంది.
మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకున్న సంస్కరణ ఏమిటంటే.. ఏ రైతన్న, ఏ ఒక్కరూ కూడా వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్లకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ.. ఆ భూముల మీద ఏదన్నా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంటు గ్యారంటీ ఇస్తూ.. ఈ భూముల మీద వివాదం లేదు అని గ్యారంటీ ఇస్తూ చెప్పే ఒక సంస్కరణ తీసుకురావాలని మీ బిడ్డ ఆలోచన. ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే.. ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదం కూడా ఉండకుండా చూడడంతో పాటు, టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి, ఎటువంటి వివాదం కూడా లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే.. మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి.
అప్పుడెప్పుడో బ్రిటీషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకునివచ్చి అందులో 15వేల మంది సర్వేయర్లుని కూడా పెట్టాం. వందసంవత్సరాల కిందట సర్వే జరగ్గా.. రైతుల కోసం మరలా ఈ రోజు మీ బిడ్డ ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తున్నాడు. రికార్డులన్నీ అప్ డేట్ చేయిస్తున్నాడు. సబ్ డివిజన్ చేయిస్తున్నాడు. చేసి ఆ రైతున్నలకే హక్కు పత్రాలను ఎక్కడికీ పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టు చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తైన తర్వాత.. రాష్ట్రంలో 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటివరకు 6వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా ఒకటిన్నర, రెండు సంవత్సరాలలో పూర్తిగా 17వేల గ్రామాలలో సర్వే పూర్తవుతుంది.
ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గరా వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది. సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి. రికార్డులన్నీ అప్ డేట్ అయిన భూములు ఉంటాయి. సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ పేదలు, ఆ రైతన్నల దగ్గర ఉంటాయి. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి ఏ స్ధాయిలోకి తీసుకునిపోతామంటే.. ఆ భూములన్నింటికీ వివాదాలు ఏమన్నా వస్తే.. ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి, తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు చెప్పే అబద్దాలను, మోసాలను ఏ ఒక్కరూ నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ ప్రార్ధిస్తున్నాను.
రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఇదేరకమైన అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు ఈ సందర్బంగా నీకే చెబుతున్నాను. ఇప్పటివరకు ఏకంగా 9లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్డ్ టూ సాఫ్ట్ వేర్ తీసుకుని వచ్చి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ సాప్ట్ వేర్ ద్వారా 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా… ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈ భూహక్కు యజమానులకే ఇవ్వడం జరిగింది.
దీన్ని మరింత సునాయాసం చేస్తూ… ఏ ఒక్కరికీ ఏ సమస్య ఉండకూడదని, ఆ పత్రాలు రాసుకునేటప్పుడు వాటిలో తప్పులు ఉండకూడదని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్ లైన్ లో అవైలబుల్ చేస్తూ… ఏ ఒక్కరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ ను డౌన్లోడ్ చేసుకుని.. వాళ్లే ఆ ఫార్మాట్ లో వివరాలన్నీ నింపి.. వాళ్లే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి ఆ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని వెళ్లి.. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలిముద్రలు మిగిలిన కార్యక్రమమంతా పూర్తి చేసుకుని.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది తెలుసుకో చంద్రబాబూ.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఇవాళ రాజకీయ వ్యవస్ధ చెడిపోయింది. ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అబద్దాలు చెబుతున్నారు .ఇంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మిమ్నల్ని అందిరినీ నేను కోరేది ఒక్కటే. వీళ్లు చెబుతున్న అబద్దాలు నమ్మకండి. వీళ్లు చేస్తున్న మోసాలు నమ్మకండి.
మీ అందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి అని మాత్రం మీ అందరితో కోరుతున్నాను. ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే మీ అందరికీ చెబుతున్నాను.” అని సీఎం జగన్ వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: YS Jagan in Hindupur: ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? చూశామా? హిందూపురంలో సీఎం జగన్
YS Jagan in Palamaneru: 2014లో ఇంటింటికీ పంపిన పాంప్లెట్‌లో ఒక్కటైనా నెరవేర్చారా? పలమనేరులో సీఎం జగన్
YS Jagan in Nellore: 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా? నెల్లూరులో సీఎం జగన్
YS Jagan in Narasapuram: జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, బాబుకు ఓటేస్తే ముగింపే.. నరసాపురంలో సీఎం జగన్
YS Jagan in Pedakurapadu: ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు మారింది ఎప్పుడు? పెదకూరపాడు సభలో సీఎం జగన్
