Home Voting: పోలింగ్ స్టేషన్ ఇంటి వద్దకే వచ్చింది. అదెలా అనుకుంటున్నారా? హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను ఆయన ఇవాళ మీడియాకు వివరించారు.
హోం ఓటింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ అర్హత కలిఉన్నారని, వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 5,17,227 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.
వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారన్నారు. మార్చి 16 న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకూ అధికార బృంధాలు అర్హులైన హోం ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి హోం ఓటింగ్ ను వినియోగించుకునేందుకు అభిలషించిన వారి నుండి ఫారం -12D లను సేకరించడం జరిగిందన్నారు. హోం ఓటింగ్ కు అర్హత ఉన్న వారిలో కేవలం 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.
హోం ఓటింగ్ ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృంధం వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేసి హోం ఓటింగ్ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో నేటి నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో కేసు దాఖలు అయినందువల్ల, బ్యాలెట్ పేపర్ ముద్రణలో ఒక రోజు ఆలస్యం అయిందన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేసుకున్న కొన్ని జిల్లాలో నేటి నుండి హోం ఓటింగ్ను ప్రారంభించారన్నారు. పలు జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలును రూపొందించుకుని అమలు చేయడం జరుగుచున్నదని, ఏదేమైనప్పటికీ ఈ హోం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఈ నెల 8 కల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
YS Jagan in Bobbili: పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.. బొబ్బిలిలో సీఎం జగన్
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
