AP Nominations: ఏపీలో ఎన్నికల పర్వం మొదలైంది. ఇవాళ తొలిరోజు నామినేషన్ల పర్వం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో సగం హడావుడి మొదలైనట్లు అయింది. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.
ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారు. మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారు. అభ్యర్థితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారు.
నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
* అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురాలి.
* పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్ 2బి లో ధరఖాస్తు చేయాలి.
* నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
* పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
* అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
* నామినేషన్లను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్రమే సమర్పించాలి.
* అభ్యర్ది తన నామినేషన్‌ను నేరుగా గానీ, తన ప్రపోజర్ ద్వారా గానీ సమర్పించవచ్చు.
* అభ్యర్ధి నామినేషన్‌తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.
* 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
* నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి.
* అభ్యర్ధితో సహా ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.
* నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
* అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
* సువిధ యాప్ ద్వారా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వాటి కాపీలను భౌతికంగా ఆర్ఓకు అందజేయాల్సి ఉంటుంది.
* ఫారమ్-26 ద్వారా తన అఫడవిట్‌ను సమర్పించాలి.
* ఫారమ్ 26 స్టాంప్ పేపర్ యొక్క విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
* భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే E స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు.
* అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
* పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు మరియు ముఖ్యమైన తేదీలు:
* గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
* గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
* నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
* నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
* అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
* పోలింగ్ తేదీ: 13 మే 2024 (సోమవారం)
* కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)
* ఎన్నికలు ముగిసేలోపు తేదీ : 06 జూన్ 2024 (గురువారం)
ఇవీ చదవండి: EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
