Pensions AP: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ నేడు ప్రారంభమైంది. చాలా కాలం తర్వాత తొలిసారి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు లేకుండా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది.
ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పెన్షన్‌దారులకు సాఫీగా పెన్షన్ అందేలా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీని ప్రారంభించి బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న,వృద్ధులు, వికలాంగులు వంటి నాలుగు విభాగాల పెన్షన్‌దారులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అందించాలనే నిబంధనలను సవరించినట్లు పేర్కొన్నారు. ఈ విభాగాల పెన్షన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేకుండా ఇంటి వద్దే పెన్షన్ అందజేస్తారని తెలిపారు. అందుకు సంబంధించి ప్రభావవంతమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలిపారు.
వేసవి ఎండలు దృష్ట్యా గురువారం నుంచి ఉదయం 7.00 గంటల నుండి గ్రామ/వార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
YS Jagan on CBN: అవ్వాతాతలకు నష్టం జరుగుతుందని ఆలోచన చేయని చంద్రబాబు
