HomeAndhra PradeshYSRCP vs Sharmila: అన్న జగన్‌పై కామెంట్స్‌తో దూకుడు పెంచిన షర్మిల? వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను...

YSRCP vs Sharmila: అన్న జగన్‌పై కామెంట్స్‌తో దూకుడు పెంచిన షర్మిల? వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను తట్టుకోగలరా?

YSRCP vs Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా దివంగత వైయస్సార్‌ తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చీ రాగానే అన్నపై, బీజేపీ, టీడీపీపైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు షర్మిల. బీజేపీ, టీడీపీపై విమర్శలు ఊహించనదే అయినా, తొలిరోజే అన్నపై సీరియస్‌ కామెంట్స్‌, విమర్శలు గుప్పించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. (YSRCP vs Sharmila)

షర్మిల కామెంట్స్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఉషశ్రీచరణ్‌ కౌంటర్ ఇచ్చారు. ఇక వైయస్సార్‌సీపీ సోసల్‌ మీడియా ఇంకా మొదలు పెట్టినట్టు కనిపించలేదు. జగన్‌ సిగ్నల్‌ కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు షర్మిలపై విమర్శలు, ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇక జగన్‌పై నేరుగా కమెంట్స్‌తో వైయస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా మొదలు పెడితే షర్మిల ఆ జోరుకు అడ్డుకట్ట వేయగలరా? తట్టుకొని రాజకీయాలు చేయగలరా?

తెలంగాణ ఎన్నికల ముంగిట వైయస్సార్‌టీపీ పేరుతో పార్టీ పెట్టి హడావుడి చేసి, తీరా అక్కడ పోటీ చేయకుండానే వెనుదిరిగి నవ్వులపాలైన షర్మిల.. ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఆమెను చేరదీయకపోవడం, ఒక పద్ధతి లేకుండా ఎవరిపై పడితేవారిపై తీవ్ర పదజాలంతో దూషించడం, తెలంగాణలో అసలు పోటీ చేయలేకపోవడం, కేసీఆర్‌పై జుగుప్సాకర వ్యాఖ్యలు, కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం.. సొంత ప్రయోజనాల కోసం అన్నపై కోపం… వెరసి తాను ఏం చేస్తున్నానో తెలియకుండా మూర్ఖంగా ముందుకెళ్తున్నారు షర్మిల.

మొదట పార్టీ పెట్టి మూడు వేల కిలోమీటర్లకుపైగా తెలంగాణలో తిరిగి.. ఏపీతో కూడా కొట్లాడతామని కామెంట్స్‌ చేశారు షర్మిల. ఈ క్రమంలో కేసీఆర్‌ ప్రభుత్వం, కేటీఆర్‌, కేసీఆర్‌లపై వ్యక్తిగతంగానూ దూషించారు. అక్కడ జగన్‌పై ఉన్న గౌరవంతో కొందరు బీఆర్ఎస్‌ నేతలు షర్మిల జోలికి వెళ్లలేదు. కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు ముఖ్య నేతలు షర్మిలను, ఆమె వ్యాఖ్యలను, రాజకీయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో తన పాదయాత్రకు అడ్డు వస్తున్నారంటూ షర్మిల తీవ్రస్థాయిలో పదప్రయోగం, హైకోర్టులో కేసులు, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ జామ్‌ క్రియేట్‌ చేస్తుంటే కారుతోపాటు షర్మిలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలతో షర్మిల తన రూటు మార్చారు. కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఈ క్రమంలో తనకు పీసీసీ పదవి, సీఎం పదవి కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అక్కడ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చాలా మంది మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ నేపథ్యంలో షర్మిలను పట్టించుకొనేవారు కరువయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అధినాయకత్వం, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేలతో షర్మిల మంతనాలు జరిపింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా షర్మిల ఈ మంత్రాంగం నడిపింది.

చివరకు సోనియా గాంధీతో మీటింగ్‌ తర్వాత ఆమెకు ఓ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చవద్దని, ఏపీకి వెళ్లి పగ్గాలు చేపట్టాలని ఒప్పందం కుదిరింది. ఆ మేరకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా షర్మిల సైలెంట్‌ అయ్యారు. అయితే, తాను పోటీకి దూరంగా ఉండటం వల్లనే కేసీఆర్‌ ఓడిపోయాడని, కాంగ్రెస్‌ గెలుపునకు ఇదే కారణమంటూ వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవానికి షర్మిల బలం ఎంత అనేది పోటీ చేసి ఉంటేనే తెలిసేది. కానీ తెలివిగా ఆమె తప్పించుకున్నారు.

కాంగ్రెస్‌ పెద్దలతో ఒప్పందం ప్రకారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న షర్మిల.. ఆ వెంటనే ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పేరు ప్రకటించేలా చూసుకున్నారు. ఈలోపు తన తనయుడు రాజారెడ్డి వివాహం వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ కారణం చూపి షర్మిల రాజకీయ పార్టీల నేతలందరితోనూ భేటీ అయ్యారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను నేరుగా కలిసి తనయుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. బీజేపీ నేతలనూ కలిశారు. బీఆర్‌ఎస్‌ నేతలతోనూ సమావేశమై ఆహ్వానాలు అందించారు. అనంతరం తాడేపల్లికి వచ్చి అన్న జగన్‌ను పెళ్లికి రావాలని ఆహ్వానించింది.

కుటుంబం కావడంతో జగన్‌కు ఇష్టం లేకపోయినా అల్లుడి వివాహ రిసెప్షన్‌కు వెళ్లి వచ్చారు సీఎం జగన్‌. ఫంక్షన్‌లో జస్ట్‌ ఫొటో దిగి ముభావంగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వచ్చేశారు. ఇక ఆ తర్వాతనే అసలు రాజకీయం మొదలైంది. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అన్నపై కోపంతో తండ్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్‌ను భుజానికెత్తుకున్నారు షర్మిల. తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో అన్నీ మర్చిపోయి నేడు అన్నపైనే విమర్శలు చేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఇక సీఎం జగన్‌ కూడా ఇటీవల ఓ బహిరంగ సభలో చంద్రబాబును ఉద్దేశించి కుటుంబాలను నిలువునా చీల్చి రాజకీయాలు చేస్తారని కామెంట్‌ చేశారు. ఇప్పుడు తనపైనే చెల్లి విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో శ్రేణులు ఎలా స్పందించాలో ఇంకా సిగ్నల్‌ రావాల్సి ఉంది. ఒక స్టాండ్‌ తీసుకున్న తర్వాత వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా అంత తేలిగ్గా విడిచిపెట్టదు. ఈ విషయం ఇప్పటికే చాలా పార్టీలకు, నేతలకు, విమర్శకులకు బాగా అర్థమైంది.

దేశంలోనే బీజేపీ సోషల్‌ మీడియా తర్వాత అతిపెద్ద నెట్‌వర్క్‌, అభిమానులు, ఫాలోవర్లు కలిగిన పార్టీ వైయస్సార్‌సీపీ. సోషల్‌ మీడియాలో సౌత్‌లోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. జగన్‌పై ఎలాంటి విమర్శలొచ్చినా అభిమానంతో వెంటనే దానికి కౌంటర్లు, దిమ్మతిరిగే జవాబులు ఇస్తుంటారు. అలాంటిది జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహిస్తారా? వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా దెబ్బ తట్టుకోవడం అంటే అది చాలా కష్టం. మరి షర్మిలపై వైయస్సార్‌సీపీ సోషల్‌ సైన్యం వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది.. చంద్రబాబు చివరి అస్త్రమే షర్మిల

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు