Deeparadhana: దీపారాధన నియమాలు ఏంటి? పూజ సమయంలో ఎలాంటి దీపాలు వినియోగిస్తే ఏ రకమైన ఫలితాలు కలుగుతాయి? ఏ సమయాల్లో దీపం వెలిగించాలి. ఎలాంటి నూనె వాడాలి? ఏ దిక్కున దీపం వెలిగించాలి? అనే విషయాలపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాటికి పరిష్కారం చేసేందుకు ఈ కథనంలో కొన్ని వివరాలు తెలుసుకుందాం. (Deeparadhana)
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వ తమోపహమ్..
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీప నమోస్తుతే..
శుభం కరోతు కళ్యాణ మారోగ్యం సుఖ సంపదం
శత్రు బుద్ధి వినాశం చ దీపజ్యోతి ర్నమోస్తుతే
దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం, సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపానికి నమస్కరించడం మన సనాతన సంప్రదాయంలో భాగంగా వస్తోంది. హిందూ ధర్మం ప్రకారం దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యం, ప్రాశస్త్యం ఉన్నాయి. ఇక ఎలాంటి దీపాలు వాడాలనే విషయానికి వస్తే.. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరంగా భావిస్తారు.
నేటి కాలంలో గజిబిజి జీవనశైలి కారణంగా చాలా మంది ఉదయం త్వరగా నిద్ర నుంచి లేవలేకపోతున్నారు. కనీసం ఉదయం 7 గంటల్లోపు దీపారాధన చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరికలు నెరవేరుతాయట.
ఇక ఏ దిక్కున దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారట. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సాకారం అవుతాయి. అయితే, దక్షిణంవైపు దీపారాధన చేయరాదని, ఇలా చేయడం వల్ల అపశకునాలు, కష్టం, దుఖం, బాధలు వెంటాడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఎలాంటి వత్తులు వాడాలనే విషయం గమనిస్తే.. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వినియోగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారట. జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగించడం వల్ల ఈతి బాధలు తొలగుతాయి.
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయానికి వస్తే.. ఎట్టి పరిస్థితులలో వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం అవుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే బాధలు తగ్గుతాయి. ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగించడం వల్ల సకల సంపదలు ఒనగూరి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.
దీపాన్ని వెలిగించే సమయంలో కొన్నిముఖ్యమైన పద్ధతులు అనుసరించాలి. వాటిలో మొదటిది..
1. దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు, లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాధన చేయాలి.
2. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే.. సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్లూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి.
3. దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడి, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు.
4. దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరుచుకోవాలి. పరిశుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి.
5. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొద్దిగా పసుపు, కుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి.
ఇలా కొన్ని సూత్రాలు పాటించడం వల్ల దీపారాధన సమస్త ఫలితాలు మీకు చేకూరి మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండటానికి దోహదపడుతుంది.
ఇదీ చదవండి: Deeparadhana: ఇంట్లో దీపారాధన ఆడవాళ్లు చేయాలా? మగవారు చేయాలా?
