Water Meeting: ఇటీవల నాగార్జున సాగర్ జలాల విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. (Water Meeting)
కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఈ అంశాలపై ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ (Debashree Mukherji) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, తెలంగాణ సీఎస్ ఆ సమావేశానికి హాజరు కాలేనని, 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.
నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీ సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు.అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపి,తెలంగాణా రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరించడం రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తా మని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
అదే విధంగా ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) కార్యాలయంను విశాఖపట్నంకు మార్చేలా కేఆర్ఎంబికి ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి జలశక్తి కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించి ఉంచామని ఆయన తెలిపారు.
Read Also : Ambati Rambabu on Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దు : మంత్రి అంబటి
