Cyclone Michaung : తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ, పునరావాస కార్యక్రమాల అమలు తీరుపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ పూర్తి చేసింది. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. (Cyclone Michaung)
* తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. హుద్ హుద్ లాంటి పెద్ద తుఫానులను కూడా మన రాష్ట్రం చూసింది. అటువంటి తుపాన్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం మన అధికారులకు ఉంది.
* 210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా..ఈ తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలి.
* రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. వర్షాలు కూడా కురుస్తాయి. 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి.
* జిల్లాల కలెక్టర్లు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేశాం. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం.
* తిరుపతికి రూ.2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో రూ.1 కోటి చొప్పున ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు కూడా మరోరూ.1 కోటి మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చాం.
* ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులు నియమించాం. వీరంతా కూడా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి మీ ఈ జిల్లాల్లో అందుబాటులో ఉంటారు.
* ఇవన్నీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ చాలా ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రతి కలెక్టర్, ఎస్పీ దీన్నొక సవాలుగా తీసుకుని పనిచేయాలి. ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీలులేదు. మనుషులుతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఆ మేరకు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.
* ఒకవైపు ఇది చేస్తూనే.. మరోవైపున ఖరీప్ పంటల సంరక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ధాన్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టాలి. కోతకు వచ్చిన ఖరీప్ పంట కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించాం. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.
* మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే…పంట ఇంకా ఎక్కడ కోత కోయలేదో… దాన్ని వాయిదా వేసే విధంగా రైతులకు నచ్చజెప్పాలి.
* అదే టైంలో కోసిన పంటను కచ్చితంగా సేకరించాలి. తేమ ఉన్న ధాన్యం అయినా, రంగు మారిన ధాన్యాన్నైనా కచ్చితంగా సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
* తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ పీరియడ్‌లో రైతు మనకు అత్యంత ప్రాధాన్యమున్న వ్యక్తి. రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం సేకరించాలి.
* తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షతి ప్రాంతాలకు తరలించాలి. 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఈ 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
* మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలి.
* ఇప్పటికే 5 ఎన్డీఆర్‌ఎఫ్, మరో 5 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారు.
* ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏమిటంటే.. మన గ్రామాల్లో ఉన్న సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్లు వ్యవస్ధ. ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం. ప్రతి 50–70 ఇళ్లకు ఒక వాలంటీర్ అందుబాటులో ఉన్న గొప్ప పరిస్థితి ఇతర రాష్ట్రాలకు లేదు.
* మనం క్రియేట్ చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను ఎంత సమర్ధవంతంగా వాడుకోగలిగితే.. అంత మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తుపాను వల్ల, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి.
* మనం ఏర్పాటు చేస్తున్న సహాయ శిబిరాలలో మనం వెళితే ఎలాంటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, భోజనం, వసతి ఉండాలని కోరుకుంటామో.. అదే తరహాలో అక్కడ సౌకర్యాలు ఉండేలా చూడాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. కాస్త డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు. సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రాకూడదు.
* బాధితుల పట్ల మానవతాధృక్ఫధంతో మెలగాలి. బాధితులు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. ప్రతి ఒక్కరికీ రూ.1000 ఇవ్వాలి. కుటుంబానికి అయితే గతంలో మాదిరిగా కాకుండా మరో రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి. క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి.
* క్యాంపులకు రాకుండా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి, క్యాంపు నుంచి మరలా వాళ్ల ఇళ్లకు వెనక్కి వెళ్లేవారికైనా వారికి అందాల్సిన 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున అందించాలి. ఈ రేషన్ వారికి సకాలంలో సక్రమంగా అందించాలి.
* తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలు వల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారి పట్ల మానవతా ధృక్ఫధంతో సాయం చేయాలి. తక్షణమే రూ.10 వేలు ఇచ్చి… వారిని ఆదుకోవాలి. వారు కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేట్టు దయతో, సానుభూతితో అందించాలి. సకాలంలో పరిహారం అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 48 గంటల్లో ఇవి చేయాలి. అప్పుడే వారికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాం.
* గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను సక్రమంగా వినియోగించుకుని బాధితులను గుర్తించడంతో పాటు నష్టాన్ని అంచనా వేయాలి. సకాలంలో వారికి ఇవ్వాల్సినవి అందించాలి.
* ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపైనా దృష్టి పెట్టాలి. తాగునీటి సౌకర్యాలు, జనరేటర్ ఏర్పాటు, బాలింతలు, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడం వంటి కీలక అంశాలను కూడా త్వరితగతిన చేపట్టాలన్న సీఎం.
* వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఎలాంటి అలక్ష్యానికి తావులేకుండా… వెంటనే సహాయ చర్యలు చేపట్టాలన్న సీఎం.
* అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులునూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి.
తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం
బాపట్ల – కాటమనేని భాస్కర్
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి
తూర్పుగోదావరి – వివేక్ యాదవ్
కాకినాడ – యువరాజ్
ప్రకాశం – ప్రద్యుమ్న
ఎస్‌పిఎస్ నెల్లూరు – హరికిరణ్
తిరుపతి – జె.శ్యామలరావు
వెస్ట్‌గోదావరి – కన్నబాబు
Read Also : GST AP: రాష్ట్రంలో పన్నుల ప్రక్రియ మరింత సులభం
