Perni Nani on Kollu Ravindra: బందరులో తాజాగా వైయస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా జనసందోహం వచ్చేలా చూసుకున్నారు. అధికారికంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఇప్పటికే స్పష్టం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని.. తన కుమారుడిని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పేర్ని కిట్టు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు యాత్రలోనూ తన కుమారుడే ఎక్కువ ఫోకస్ అయ్యేలా పేర్నొ నాని చూసుకున్నారు. పేర్ని కిట్టును ఆశీర్వదించాల్సిందిగా నేతలు పిలుపునిచ్చారు. (Perni Nani on Kollu Ravindra)
కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
ఇక బందరులో పేర్ని నాని వర్సెస్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి మొదలైంది. తాజాగా కొల్లు రవీంద్రపై పేర్ని నాని మండిపడ్డారు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసిందేంటో.. నేను చేసిందేంటో శ్వేతపత్రం విడుదల చేద్దామా? అని సవాల్ చేశారు పేర్ని నాని. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కడుపుమంట తీర్చుకుంటున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలని హితవు పలికారు.
మీ హయాంలో పోర్టు కట్టకుండానే రూ.8.70 కోట్లు ఖర్చు పెట్టారు
చంద్రబాబు హయాంలోనే పోర్టు కట్టకుండానే రూ.8.70 కోట్లు ఖర్చు చేసేశారని పేర్ని నాని గుర్తు చేశారు. పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఎకరాల్లో పోర్ట్ అని ఎన్నికల కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంకుస్థాపన చేశారని చెప్పారు. మెడికల్ కాలేజీ నీ హయాం అంటున్నావు… ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావంటూ ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ చలవతో పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం అన్నారు. కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నామంటూ ఎద్దేవా చేశారు. తాను తన కుమారుడిని కొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
