HomeInternationalA23a: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్‌ ఎందుకు కదులుతోంది?

A23a: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్‌ ఎందుకు కదులుతోంది?

A23a: ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐస్‌బర్గ్‌ వెన్నలా కరిగిపోతోంది. భూగోళంపై వాతావరణ కాలుష్యం, వేడి పెరిగిపోవడమే ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇది ఒక రకంగా డేంజర్‌ సంకేతం అని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. ఐస్‌బర్గ్‌ కదలడం వల్ల కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయట. ఆ వివరాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. (A23a)

ఏ23ఏ పేరుతో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌ బర్గ్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీని విస్తీర్ణం ఏకంగా 4 వేల చదరపు కిలోమీటర్లట. మీకు ఆశ్చర్యంగా కలిగించేలా చెప్పాలంటే.. పరిమాణంలో గ్రేటర్‌ లండన్‌తో పోలిస్తే దానికి రెండింతలుపైనే ఉంటుందట. అంత పెద్ద ఐస్‌బర్గ్‌.. చాలా ఏళ్ల తర్వాత కదలిక వచ్చినట్లు గుర్తించారు. ఏకంగా నాలుగు వందల మీటర్ల మందంతో భారీ పరిమాణంతో చూడటానికి ప్రపంచంలోని కళ్లన్నీ చాలవన్నట్లు ఉంటుందట. ఓ భారీ మంచు ద్వీపంలా దర్శనమిస్తుంది. అయితే, దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం దీనిలో కదలిక వచ్చింది. ఈ పరిణామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. (A23a)

ఏ23ఏ ఐస్‌బర్గ్‌ 1985 కాలంలో అంటార్కిటికా తీరం నుంచి సెపరేట్‌ అయ్యింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్ష్‌నర్‌ మంచు ఫలకం నుంచి వేరుపడిన భారీ ఐస్‌బర్గ్‌లలోకెల్లా పెద్దదిగా ఇది రికార్డు నమోదుచేసింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్‌ యూనియన్‌ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది. అందులోని సామగ్రినంతటినీ హుటాహుటిన తరలించేందుకు ప్రయత్నించారట. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్‌ సముద్రంలో ఐస్‌బర్గ్‌ నిశ్చలంగా ఆగిపోయింది. ఒకరకంగా సముద్రం అడుగు భాగంతో కలిసిపోయి అలా స్థిరంగా ఉండిపోయింది.

ఇక ఇంతకాలం నిశ్చలంగా ఉన్న ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించారు. అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న కారణంగానే ఇలా జరుగుతోందని గుర్తించారు. సుమారు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్‌ పరిమాణంలో కుంచించుకుపోయిందని, దానికి గ్లోబల్‌ వార్మింగ్‌ తోడైందంటూ బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణుడు డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు వచ్చాయన్నారు. సముద్ర పవనాల వేగం, ప్రవాహాల దాటికి ఇప్పుడు వేగం అందుకుందట. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్‌ ద్వీపకల్పపు ఉత్తర భాగానికి కదులుతోంది. చివరికి ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరుకొనేలా ఉందని అంచనా వేస్తున్నారు.

భారీ ఐస్‌బర్గ్‌లు కాలక్రమంలో కరిగిపోవడం, కనుమరుగు కావడం సహజమే. అయితే, అందుకు వందలాది సంవత్సరాలు, వేల ఏళ్లు కూడా పట్టొచ్చు. అయితే, ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్‌ ఇలా త్వరగా, వేగంగా కదిలిపోతుండటం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. ఇది ఒక రకంగా గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాద ఘంటికేనంటూ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

అది దక్షిణ జార్జియావైపు పయనిస్తే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా పరిణమించే ఆస్కారం ఉంది. ఐస్‌బర్గ్‌ నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ధ్వంసం చేస్తుందని చెబుతున్నారు. కాగా ఈ పరిణామంతో కొన్ని లాభాలూ ఉన్నాయట. ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలుగా కూడా పరిగణిస్తారు. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Viral Fevers: చలికాలం మొదలైంది.. వైరల్ జ్వరం వస్తే ఇలా చేయాలి..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు