Ayyappa swamy: తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక స్టేట్లలో అయ్యప్ప భక్తుల కోలాహలం ప్రస్తుతం కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి వారి మాల ధరించి వేలాది మంది నిష్టాగరిష్టులై నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనుంది రైల్వే శాఖ. శబరిమలై భక్తుల సౌకర్యార్థం విశాఖ-కొల్లాం, వయా దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి వెల్లడించారు. (Ayyappa swamy)
విశాఖ-కొల్లాం-విశాఖ
08539 నంబరు రైలు ఈనెల 29 నుంచి జనవరి 31వ తేదీ వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08540 నంబరు గల రైలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ సర్వీసులు 12 థర్డ్ ఏసీ ఎకానమీ, ఆరు జనరల్ సెకెండ్ క్లాసు కోచ్‌లతో రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట, తిరుపూర్, త్రిచూర్, ఎర్నాకులం టౌన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి.
శ్రీకాకుళం రోడ్డు-కొల్లాం-శ్రీకాకుళం రోడ్డు వయా దువ్వాడ
08537 నంబర్ రైలు ఈనెల ఈనెల 25 నుంచి జనవరి 27వ తేదీ వరకు ప్రతి శనివారం ఉదయం 11.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి మధ్యాహ్నం 1.42 గంటలకు దువ్వాడ, మర్నాడు (ఆదివారం) సాయంత్రం 6.00 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08538 నంబరు గల రైలు ఈనెల 26 నుంచి జనవరి 28 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి మర్నాడు రాత్రి 11.00 గంటలకు దువ్వాడ, సోమవారం తెల్లవారుజామున 2.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుతుంది. ఈ సర్వీసులు ఒక సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, పది స్లీపర్, ఐదు సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లతో విజయనగరం, దువ్వాడ, విజయవాడ, రేణిగుంట, ఎర్నాకులం టౌన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి.
అయ్యన్ యాప్ తెచ్చిన కేరళ అటవీ శాఖ
అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులతో ప్రస్తుతం శబరిమలకు కిటకిటలాడుతోంది. అనేక ఇక్కట్ల నడుమ భక్తులు శబరిమల చేరుకోవాల్సి ఉంటుంది. విమానాల్లో వచ్చినప్పటికీ కచ్చితంగా కొంత మార్గం అటవీ ప్రాంతంలో నడవాలి. ఇటీవల తిరుమల కాలి నడక మార్గంలో పులి దాడి ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అటవీ శాఖ అలర్ట్ అయ్యింది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ పేరుతో స్పెషల్ యాప్‌ను తీసుకొచ్చింది. హెల్ప్ సెంటర్స్, హెల్త్ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్, తాగునీటి పాయింట్లతోపాటు మరిన్ని సేవల విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
అటవీ శాఖ అధికారులనూ సంప్రదించే వీలుంటుంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ యాప్ పని చేస్తుంది. ఈ యాప్ తెలుగులో కూడాఉంటుంది. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషలూ యాప్‌లో ఉంటాయి. నడక మార్గంలో వెళ్తున్నప్పుడు ఏవైనా జంతువులు దాడి చేసినా, మార్గం మధ్యలో తారసపడినా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా యాప్‌ను తయారు చేశారు.
ఇక దర్శన వేళలపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజులో 16 గంటల పాటు దర్శనాలకు అనుమతించనున్నట్టు వెల్లడించారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయం తెరిచి సుప్రభాత సేవ, నెయ్యాభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభించి.. మధ్యాహ్నం 1 గంటకు నిలిపివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు దర్శనాలను ప్రారంభించి.. రాత్రి 11 గంటలకు వరకు అనుమతిస్తారు. హరివరాసనం అనంతరం మూసివేస్తారు. సన్నిధానంలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిలక్కల్, పంబా వద్ద వీడియో స్క్రీన్‌లతో కూడిన డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
సాధారణంగా మాసపూజలు, ఇతర పండుగల వేళ రోజూ ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి.. మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తారు. శబరిమల వద్ద 6 దశల్లో 13 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. ఇక వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక క్యూలైన్లు కేటాయించారు. రద్దీని నియంత్రించేందుకు ఆలయం మూసివేసినా.. రాత్రివేళ పావన పదునెట్టాంబడి వద్ద భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. దర్శన సమయాన్ని పెంచడం వల్ల భక్తులకు దర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గనుంది.
ఇదీ చదవండి: PM Kisan amount: పీఎం కిసాన్ సొమ్ము రెండింతలు? రాజస్తాన్‌లో మాత్రమేనా? దేశమంతా పెంచుతారా? క్లారిటీ ఇదే!

[…] […]