CM Jagan in Vizag: వచ్చే విజయదశమి తర్వాత విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ నిన్న సమావేశమైంది. పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. (CM Jagan in Vizag)
విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని సీఎం స్పష్టత ఇచ్చారు. అప్పటిలోగా కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని జగన్ తెలిపారు. ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం మేరకే ముందుకెళ్తామని పేర్కొన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
* ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి.
* రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి.
* వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
* జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
* ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.
* ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
* ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ.
* ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్. ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది.
* ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ.
* దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది.
అందుబాటులోకి అదనపు సీట్లు
* ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది.
* కురుపా ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం.
* పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.
* అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం
* భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
* దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
ఇదీ చదవండి: Vijayasai Reddy on CBN: బాబు కనిపెట్టిన వాటికి కేంద్రం పేటెంట్ హక్కులు కోరాలి: సైరా సెటైర్లు
