Global Tigers Day: గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా పులుల ఆవశ్యతకను తెలియజేస్తూ తిరుపతిలోని ఎస్వీ జూ పార్కులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి ఏటా ఈ వేడుకలు జూలై 29న నిర్వహిస్తారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్‌లో 2010లో గ్లోబల్ టైగర్స్ డే మొదలైంది. పులుల సహజ ఆవాసాలను రక్షించడానికి, వ్యవస్థను ప్రోత్సహించడానికి, పులుల సంరక్షణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం గ్లోబల్ టైగర్స్ డే ముఖ్య ఉద్దేశం. (Global Tigers Day)
గ్లోబల్ టైగర్స్ డే వేడుకలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పీసీసీఎఫ్ మధుసూధన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే, సీసీఎఫ్ నాగేశ్వర రావు, జూ పార్క్ క్యూరేటర్ సెల్వం, స్టేట్ సిల్వికల్చరిస్ట్ యశోదా బాయ్, తిరుపతి డీఎఫ్ఓ సతీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Read Also : CM YS Jagan Review: భారీ వర్షాలు, వరద ప్రవాహం, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రష్యా లోని సమావేశంలో పులుల సంరక్షణ కు బీజం పడిందని గుర్తు చేశారు. ప్రతీ ఏడాది జూలై 29న గ్లోబల్ టైగర్స్ డే జరుపుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. నల్లమల నుంచి శేషాచలానికి టైగర్ రిజర్వ్ విస్తరించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. తద్వారా అటవీ సంరక్షణ సులువవుతుందని వివరించారు.

పులుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. గతంలో కేవలం పులుల కాలి ముద్రలనుబట్టి సంఖ్య లెక్కించే వారని, ఇప్పుడు అధునాతనమైన సాంకేతికతతో అది మరింత సులువుగా మారిందని తెలిపారు. మన దగ్గర పులుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అధికారులు పులుల సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో పులల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేలా ఛాయా చిత్ర ప్రదర్శన నిర్వహించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పెద్దిరెడ్డి తిలకించారు. పులులకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంత్రి, ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. కేలండర్లను కూడా విడుదల చేశారు.
