HomeAndhra PradeshAP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!

AP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!

AP Fiber: ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్. థియేటర్‌లో రిలీజ్‌ అయిన సినిమాను ఇంట్లో కూర్చొని తొలిరోజే చూడాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (AP Fiber) ద్వారా ప్రేక్షకులందరూ ఇంట్లోనే కూర్చొని వీక్షించొచ్చు. ఈ తరహా వినూత్న విధానాన్ని ఏపీ ఫైబర్‌నెట్‌ తీసుకొస్తోంది. సినిమా తీసే ప్రొడ్యూసర్‌కు, వీక్షించే ప్రేక్షకుడికి ఇరువురుకీ లాభం కలిగే విధంగా ఇకపై ఇంట్లోనే కొత్త సినిమా చూసేందుకు అవకాశం లభిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

జూన్ 2న విశాఖపట్నంలోని పార్క్ హోటల్ లో (AP Fiber) లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హీరో సాయి రోనార్క్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు సి.కళ్యాణ్, రమా సత్యనారాయణ రానున్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తొలుత నిరీక్షణ అనే సినిమాను ప్రదర్శిస్తారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ను కూడా ఒక థియేటర్ లా భావించాలని ఫైబర్‌నెట్‌ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. రోజురోజుకి సినిమా అభిమానులు పెరుగుతున్న నేపథ్యంలో, ఓటీటీ లాంటి అనేక మాధ్యమాలు పుట్టుకొస్తున్నాయి. రూ.99తో కొత్త సినిమా సబ్ స్ర్కైబ్ చేసుకునేవారికి సినిమా వీక్షించే అవకాశం కల్పించింది ఏపీ ఫైబర్‌నెట్‌. దీని కాలపరిమితి సబ్ స్ర్కైబ్ చేసుకున్న టైం నుంచి 24 గంటల వరకూ ఉంటుంది.

ఇది ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్ చూసే విధంగా రూపొందించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్టివిటీ ఎక్కువ ఉండటంతో పట్టణాలకు వచ్చి థియేటర్ లో సినిమా వీక్షించలేని వారికి ఈ విధానం మరింతంగా ఉపయోగపడుతుంది. ఈ విధానం ఏ ఒక్క యాజమాన్యానికి గానీ, థియేటర్ ఓనర్స్ కి గానీ, యాక్టర్స్ కి గానీ ఏ రకమైన ఇబ్బంది కలిగించేది కాదని ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ తెలిపారు. థియేటర్ యాజమాన్యాలు కూడా దీని ద్వారా తమ ఆదాయం పడిపోతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విధానాన్ని కేవలం ఒక థియేటర్ గా భావించాలన్నారు.

ప్రొడ్యూసర్ లు ఎవరైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థతో మాట్లాడిన తర్వాత ఇందులో సినిమా ప్రదర్శన జరుగుతుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ ను రాష్ట్ర ప్రజానీకానికి మరింత చేరువ చేసేందుకు 55 వేల కి.మీల ఓఎఫ్ సీ వైర్ ను తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 37వేల కి.మీల వరకు తీసుకెళ్లారు. 11,254 గ్రామ పంచాయతీల్లో 7,600 పైచిలుకు గ్రామాలకు ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ అత్యద్భుతంగా పనిచేస్తుందని సాక్షాత్తు పార్లమెంట్ లోనే చర్చించారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు సైతం ఫైబర్ నెట్ ను అనుసంధానించారు. ప్రజలందరికీ ఫైబర్ ను చేరువ చేసేందుకు రెండు మూడు నెలల్లో కొత్త బాక్స్ లకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 5 కంపెనీలతో చర్చలు జరిపారు. బాక్స్ ల కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : TDP Manifesto: ఆల్‌ ఫ్రీ.. మరోసారి చర్చనీయాంశమైన టీడీపీ మినీ మేనిఫెస్టో!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు