TDP Manifesto: తెలుగుదేశం పార్టీ రాజమండ్రి వేదికగా ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో.. (TDP Manifesto) ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు.. తాజాగా అదే తరహా ఉచిత హామీలు గుప్పించడంపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 600కు పైగా అలవికాని హామీలిచ్చిన టీడీపీ.. ఆ తర్వాత మేనిఫెస్టోను కనపడనీయకుండా వెబ్‌సైట్ నుంచి కూడా డిలీట్ చేసిన చరిత్ర మూటగట్టుకుంది. అదే తరహాలో ఇప్పుడు ఉచితాలు ప్రకటించడం గమనార్హం.
మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం జగన్ చెబుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్రతో జనం కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. అందుకే… మీ బాధలు నేను విన్నాను.. మీ కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. పేదవాడికి అండగా నిలుస్తూ జననేత జగన్ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జనం కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక పేదల పక్షాన నిలుస్తూ నాలుగేళ్లుగా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు వైయస్ జగన్.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం పూర్తి చేశారు. జనం కష్టాలను అతి సమీపం నుంచి చూసిన జగన్.. వారి కష్టాలను, కడగండ్లను, పడుతున్న బాధలను చూసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి మేనిఫెస్టో రూపొందించారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ మేనిఫెస్టోకు విశేష ఆదరణ లభించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లతో అధికారంలోకి వచ్చారు జగన్.
జనం బాధలను చూసినట్లుగా బాబు బిల్డప్..
చంద్రబాబు తాజాగా రాజమండ్రిలో మహానాడు నిర్వహించారు. తొలి విడత మేనిఫెస్టో పేరిట ఆయన హడావుడి చేశారు. ఏదో రాష్ట్రం మొత్తం తిరిగి జనం కష్టాలు చూసినట్లుగా, కడగండ్లను, బాధలను దగ్గరుండి చూసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని మేధావులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపి మేనిఫెస్టో రూపొందించినట్లుగా చంద్రబాబు నాటకం ఆడారు.
ఇటీవల కర్ణాటక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను చంద్రబాబు తాజాగా రాజమండ్రిలో కాపీ కొట్టి ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అనే హామీ ఇచ్చారు. అదే హామీని చంద్రబాబు కాపీ కొట్టి రాజమండ్రి మహానాడులో దీపం పథకం అని పేరు పెట్టి మూడు సిలిండర్లు ఫ్రీ… అంటూ ప్రకటించారు. అదే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా ఐదు హామీలను కాపీ కొట్టి.. ఇక్కడ పేర్లు మార్చేశారు చంద్రబాబు. మహాశక్తి, యువగళం అంటూ కొత్త పేర్లు తగిలించారు. భవితకు భరోసా అంటూ పాత చింతకాయ పచ్చడిలా కొత్త నినాదం ఎత్తుకున్నారు.
నవరత్నాలను ఎన్నిసార్లు కాపీ కొడతారు?..
వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను కూడా చంద్రబాబు మళ్లీ కాపీ కొట్టారు. అందుకు ఉదాహరణగా.. మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే.. నాన్న బుడ్డీ అంటూ రోజూ టీడీపీ నేతలు సెటైర్లు వేసిన ‘అమ్మఒడి’ పథకాన్ని ”అమ్మకు వందనం” పేరుతో మక్కీకి మక్కీ దింపేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రతి తల్లికి రూ.18 వేలు ఇస్తానని నవరత్నాన్ని కాపీ కొట్టి ఈనాడు పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇప్పుడు అదే మాట మార్చి రూ.15 వేలకు కుదించారు.
చంద్రబాబు బతుకంతా కాపీ పేస్ట్ మయం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. తన అనుకూలమైన మీడియా చానళ్లు, పత్రికల సాయంతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు సోషల్ మీడియా రూపంలో అదిపెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. అందుకు ఉదాహరణగా.. మహానాడు తొలి రోజు సందర్భంగా పచ్చ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో టీడీపీ తరఫున యాడ్ ఇచ్చారు. ఇందులో నందమూరి వంశానికి చోటే దక్కలేదు. ఎన్టీఆర్ కొడుకు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో కూడా లేదు. కేవలం చంద్రబాబు, ఎన్టీఆర్, అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్‌లతో యాడ్ ఇచ్చారు. నందమూరి వంశం నుంచి పార్టీని లాక్కొని వారికి స్థానం లేకుండా చేశారంటూ నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేశారు. దీంతో దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు అండ్ కో.. మరుసటి రోజు బాలకృష్ణ ఫొటోను తగిలించి యాడ్ ఇచ్చారు.
Read Also : Telangana Congress: కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఉంటుందా?