ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) దివాలా అంచుల్లో ఉందంటూ ఓ దినపత్రికలో ఆర్థిక నిపుణుడు జీవీ రావు పేరిట వచ్చిన ఆర్టికల్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రకంపనలు సృష్టించింది. జీవీ రావుపై అధికార పార్టీ నేతలు, సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితిపై టీడీపీ, కొందరు విశ్లేషకులు తప్పుడు ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి (CM Jagan) ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్) దువ్వూరి కృష్ణ (Duvvuri Krishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీ రావు (GV Rao) అనే వ్యక్తి ఎవరూ కూడా పెద్దగా ఎవరికీ తెలియదన్నారు.
ఐసీఏఐ (ICAI) నుంచి జీవీ రావును తొలగించిన విషయాన్ని దువ్వూరి కృష్ణ గుర్తు చేశారు. ఎఫ్ఆర్బీఎం (FRBM) చట్టానికి అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలకు పూచీకత్తు ఇవ్వొచ్చని కృష్ణ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అప్పులపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. దుష్ప్రచారంపై ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పు అని ఆధారాల్లేని వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆర్థిక నిపుణుడు అని ట్యాగ్ తగిలించి డాక్టర్ జి.వి.రావు చేత ఆ పత్రిక చెప్పించిందన్నారు.
వాస్తవాలేంటో వివరించారు. సీఎం జగన్ చేసిన అప్పు 1 .64 లక్షల కోట్లు అని తెలిపారు. బాబు దిగిపోయిన మే 2019 మే నాటికి ఏపీ అప్పులు రూ.2,71,797 కోట్లు అన్నారు. అయితే, మార్చి 31, 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,36,522 కోట్లుగా ఉన్నాయన్నారు. అంటే ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,64,725 కోట్లు మాత్రమేనన్నారు. బాబు హయాంలో అప్పుల్లో వార్షిక వృద్ధిరేటు (CAGR) 19 శాతం ఉండేదన్నారు. అంటే కేంద్రం కన్నా అప్పులు రెట్టింపు అనే విషయాన్ని దువ్వూరి కృష్ణ గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వంలో అప్పుల వార్షిక వృద్ధిరేటు (CAGR) 13.55 శాతమన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అప్పులు 14.37 శాతంగా పేర్కొన్నారు. వృద్ధి రేటులో ఏపీ ఫస్ట్ స్థానంలో ఉందని కృష్ణ తెలిపారు. 2021–22లో ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటు 11.43 శాతం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటు కేవలం 8.7 శాతమేనని స్పష్టం చేశారు. పెట్టుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 9 నెలల్లో(2022 జనవరి సెప్టెంబర్ ) రూ.44,286 కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన వాటిల్లో 22 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయని తెలిపారు.
ఇక రాష్ట్ర వృద్ధిరేటు విషయానికి వస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 5.36 శాతం ఉండేదన్నారు. అది 2021–22లో 11.43 శాతానికి చేరుకుందని దువ్వూరి కృష్ణ తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 2018–19లో చంద్రబాబు హయాంలో 3. 17 శాతం ఉంటే అది 2021–22 లో – 12. 78 శాతానికి పెరిగిందని వివరించారు. వరుసగా 3 సార్లు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి రాంక్ సాధించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు.
2022–23లో రూ.7.65 లక్షల కోట్ల ఒప్పందాలతో మొదటి స్థానం లో ఏపీ నిలిచిందన్నారు. రూ.4.44 లక్షల కోట్లతో రెండో స్థానంలో గుజరాత్ ఉందన్నారు. దేశంలో పెట్టుబడులపై ‘ప్రాజెక్ట్స్ టుడే’ సర్వే నివేదిక ఈ వివరాలు వెల్లడించిందన్నారు. ఇది అభివృద్ధి కాదా? అని ప్రతిపక్షాన్ని నిలదీశారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని వాడుకొంటూ 25 వేల కోట్లతో 4 పోర్టులు 9 ఫిషింగ్ హార్బర్లు కడుతున్న సీఎం జగన్ విజనరీ అయితే 14 సంవత్సరాలు సీఎంగా చేసి పట్టించుకోని బాబు సైకో అని వ్యాఖ్యానించారు.
విద్యయే పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి అని జగన్ భావిస్తారన్నారు. మనబడి నాడు-నేడు లాంటి కార్యక్రమాలు, విద్యా రంగం మీద రూ.59 వేల కోట్లు ఖర్చు పెట్టిన సీఎం జగన్ విజనరీ అయితే.. విధ్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి చైతన్య, నారాయణలను ప్రోత్సహించిన బాబు సైకో అని స్పష్టం చేశారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని జగన్ భావించారని, బాబు వైద్య రంగంపై ఏటా రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రూ.18 వేల కోట్లు ఖర్చు చేశారని గణాంకాలతో సహా వెల్లడించారు.
ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తోడుగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతూ అసూపత్రులలో ఆధునీకరణ పనులను 16 వేల కోట్లతో చేతున్న సీఎం జగన్ విజనరీ అన్నారు. అదే ఒక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టని బాబును ఏమనాలో మీరే చెప్పాలన్నారు. ఇంటింటికి డాక్టర్ అనే ఫ్యాలిలీ డాక్టర్ విధానం జగన్ తెచ్చారని వివరించారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా 49 వేల మందిని నియమించి 10 వేల హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ విజనరీ లీడర్ అని మరోసారి స్పష్టం చేశారు.
ప్రజల వద్దకే పాలన కింద 2 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున 15 వేల సచివాలయాలు కట్టి, 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన జగన్ విజనరీ లీడరేనన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్న బాబును సైకో కాక ఇంకేమని పిలవాలన్నారు. రైతులకు వన్ స్టాప్ సెంటర్ అయిన 10 ,778 ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు ఏర్పాట్లు చేస్తున్న సీఎం జగన్ విజనరీ అయితే.. వ్యవసాయం దండగ అన్న బాబు సైకో అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్ 2 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. మహిళలకు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ దాదాపు 3 లక్షల కోట్ల ఆస్థి మహిళలకు జగన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. పేద ప్రజల పిల్లల బ్రతుకుల్లో వెలుగు నింపాలని ఇంగ్లీష్ మీడియం పెట్టిన గొప్ప నేత జగన్ అన్నారు. పేదప్రజలకు డీబీటీ ద్వారా 2.10 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా లక్ష కోట్లు మొత్తం 3 లక్షల కోట్లు అందించి ఆదుకున్న చరిత్ర జగన్‌దన్నారు.
విశాఖ GIS సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, అంబానీ, అదానీ, బిర్లా, జిందాల్, ఒబెరాయ్ ఇలా అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారన్నారు. జాతీయ తలసరి ఆదాయం-1.50 లక్షలని, హైదరాబాద్ లాంటి పారిశ్రామిక నగరం లేకున్నా ఏపీ తలసరి ఆదాయం 2 లక్షల 8 వేలన్నారు. ఇవన్నీ విస్మరించి చంద్రబాబు తాను అధికారంలోకి రావాలనే అక్కసుతో ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతున్నారని దువ్వూరి కృష్ణ మండిపడ్డారు.
Read Also : Family Doctor: ఫ్యామిలీ డాక్టర్.. మీ ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేస్తాం!
