Telangana: తెలంగాణ (Telangana) గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) శుభవార్త అందించారు. రేపు గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల (Junior Panchayat Secretaries) పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుంచి ఓ సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి అధికారిని పరిశీలకుడిగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటారు.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించనున్నారు. జిల్లా స్థాయి కమిటీల ద్వారా పంపిన ప్రతిపాదనను రాష్ట్రస్థాయిలోని కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీ చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపనుంది. రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (Junior Panchayat Secretaries) జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లోనూ నూతన జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ విధానాన్ని, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇలా ఉండగా, కొన్నాళ్ల కిందటి వరకు జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టారు. అయితే, వీరి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మే 12న కీలక నిర్ణయం వెలువరించింది. విధులకు హాజరైన వారి లిస్టును మధ్యాహ్నంలోగా పంపించాలని కలెక్టర్లను, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ఇక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని కఠిన నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశమైంది. విధులకు రానివారి స్థానాల్లో కొత్త వారిని టెంపరరీగా నియమించుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎగ్జామ్ రాసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వం సీరియస్ కావడంతో పంచాయతీ కార్యదర్శులు మేల్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దిగొచ్చి సమ్మె విరమించినట్లుగా ఈనెల 14వ తేదీన ప్రకటించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేయాలని 16 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విరమించాలని, వెంటనే ఉద్యోగాల్లో చేరిపోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రభుత్వం సీరియర్ అయిన నేపథ్యంలో వారంతా సమ్మె విరమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోకపోగా, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో చేసేదేమీ లేక వీరిలో కొందరు తిరిగి విధుల్లో చేరిపోయారు. అన్ని జిల్లాల నుంచి అందరూ విధుల్లో చేరాలని, ప్రభుత్వానికి మళ్లీ వినపతిపత్రం ఇద్దామని వారు నిర్ణయించారు.
Read Also : Machilipatnam: రాక్షసుల తరహాలో అడ్డుకుంటున్నారు.. బందరులో సీఎం జగన్