Machilipatnam: రాక్షసుల తరహాలో అడ్డుకుంటున్నారు.. బందరులో సీఎం జగన్‌

Machilipatnam: బందరు (Machilipatnam) వాసుల చిరకాల స్వప్నం బందరు పోర్టు (BandarPort) పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) ప్రారంభోత్సవం చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం (Machilipatnam) పోర్టు నిర్మాణ పనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడిలో సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి రాక్షసుల తరహాలో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సీఎం ఏం మాట్లాడారంటే..

”దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. బందరు పోర్టు చిరకాల స్వప్నం. ఒకవైపు సముద్రం కనిపిస్తుంది. మరోవైపు మహానగరం కనిపిస్తుంది. బందరుతో సముద్రవర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి.. అది జరిగితే బందరు కూడా ఏ ముంబాయి మాదిరిగానో, చెన్నై మాదిరిగానో మహానగరంగా ఎదుగుతుందన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగా మిగిలిపోయింది.

ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ.. మనందరి ప్రభుత్వం ఈ రోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ కూడా పూర్తి చేసి, అన్ని అనుమతులును తీసుకొచ్చి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ను పూర్తిచేసి, టెండర్ల ప్రక్రియను ముగించి.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాం.దాదాపు రూ.5,156 కోట్లతో 4 బెర్తులు ఇక్కడ రానున్నాయి. దాదాపు 35 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో పోర్టు ప్రారంభమవుతుంది. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ… బెర్తుల సంఖ్య పెంచుకుంటూ 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకు విస్తరించుకుంటూ పోవచ్చు.

ఇలాంటి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఈ పోర్టుకు అన్ని రకాలుగా మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో దీనికి అనుబంధంగా మౌలికవసుతుల నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఈ పోర్టుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 వ నెంబరు జాతీయ రహదారిని పోర్టు వరకు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ, మచిలీపట్నం రైల్వే లైనును కూడా పోర్టు వరకు తీసుకొచ్చి అనుసంధానం చేస్తున్నాం. బందరు కాలువ నుంచి 0.5 ఎం.ఎల్‌.డీ నీటిని 11 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ద్వారా తీసుకొచ్చి.. పోర్టుకు అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల సరుకులు ఎగుమతులు, దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్ధ ఏర్పడుతుంది. మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా మనకు అందుబాటులోకి వస్తుంది.

ఈ పోర్టు వల్ల, ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాల వల్ల మన రాష్ట్రంతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా బాగుబడతాయి. పక్కనే తెలంగాణాకు అత్యంత సమీపంగా ఉన్న ఈ పోర్టు ఆ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. చత్తీస్‌ఘఢ్, కర్నాటకకు కూడా ఈ పోర్టు కొంతమేర ఉపయోగపడుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మచిలీపట్నం నగరంలోనే ఆ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. డిగ్రీ పూర్తయిన మన పిల్లలు వేరేచోటకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మన దగ్గరకే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం దిశగా ఈ రోజు పనులు మొదలు కావడంతోనే అడుగులు పడుతున్నాయి.

ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈ పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయంతో అడుగులు వేశారు. 22 గ్రామాలను తీసేసుకోవాలని, 33వేల ఎకరాలు తీసేసుకోవాలని ఆ భూములన్నీ నోటిఫై చేసేసి.. అక్కడ ఉన్న రైతులెవరూ తమ భూములను అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరినీ ఇబ్బందికి గురి చేశాడు. ఇలా చేస్తే పోర్టు రాకుండా పోతుంది, అడిగే వారు ఉండరని ఈ కార్యక్రమం చేశాడు. మచిలీపట్నంలో పోర్టు రాకపోతే, ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను బినామీలుగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అన్న తపనతో ఈ పెద్దమనిషి మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశాడు. ఈ రోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాం.

పోర్టుకు సంబంధించి రైలు, రోడ్డు మార్గానికి కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి రైతు మొహంలో చిరునవ్వు చూడాలి. వారిని సంతోషపెట్టే ఈ భూములు తీసుకొండి అని చెప్పాను. ఈ రోజు నేను సంతోషంగా చెపుతున్నా.. రైతులందరి సంతోషం మధ్య… వారు మనస్ఫూర్తిగా ఇచ్చిన 240 ఎకరాలు తీసుకుని ఈ రోజు మంచి పోర్టు నిర్మాణంలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. వాటిలో 4వేల ఎకరాలను దీంతో అనుసంధానించి అక్కడ కూడా పరిశ్రమలు వచ్చేటట్టు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలకు ఊతం పడినట్టవుతుంది.

పోర్టు నిర్మాణానికి తొలిగిన గ్రహణాలు..

పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రహణాలన్నీ తొలగిపోయాయి. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. మరో 24 నెలల కాలంలోనే ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. మచిలీపట్నంలో పెద్ద, పెద్ద ఓడలు కనిపిస్తాయి. మరో 24 నెలల్లోనే ఇవన్నీ జరుగుతాయి. మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో చూడండి. మీ కళ్లెదుటనే ఈ తేడాలను గమనించేటట్టు అడుగులు పడుతున్నాయి.

గతంలో బందరు జిల్లా ముఖ్యపట్టణమైనా కూడా కలెక్టరుతో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వారానికి ఒక రోజు కేటాయిస్తే అదే పదివేలు అనుకునే పరిస్థితిలో ఉన్న జనాలకు మంచి చేస్తూ.. ఈ రోజు ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టరుతో పాటు మొత్తం యంత్రాంగం అంతా కూడా జిల్లాలో ఉండేట్టుగా జిల్లా కేంద్రంగా మచిలీపట్నంను ఉంచడమే కాకుండా, కలెక్టర్‌ ఇక్కడే ఉంటారు.

దాదాపు రూ.550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరమే మరో మూడు నెలల్లోనే ఆగష్టు, సెప్టెంబరులోనే అడ్మిషన్స్‌ జరగనున్నాయి. దీనివల్ల ఆవనిగెడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు గొప్ప వైద్య సేవలు అందుతాయి.

నాగుల్‌ మీరా సాహెబ్‌ ఆశీస్సులతో ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్భరు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు నెలల్లో ఈ ఫిషింగ్‌ హార్భరు పనులు కూడా పూర్తై.. అందుబాటులోకి వస్తుంది. ఇక్కడే ఇమిటేషన్‌ జ్యూయలరీ తయారీకి మద్ధతుగా నా పాదయాత్రలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ మేరకు… రూ.7.65 నుంచి మనం అధికారంలోకి రాగానే రూ.3.75 లకు తగ్గించాం. దాదాపు 40 వేల మంది ఇమిటేషన్‌ జ్యూయలరీ మీద బ్రతుకున్న వాళ్లందరికీ మంచి చేశాం. బందరులో అభివృద్ధి జిల్లా కేంద్రంగానే కాకుండా, భారీ స్ధాయిలో ఇక్కడ వర్తక, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి అన్నింటికీ కూడా మచిలీపట్నం కేరాఫ్‌ అడ్రస్‌ కాబోతుంది.

వీటన్నింటినీ ఏర్పాటు చేస్తూనే మరోవైపు పేదల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మల మొహంలో చిరునవ్వులు చూడాలని, పేదరికాన్ని సమూలంగా తీసేయాలని, పేదవాళ్లు పేదవాళ్లగా ఉండిపోకూడదని నా అక్కచెల్లెమ్మల కుటుంబంలో వెలుగులు నింపడానికి రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో నేరుగా జమ చేశాడు.

ఇక నాన్‌ డీబీటీ కూడా కలిపితే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్ధలాలను కూడా చూస్తే… 30 లక్షల ఇంటి స్ధలాలు. ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.2.50 లక్షలు వేసుకున్న కూడా రూ. 75వేల కోట్లు. ఆ రకంగా తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా నాన్‌ డీబీటీలో మిగిలినవన్నీ కలిపితే రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో నేరుగా జమ చేశాం. ఎక్కడా ఎలాంటి లంచాలు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా డబ్బులు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతున్నాయి.

యజ్ఞానికి అడ్డు తగులుతున్నారు..

అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుకున్నట్టు.. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే.. టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది. వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం.. తినుకోవడం. ఈ టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు. వీళ్లందరూ ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. రాజధాని పేరుమీద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్‌ కమ్యూనిటి ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. బినామీల పేరుతో భూములు గడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు.” అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Read Also : YS Jagan: జగనన్నకు చెబుదాం ప్రారంభం.. ముఖ్యమంత్రి ఫుల్‌ స్పీచ్‌ ఇదే..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles