Niti Aayog: కొత్తఢిల్లీలో నీతి ఆయోగ్ (Niti Aayog) 8వ పాలక మండలి సమావేశం ఇవాళ జరిగింది. సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రులు నివేదికలు సమర్పించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. దాంతోపాటు నీతి ఆయోగ్ చర్చించేలా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పురోగతిని వివరించేలా నోట్‌ను ముఖ్యమంత్రి సమావేశంలో సమర్పించారు.
శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీకి (Niti Aayog Meeting) 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ కారణాల రీత్యా గైర్హాజరయ్యారు. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలువురు సీఎంలు సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బిహార్, కేరళ, కర్ణాటక, రాజస్తాన్ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి రాలేదు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ కొనసాగింది. ”వికసిత భారత్ @ 2047” అనే థీమ్‌తో ఈ భేటీ నిర్వహించారు. 2047 ఏడాది నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొనేందుకు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల వృద్ధి లాంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నారాయణ్ రాణె, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
”ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుంది. భారతదేశంలో లాజిస్ట్రిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉంది. లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యింది. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు మరియు జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో వ్యవయం చేస్తోంది. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోంది. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది.
రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం మరియు పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆహారరంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం.
తయారీ మరియు సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం, దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంకా, మేము వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేశాం. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించాం, రద్దు చేశాం.
విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించింది. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయి.” అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంకా అనేక అంశాలపై ఆయన నోట్ ఇచ్చారు.
Read Also : Amaravati: దద్దరిల్లిన అమరావతి.. 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ!