PM Modi speech in Loksabha: లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌పై, విపక్షాలపై తనదైన శైలిలో ప్రధాని ఈ సందర్భంగా సెటూర్లు, విమర్శనాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వంపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. 2018లో కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఇది విపక్షాలకే పరీక్ష.. తమ ప్రభుత్వానికి కాదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలే విపక్షాల పై అవిశ్వాసం ప్రకటించారని చెప్పారు. (PM Modi speech in Loksabha)
2024లో ఎన్డీఏ కూటమి అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయన్నారు. విపక్షాలకు పేదల భవిష్యత్ కంటే అధికారమే ముఖ్యమైందని విమర్శించారు. విపక్షాలు అధికార దాహంతో ఉన్నాయంటూ మోదీ ఫైర్ అయ్యారు. విపక్షాలు అవిశ్వాసం పెట్టి అభాసుపాలయ్యాయన్నారు. (PM Modi speech in Loksabha)
వరుస నోబాల్స్ వేస్తున్నారు…
విపక్షాల వైఖరిపై క్రికెట్ భాషలో చెప్పాలంటే వరుస నోబాల్స్ వేస్తున్నారంటూ ప్రధాని సెటైర్లు వేశారు. అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందన్నారు. విపక్షాలు మాట్లాడిన ప్రతి మాటా దేశమంతా శ్రద్ధగా వింటోందని గుర్తు చేశారు. ఇప్పటివరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. విపక్షాలు.. వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 1999లో శరద్ పవార్ నాయకత్వంలో అవిశ్వాసం పెట్టారని, 2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారని గుర్తు చేశారు.
2018లో మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఇన్ని అవిశ్వాసానలతో ఏం సాధించారని ప్రధాని ప్రశ్నించారు. అవిశ్వాసాలు ఎందుకు పెడుతున్నారు.. అసలు మీ సమస్య ఏంటి? అని సూటిగా ప్రశ్నించారు. అధీర్ రంజన్ అవిశ్వాసం ప్రవేశపెడతామన్నారు.. ఎందుకు పెట్టలేదన్నారు. కోల్ కతా నుంచి ఫోన్ వస్తే అధీర్ రంజన్ అవిశ్వాసం పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు. అధీర్ రంజన్ పరిస్థితికి విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.
21వ శతాబ్దం భారత దేశానిదని మోదీ స్పష్టీకరించారు. ఈ సమయం భారత్ కు అత్యంత కీలకమైనదిగా పేర్కొన్నారు. మీరు, మేము, కోట్లాది జనాభా అభివృద్ధికి సాక్షీభూతం అని చెప్పారు. భారత్ స్వప్నాలు సాకారమయ్యే కీలక శతాబ్ధిమిదంటూ మోదీ హితవు పలికారు. 140 కోట్ల మంది భారత జనాభా కలలు నెరవేరుతున్నాయని, ఇలాంటి సమయంలో మనందరి సంకల్పం అభివృద్ధి మాత్రమే కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అన్నది మనందరి తారకమంత్రం కావాలన్నారు.
విభేదాలు పక్కన పెట్టాలి..
మన విభేదాలు, వైరుధ్యాలు దాటి అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలని ప్రధాని విపక్షాలకు పిలుపునిచ్చారు. యువతరం స్వప్నాలు సాకారం చేసి లక్ష్యసిద్ధికి పరుగెడుతోందన్నారు. యువత లక్ష్యయాలకు సంపూర్ణ సాకారం అందాల్సిన బాధ్యత మనదంటూ పేర్కొన్నారు. మన సంక్షేమ పథకాలను IMF ప్రశంసించిందని గుర్తు చేశారు. దేశ ప్రజలను ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ అభియాన్ లక్షలాది జీవితాలను నిలబెట్టిందన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని, HALపై ఇష్టానుసారం మాట్లాడారన్నారు. గత మూడు రోజులుగా తమపై అనరాని మాటలు అన్నారని, విపక్షాలు కనీసం ప్రిపేర్ అయ్యి రాలేదన్నారు. గత అవిశ్వాసమనప్పుడే ప్రిపేర్ అయి రావాలని చెప్పానని, అయిదేళ్లు సమయమిచ్చినా ప్రతిపక్షాలు ప్రిపేర్ కాలేదంటూ సెటైర్లు వేశారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు.
భారత్ ను అప్రతిష్టపాలు చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ మండిపడ్డారు. స్కామ్ లు లేని ప్రభుత్వాన్ని నడిపించామని చెప్పారు. అందుకు విదేశీ పెట్టుబడులే నిదర్శనం అన్నారు. స్వచ్ఛ్ భారత్ ద్వారా 3 లక్షల మంది ప్రాణాలు కాపాడామన్నారు. కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. 2014 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ కు నిజాయితీ, విజన్ లేదని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిపోయిందని గుర్తు చేశారు. విపక్షాలకు పాకిస్తాన్ అంటే ప్రేమ కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ చెప్పేదే విపక్షాలు నమ్ముతాయన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ ఉగ్రదాడులు జరిగాయని, కశ్మీర్ పౌరుల పై కాంగ్రెస్ కు నమ్మకం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై ప్రజలు అవిశ్వాసం ప్రకటించారని, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ను జనం దూరం పెట్టారని గుర్తు చేశారు. 1962లలో చివరిసారి తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిందని, నాగాలాండ్ లో 1988లో చివరిసారి కాంగ్రెస్ గెలిచిందన్నారు. యూపీ, బిహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని స్పష్టం చేశారు.
Read Also : Sajjala fires on CBN: పవన్‌ను దగ్గరపెట్టుకొని చంద్రబాబు డ్రామాలు.. చిరంజీవి ఎవరి తరఫున మాట్లాడారు?: సజ్జల