Modi on Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికల దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గంటన్నరపాటు ప్రధాని తో అమిత్ షా, జేపీ నడ్డా మంతనాలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో ప్రత్యేక భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులపై చర్చించినట్టు తెలుస్తోంది.
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు
ఒకే దేశం – ఒకే ఎన్నికల నిర్వహణ పై కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ని నియమించారు. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది ఈ కమిటీ. జమిలి ఎన్నికల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ తెలుసుకోనుంది.
మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నారు. కేంద్రం నిర్ణయాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ ఏర్పడింది.
ముంబై లో ఇండియా కూటమి కీలక నిర్ణయం
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేలా ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై త్వరలో చర్చలు జరుపుతోంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వీలైనంత త్వరగా చర్చలు పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. ముంబై సమావేశంలో కూటమి తీర్మానం చేసింది. 13 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.
కన్వీనర్, చైర్ పర్సన్ లేకుండానే కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో కేసీ వేణుగోపాల్, శరద్ పవార్ , స్టాలిన్ , సంజయ్ రౌత్, తేజస్వియాదవ్, అభిషేక్ బెనర్జీ ఉన్నారు. ఇండియా కూటమి తరఫున ప్రజాసమస్యలపై దేశవ్యాప్తంగా, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. జుడేగా భారత్ – జితేగా భారత్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.