Supreme Court: సమాజంలో కొందరు వివాహేతర బంధం పెట్టుకోవడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఈ విషయం బయటకు తెలిస్తే జీవిత భాగస్వామి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇలాంటి ఉదంతాలను బయట పెట్టేందుకు కొందరు టెక్నాలజీని వాడుతుంటారు. సెల్‌ఫోన్ వచ్చి ఎంత ఉపయోగకరంగా ఉందో, అంతే ప్రమాదకరంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. వివాహేతర సంబంధాలను నిర్ధారణ చేసేందుకు ఓ వ్యక్తికి సంబంధించిన కాల్స్ రికార్డులు వాడొచ్చా అనే అంశంపై తాజాగా ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. (Supreme Court)
భాగస్వామికి తెలియకుండా వివాహేతర బంధం పెట్టుకున్న సందర్భాల్లో అలాంటివి రుజువు చేసేందుకు ఆ వ్యక్తికి సంబంధించిన హోటల్ బస బిల్లులు, సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్స్ అడగవచ్చా అనే అంశాన్ని పరిశీలించేందుకు తాజాగా అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పౌరుల వ్యక్తిగత విషయాలను, గోప్యతను కాపాడటంపై రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహేతర బంధాన్ని నిర్ధారణ చేసేందుకు అలాంటి వాటిని పరిశీలించినట్లయితే రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందా? లేదా? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఈ తరహా కేసులో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది. అతడి భార్యకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భర్త వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేందుకు ఒక హోటల్‌లో ఓ గదికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్, చెల్లించిన బిల్లులు, అందులో బస చేసిన వారు సబ్‌మిట్ చేసిన ఐడెంటిటీ కార్డు లాంటి వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కుటుంబ న్యాయస్థానం గత ఏడాది డిసెంబర్ 14న ఆదేశించింది.
ఈ నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సదరు వ్యక్తి ఆశ్రయించాడు. అతడి వాదనను ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిర్ధారణ చేయడానికి ఆధారాల సేకరణకు సహకరించాలని భార్య కోరినప్పుడు సరైన విధంగా స్పందించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నిర్ణయంపై సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాజాగా అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘినట్లవుతుందా? లేదా అనేది పరిశీలిస్తామని వెల్లడించింది.
Read Also : SC On Divorce : ఆరు నెలలు కూడా అక్కర్లేదు.. విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు