PM Modi : మోదీ కర్ణాటక పర్యటనలో కలకలం.. వెహికల్‌పై ఫోన్‌ విసిరిన బీజేపీ కార్యకర్త

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రధాని (PM Modi) పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. ప్రధాని కాన్వాయ్‌లోని వాహనంపైకి సెల్‌ఫోన్‌ను విసిరేయడం కలకలం రేపింది. ప్రధాని ఆదివారం మైసూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై ఎక్కి రోడ్‌ షో నిర్వహించారు ప్రధాని మోదీ.

ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ప్రధానివైపు ఫోన్‌ను విసిరేసింది. దీంతో వాహనం బానెట్‌పై సెల్‌ఫోన్‌ పడిపోయింది. చుట్టూ భారీగా జనసందోహం ఉన్నప్పటికీ, రోడ్‌షోలో బిజీగా ఉన్నా.. మోదీ దానిని గమనించారు. వెంటనే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను (SPG) ఆయన అప్రమత్తం చేశారు. సాధారణంగా ప్రధాన మంత్రి బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు ఎస్పీజీ రక్షణ ఉంటుంది.

రోడ్‌ షో సందర్భంగా బీజేపీ మహిళా కార్యకర్త అత్యుత్సాహంతోనే ఫోన్‌ విసిరిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎస్పీజీ సిబ్బంది తర్వాత ఆ ఫోన్‌ను ఆమెకు అందించారని తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం, దురుద్దేశాలు లేవని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

గతంలోనూ ప్రధాని పర్యటనలో దూసుకొచ్చిన కార్యకర్త!

మోదీ కర్ణాటక పర్యటనలో గతంలోనూ భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి 23వ తేదీన ప్రధాని ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చాడు. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతాలోపం కనిపించడం మూడు నెలల వ్యవధిలోనే అది రెండోసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన దావణగెరెలో చోటు చేసుకుంది. రోడ్‌ షోలో భాగంగా కాన్వాయ్‌పై వెళ్తున్న ప్రధాని మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం వేలాదిగా వచ్చారు.

అంతలోనే ఓ యువకుడు అందర్నీ తోసుకుంటూ వచ్చి ప్రధాని వద్దకు వెళ్లేందుకు యత్నించాడు. దాదాపు ప్రధాని కాన్వాయ్‌ వాహనం వద్దకు చేరుకోగానే భద్రతాబలగాలు అప్రమత్తపై ఆ యువకుడిని పట్టుకున్నారు. అంతకు ముందు జనవరిలో కూడా కర్ణాటకలోని హుబ్లీలో ప్రధాని మోదీ రోడ్‌ షో జరిపారు. ఆ సందర్భంలో కూడా ఓ చిన్నారి ప్రధాని వద్దకు వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధానిక మోదీకి పూలమాల వేసేందుకు యత్నించాడు. అనంతరం అప్రమత్తమైన ఎస్పీజీ జవాన్లు పిల్లవాడిని అడ్డుకొని పక్కకు పంపేశారు.

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections 2023) జరగనున్నాయి. దాంతో అధికార బీజేపీ, విపక్షాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శని, ఆదివారాలు పలు ప్రాంతాల్లో ప్రదాని మోదీ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. కర్ణాటకలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమంటూ పలు సర్వేలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి. అటు బీజేపీ కూడా అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ముమ్మర ప్రచారం చేస్తోంది.

Read Also : AP DSC 2023 : ఏపీలో ఎన్నికల ముంగిట డీఎస్సీకి సన్నాహాలు.. ఎన్ని పోస్టులు భర్తీ?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles