Morning Wake Up: గజిబిజీ జీవనశైలి కారణంగా ఉదయాన్నే లేవడం అనేది చాలా కష్టంతో కూడిన పని. రోజంతా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండటం కోసం ఉదయాన్నే నిద్ర లేవాలని సూచిస్తున్నారు. తద్వారా అన్ని పనులను సకాలంలో చేయవచ్చని పేర్కొంటున్నారు. నడక, వ్యాయామం, యోగా చేసేందుకు సమయం దొరుకుతుంది. తొందరగా కార్యాలయానికి వెళ్లగలుగుతారు.
మనలో చాలా మందికి ఉదయం లేటుగా లేవడం అలవాటుగా మారి ఉంటుంది. రాత్రి ఆలస్యంగా పడుకోవడం కావచ్చు, ఆఫీసుల్లో లేటవడం కావచ్చు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో గడపడం కావచ్చు.. ఇలా అనేక రకాల కారణాలతో ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు. అయితే, ఉదయం త్వరగా లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. (Morning Wake Up)
ఉదయాన్నే 6 నుంచి 7 గంటల్లోపు నిద్రలేవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆలస్యంగా లేచిన వారికంటే ఉదయం లేచే వ్యక్తుల తెలివితేటలు వేగంగా ఉంటాయని అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. చాలా మంది ఉదయం హడావుడిలో టిఫిన్ చేయడం స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
తప్పనిసరిగా ఉదయం అల్పాహారం తీసుకోవాలని, దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. అలాగే ఉదయం లేవగానే కాస్త యోగా, వాకింగ్, వ్యాయామం లాంటివి చేయడం ద్వారా శరీరం ఉత్తేజంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఆడ్రినలిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. మానసికోల్లాసం మీ సొంతం అవుతుంది. అలాగే సమయం ఎక్కువగా దొరుకుతుంది. ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది.
ఉదయాన్నే నిద్రలేవాలంటే ఏం చేయాలి?
స్మార్ట్‌ఫోన్లు రాక ముందు అలారం గడియారాన్ని పెట్టుకొనేవాళ్లు. అది మోగిందంటే కచ్చితంగా నిద్ర నుంచి మేల్కోవాల్సిందే. అయితే, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సెల్‌ఫోన్ అలారం వచ్చేసింది. దీంతో సమస్య వచ్చిపడుతోంది. అందులో స్నూజ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఓ పది నిమిషాలో, ఐదు నిమిషాలో సైలెంట్ అయిపోయి మళ్లీ మోగుతుంది. ఇలా మంచం మీద నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. అలాగే పడుకుండిపోయి తీరా సమయం మించి పోయిన తర్వాత ఉరుకులు పరుగులతో నిద్ర లేవాల్సి ఉంటుంది. అందువల్ల, మొబైల్ ఫోన్‌ను చేతులకు అందకుండా దూరంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో అలారం సెట్ చేసిన సమయానికి మోగుతుంది.. మీరు సమయానికి నిద్ర నుంచి మేల్కొంటారు. ఇలా చేయడం వల్ల అలారం ఆఫ్ చేయడానికి మంచం మీద నుంచి లేవాల్సి వస్తుంది.. దీంతో నిద్ర కూడా పోతుంది.
ఉదయం లేచిన తర్వాత చాలా మందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంది. బెడ్ కాఫీ, బెడ్ టీ అని పిలుస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, కాఫీ, టీలు తాగడానికి బదులుగా మీరు గోరువెచ్చని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. దీని కారణంగా మన శరీరం వెంటనే చురుకుగా మారుతుందని చెబుతున్నారు. మలబద్ధకం, ఎసిడిటీ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Read Also : Sleep: నిద్రపోవడం తగ్గిస్తున్నారా? నిద్ర తక్కువైతే ఏం జరుగుతుంది?