Periods: సాధారణంగా ప్రతి నెలా మహిళల్లో నెలసరి (Periods) సమస్య వస్తూనే ఉంటుంది. ఇది అనివార్యమైనది. కొందరిలో పీరియడ్స్ (Periods) సమయంలో బ్లీడింగ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా యువతుల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. విపరీతమైన బ్లీడింగ్ కారణంగా బాగా నీరసించిపోతుంటారు. ఆ సమయంలో ఏ పనీ చేయడం ఇష్టం లేక చికాకు వేస్తుంది. అయితే, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు, ఉపాయాలు సూచిస్తున్నారు.
అధిక బ్లీడింగ్‌తో బాధపడుతున్న యువతులు కొందరు చాలా సార్లు ప్యాడ్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొందరు యువతులు ట్యాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. అయితే, వీటి వాడకం గురించి చాలామందికి అనేక సందేమాలు కలుగుతుంటాయి. కన్నెపొర దెబ్బతింటుందని అనుమానం వ్యక్తం చేస్తుంటారు.
ట్యాంపూన్ల వాడకం వల్ల కొన్నిసార్లు కన్నెపొర దెబ్బతినే ఆస్కారం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాటిని వాడినా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. నెలసరి స్రావాల్ని శోషించుకునే ఈ పరికరం యోని లోపలే ఉంటుంది కాబట్టి.. ఎక్కువ సేపు మార్చకుండా ఉంటే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లాంటి జబ్బులు సోకే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు మెన్‌స్ట్రువల్ కప్ వాడినా సరే.. దాన్ని మూడు నాలుగు గంటలకు ఒకసారి ఖాళీ చేస్తూ ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
ట్యాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లలాంటి వాటితో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులకు కన్నెపొర దెబ్బతింటుందనే అనుమానాలు వెంటాడతాయి. ఇలాంటి తరుణంలో చిన్న సైజు మెన్‌స్ట్రువల్ కప్‌ను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ తరహా కప్‌లలో స్మాల్, మీడియం, లార్జ్.. ఇలా రకరకాలు ఉంటాయని చెబుతున్నారు. చిన్నవి అయితే కప్పు ఎక్కువ లోపలికి వెళ్లే ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
టాంపూన్లు మీకు సరైనవా కాదా అనే దాని గురించి వ్యక్తిగత డాక్టర్‌ను కలిసి అడిగి తెలుసుకోవచ్చు. అయితే మీరు టాంపూన్లను ఉపయోగిస్తుంటే.. కొన్నింటిని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేబుల్‌లో ఇచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మీరు ఇంతకు ముందు టాంపూన్లను ఉపయోగించినప్పటికీ.. ప్యాకేజీలోని సూచనలను రెండోసారి చదివి అవగాహనకు రావాలని పేర్కొంటున్నారు.
టాంపూన్ ఉపయోగించే ముందు, తరువాత మీ చేతులు క్లీన్ చేసుకోవాలి. వీలైతే డెటాల్ లాంటివి వాడి కడుక్కోవాలి. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడంలో మీకు ఉపయోగపడుతుంది. మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే టాంపూన్లను వినియోగించాలని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. మరే ఇతర సమయాల్లోనూ లేదా మరే ఇతర కారణాలతో వాటిని వాడరాదని స్పష్టం చేస్తున్నారు. ఇలా వాడితే అనారోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. కోరి వ్యాధులను తెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడే క్రమంలో తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
Read Also : Black Pepper: నల్ల మిరియాలతో ఈ జబ్బులన్నీ పరార్.. బెస్ట్ హెల్త్ టిప్స్ ఇవే!