China President: నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో ప్రస్తుతం ముందెన్నడూ లేని వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు విపరీతంగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. చైనాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా జననాలు తగ్గిపోతున్నాయి. దీంతో అభివృద్ధికి నోచుకోవడం సాధ్యం కాదనే భయాన్ని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలోని అమ్మాయిలందరినీ అధ్యక్షుడు వేడుకుంటున్నారు. దయచేసి పెళ్లి చేసుకోవాలంటూ బతిమాలుకుంటున్నారట. (China President)
చైనా దేశంలోని యువతులంతా వివాహాలు చేసుకొనేందుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్.. అమ్మాయిలు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఆ దేశంలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు అక్కడి యువతులు వివాహం అంటేనే ఆమడ దూరం పరుగెత్తుతున్నారు.
ఇంతటి దయనీయ పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివిధ కార్యక్రమాలను చేపడుతూ యువతలో అవగాహన పెంపొందిస్తున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని ఏర్పరచడంలో మహిళలు ముందుంటారని వ్యాఖ్యానించారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంచాలని అభిప్రాయపడ్డారు.
గతేడాది చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయింది. 1.09కి చేరుకోవడంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెట్టింపయ్యింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం ఉండేది. అయితే ఇప్పుడది 43.2 శాతానికి చేరుకుంది. పిల్లలను పెంచేందుకు భారీగా ఖర్చు అవుతోంది.
పిల్లల కెరీర్ సంక్షోభం, లింగ వివక్షతోపాటు ఇతర అంశాలు చైనా యువత పెళ్లికి దూరం కావడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇందుచేతనే శిశు జననాల రేటు చైనాలో అమాంతం దిగజారింది. ఈ సంక్షోభం దృష్ట్యా చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని ఇటీవలి కాలంలో చాలా సార్లు కోరారు. భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనుందనేది బహిరంగంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా భారీగా ఉంది. ఇక చైనాలో కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. భవిష్యత్తులో సంక్షోభ పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్నాయంటూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.