Hindu Dharmam: హిందూ మతం వేరు ధర్మం వేరు. మన భారతదేశం హిందూ మతం మీద ప్రముఖంగా ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. హిందూ మతం బొట్టు పెట్టుకోమని చెబుతుంది. హిందూ ధర్మం మన పక్కన ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టి ఆదుకోమని చెబుతుంది. ఇలా ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టే క్రమంలో వాడికి బొట్టు ఉందా లేదా అన్నది చూసుకోవద్దని హిందూ ధర్మం చెబుతుంది. (Hindu Dharmam)
హిందూ దేశంగా పేరుగాంచిన మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఇస్లాం కావొచ్చు, క్రిస్టియానిటీ కావొచ్చు, బుద్ధిజం గానీ, జైనిజం గానీ ఇలా.. అన్ని రకాల మతాలు ఇంత స్వేచ్ఛగా వ్యాప్తి చెంది హిందువులతో పాటు సమానంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారంటే అందుకు కారణం కేవలం హిందూ ధర్మమే. హిందూ ధర్మంలో అందరినీ అంగీకరించాలని, ఆహ్వానించాలని చెబుతారు. తరతరాలుగా ఇదే కొనసాగుతోంది.
హిందూ ధర్మంలో పరమత సహనం ఉంది. ఎవరు ఏ దారిలో వెళ్లినా చివరకు కలవాల్సింది ఒకేచోట అన్నది హిందూ ధర్మం బోధిస్తుంది. ఇది సనాతనంగా వస్తున్న హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటేనే హిందూ ధర్మం. కానీ, ఇటీవలి కాలంలో సనాతన ధర్మాన్ని విమర్శించడం, అసలు సనాతన ధర్మం అంటే పూర్తిగా తెలియని కొందరు అదొక ఫ్యాషన్‌గా పెట్టుకొని క్రిటిసైజ్ చేస్తున్నారు. దేవాలయాలపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా హిందూ ధర్మాన్ని నమ్మే వారే గుడికి రావాలని, అలా నమ్మని వారు రావాల్సిన పని లేదని హిందూ ధర్మం చెబుతుంది. ధర్మాన్ని ప్రశ్నించేవాడు, విమర్శించే వ్యక్తులు గుడికి రావాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. ధర్మం ఎవరు పాటిస్తే వారు గుడికి వెళ్లొచ్చు. ఆచరించవచ్చు. అదే కాదు, భక్తి భావం అనేది పూర్తిగా వ్యక్తుల వ్యక్తిగత విషయం. దేవాలయం అనేది ఆధ్యాత్మిక భావనను పెంపొందించే క్షేత్రం. అక్కడికి వెళ్లి విమర్శిస్తాను అనే వ్యక్తులు.. ధర్మానికి సంబంధించి ప్రశ్నలే ఎదుర్కోవాల్సి వస్తుంది.
గుడి అనేది అన్ని వర్గాల ప్రజలూ వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రి, గవర్నమెంట్ బడి కాదు. భక్తి భావం, ధర్మంపై నమ్మకం ఉన్న వాళ్లే గుడికి వెళ్లాలి. ఇలాంటి వ్యత్యాసం తెలియకపోవడం వల్ల చాలా మంది సెక్యులర్ ముసుగులో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు.