Nandi Awards: నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 1998 నుంచి 2004 వరకు నంది నాటక అవార్డుల ప్రదానోత్సవం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో జరిగేది. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సూచన మేరకు జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం మొదలైంది. తిరుపతి, రాజమండ్రి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఆడిటోరియంలను పునర్నిర్మించి కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. తాజాగా వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం దీనిపై సుదీర్ఘ సమాలోచనలు జరిపి.. నంది నాటక అవార్డులను ఐదు విభాగాల్లో అర్హులైన కళాకారులందరికీ అందజేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) వెళ్లడించారు. (Nandi Awards)
ఇవాళ ఏపీ సచివాలయంలో (AP Secretariate) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది నంది నాటక అవార్డులను ప్రధానం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) ఎంతో నమ్మకంతో తనకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేటప్పుడే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నంది నాటక అవార్డులను ఉత్తమ కళాకారులకు అందజేయాలని సూచించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు అర్హులైన కళాకారులకు ఈ నంది నాటక అవార్డులను ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. అయితే ఒకే సారి చిత్ర, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారులకు నంది నాటక అవార్డులు ఇవ్వడం చాలా కష్టమనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
సీఎం జగన్ అనుమతితో తొలుత పద్య, సాంఘిక, బాలలు, యువజన నాటకాలతో పాటు సాంఘిక నాటిక అనే ఐదు విభాగాల్లోని ఉత్తమ కళాకారులకు ఈ నంది నాటక అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ నంది నాటక అవార్డులు ఆ వర్గానికో ఈ వర్గానికో కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టీకరించారు.
ఏపీలో ఫ్రీగా షూటింగ్‌లు చేసుకోవచ్చు..
ఏపీలో (Andhra Pradesh) ఉచితంగా షూటింగ్‌లు చేసుకోవచ్చని ఉత్తర్వులే ఉన్నాయని, ఏపీలోనూ సినీపరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయాక సినిమా పరిశ్రమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది నంది నాటక అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పద్య, సాంఘిక, బాలలు, యువజన నాటకాలతో పాటు సాంఘిక నాటిక అనే ఐదు విభాగాల్లో మొత్తం 73 అవార్డులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ధరఖాస్తు చేసుకునేందుకు ఒక మాసం గడువు ఇస్తున్నామన్నారు. కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేస్తుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలు కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారు వారి ధరఖాస్తును ఉపసంహరించుకునేందుకు వారం రోజుల పాటు గడువు కూడా ఇస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక స్థాయిలో పరిశీలించేందుకు వారు ప్రదర్శించే చోటికే జూరీ సభ్యులు వెళ్తారని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఆడిటోరియంలు ఉన్నాయని, అయితే రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కడ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రంలో తుది పోటీలను ఆరు రోజుల పాటు నిర్వహించి, ఏడో రోజు నంది నాటక అవార్డుల ప్రదానోత్సం జరుగుతుందని పేర్కొన్నారు.
Read Also : AP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!