Tomato price: వంటల్లో నిత్యం వాడే కూరగాయల్లో ఒకటి టమాటా. ప్రస్తుతం టమాటా ధర.. విరాట్ కోహ్లీ మాదిరిగా మార్కెట్లో మాంచి ఫామ్‌లో ఉంది. ఏకంగా సెంచరీ దాటేసింది. టమాటా ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడు కొనేందుకు జంకే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకు కేజీ ధర రూ.20 నుంచి రూ.30 దాకా పలికిన టమాటా.. ఇప్పుడు ఒక్కసారిగా సిక్సర్ల మీద సిక్సర్లు బాదేసి సెంచరీకి చేరుకుంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టమాటా కేజీ రూ.100 దాటేసింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టమాటా ఎక్కువగా కొనుగోలు చేసే ప్రాంతాల్లో వ్యతిరేక వాతావరణం కొనసాగుతోంది. టమాటా లోడుల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే ధర అమాంతం పెరిగేందుకు కారణమైందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ టమాటా ధర (Tomato price) రూ.80 పలుకుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పట్టణంలో హోల్‌సేల్ రేటు కేజీ రూ.80 నుంచి రూ.90 దాకా పలుకుతోంది. ఇక రిటైల్‌లో మాత్రం రూ.100 పైకి ఎగబాకింది. సాధారణంగా బెంగళూరు నుంచి కాన్పూర్‌కు టమాటాలు అధికంగా వెళ్తుంటాయి. సరఫరాలో అంతరాయం కారణంగా ప్రస్తుతం పుంజుకున్న ధర.. రానున్న రోజుల్లో మరింత పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వచ్చే వారం పది రోజుల్లో టమాటా కిలో రూ.150కిపైనే చేరుకోవచ్చని కూరగాయల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు దేశ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబై నగరంలోనూ టమాటా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. నగరంలో రిటైల్ ధర రూ.100ను టచ్ చేసింది. హోల్‌సేల్‌లో కేజీ రూ.50 పలుకుతోంది. బెంగళూరు నగరంలోనూ మొన్నటివరకు రూ.30 పలికిన టమాటా ధర.. తాజాగా రూ.100 మార్క్‌ను చేరుకోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇక మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లో కూడా టమాటా సాగు అత్యధికంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల టమాటా ఎగుమతులు, మార్కెట్ పరిస్థితుల్లో ఒడిదొడుకులు ఏర్పడ్డాయి.
టమాటా పండించే రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు, వర్షాలు పడ్డాయి. రుతుపవనాలు ప్రవేశించడంతో ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో టమాటా పంట పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రేట్లు పెరిగేందుకు కారణమైందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్, రామనగర జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టమాటాపై ప్రభావం పడింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో టాప్ క్వాలిటీ టమాటా ధర కేజీ రూ.100 పెట్టనిదే రావడం లేదు. దేశంలో టమాటా అధికంగా పండించే రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్ దేశంలోనే పేరు గాంచింది. ఇక్కడ తరచూ టమాటా గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారపోసిన ఉదంతాల కోకొల్లలు. ప్రస్తుతం ఈ మార్కెట్‌లోనూ ధర పెరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ మార్కెట్‌లో మొన్నటి వరకు టమాటా ధర రూ.20 పలికింది. ఇప్పుడు అక్కడ కూడా ధర పెరుగుతోంది.
ఇక కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ధరల నియంత్రణ సెక్షన్ ప్రకారం కేజీ టమాటా రేటు సరాసరి రూ.25 నుంచి రూ.41కు చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్‌లో టమాటా రేటు రూ.80 నుంచి రూ.113 దాకా పలుకుతోంది.
ఇలా అయితే డకౌట్.. లేదా సెంచరీ.. అనేటట్లు టమాటా పరిస్థితి తయారవుతోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ధరలు స్థిరీకరించి అటు రైతన్నకు, ఇటు వినియోగదారులకు ఊరట కలిగించాల్సిన అవసరం ఉంది.
Read Also : Benefits of Dates: డేట్స్ నానబెట్టుకొని తింటే ప్రయోజనాలివే.. పురుషుల్లో ఆ శక్తి పుంజుకుంటుంది!