Deepam: దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం సర్వతమోపహః.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యా దీపం నమోస్తుతే.. అన్నారు పెద్దలు. మనలో ఉన్న పాప నివృత్తి, హరిషడ్వర్గ నివృత్తికి దీపం వెలిగించడం ద్వారా సాధ్యమని పెద్దలు చెబుతున్నారు. దీపాన్ని వెలిగించడం ద్వారా జ్ఞనవృద్ధి, సంపదవృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. హిందూ ధర్మం ప్రకారం నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. (Deepam)
ప్రతి లక్ష్మీవారం కామాక్షి దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ దీపాన్ని వెలిగించడం కోసం ముందుగా అష్టపద్మాలతో కూడిన ముగ్గు వేసుకొని లేదా 16 దళాలతో కూడిన పద్మాన్నిగానీ వేసుకోవాలి. పద్మం మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. దానిమీద మట్టి ప్రమిదలతో కూడిన దీపాన్నిగానీ, కామాక్షి దీపాన్ని గానీ ఉంచాలి. దీపాన్ని ఉదయం 6.30 నిమిషాల సమయంలో సూర్యుడు ఉదయించేటప్పుడు వెలిగించాలని చెబుతున్నారు.
దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానమని స్పష్టం చేస్తున్నారు పెద్దలు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేనికీ లోటు ఉండదని వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కామాక్షి దీపం అనేది అధిక ప్రాశస్త్యం కలిగినదిగా చెబుతున్నారు. పూర్వ కాలం నుంచి ఈ దీపాన్ని వెలిగించడం కొందరు ఆనవాయితీగా చేస్తుంటారు. కామాక్షి దీపం ఇంట్లో పెట్టుకోవడం అనేది సర్వ ఐశ్వర్యాలను చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు.
అంతకు ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేవాలని చెబుతున్నారు. దాంతోపాటు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా నిల్వ ఉండే ఆహారం గానీ, ఉతకాల్సిన బట్టలు ఉండరాదని సూచిస్తున్నారు. తలంటు స్నానం చేసి నిష్టగా ఈ కార్యక్రమాన్ని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో కామాక్షి అమ్మవారి దయ మెండుగా కలుగుతుందని చెబుతున్నారు. కామాక్షి అమ్మవారి దీపం వెలిగించాక ఆ దీపానికి తప్పకుండా నైవేద్యాన్ని పెట్టాలని సూచిస్తున్నారు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారని స్పష్టం చేస్తున్నారు.
దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలని పెద్దలు చెబుతుంటారు. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించట అని అర్థం. శరీరాన్ని, మనసును జ్ఞానంతో దేవునికి అర్పించటమే దీపారాధన పరమార్థంగా చెబుతారు. దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమేనని పెద్దలు చెబుతారు. వెలుగుతున్న ఒత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుందని అనాదిగా పూర్వీకులు కూడాచెబుతున్న మాట. అంధకారాన్ని పారదోలి, వెలుగులు నింపడమే దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి. అంధకారమంటే… కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమేనని పెద్దలమాట.
చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవిగా చెబుతారు. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి.
Read Also : Devotional Tips Deepalu: దీపాలను ఆర్పే విధానం తెలుసా? అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పేయరాదు!