YSRCP Meeting: నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండాలని సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నిన్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్సార్‌సీపీ ప్రతినిధుల సమావేశం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరించారు. (YSRCP Meeting)
దేశ, రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ అనలేని మాటలు మీ బిడ్డ అంటున్నాడని సీఎం జగన్ తెలిపారు. అక్కా, చెల్లెమ్మా, అన్నా, తమ్ముడూ.. అబద్ధాలు, మోసాలను నమ్మకండి.. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే అదొక్కటే కొలమానంగా తీసుకోండి అని సూచించారు. మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండని కోరారు. మన ధైర్యం.. మనం చేసిన మంచి.. ఆ మంచి ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో జరిగింది.. అందుకే వై నాట్ 175 అనే నినాదాంతోనే అడుగులు ముందుకు వేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు చెప్పిన విషయాలు గ్రామస్థాయిలోకి తీసుకుని పోవాలని మీ అందరినీ కోరుతున్నానన్నారు. ప్రతి గ్రామంలో మన జెండా రెపరెపలాడేట్లుగా చేయాలన్నారు. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉందంటూ శ్రేణులకు సీఎం జగన్ సూచించారు.
నాలుగు కార్యక్రమాలు ఇవీ..
1. జగనన్న ఆరోగ్య సురక్ష
– గత నెల 30న మొదలు పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష నవంబర్ 10 దాకా కొనసాగుతుంది.
– రాష్ట్రంలో ఏ ఒక్కరూ వ్యాధుల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం.
– వ్యాధుల బానిన పడినా వారికి మంచి వైద్యాన్ని చేయి పట్టుకొని నడిపిస్తూ అందిచాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.
– ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అంటారు. రోగాల స్థాయికి వెళ్లక ముందే పేదవాడిని కాపాడుకోగలిగితే వారికి మంచి చేసిన వాళ్లమవుతాం.
– ప్రివెంటివ్ కేర్‌లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం.
– 15,004 సచివాలయాల పరిధిలో 15 వేల క్యాంపులు నిర్వహిస్తున్నాం.
– కోటీ 60 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నాం.
– ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికీ తోడుగా, అండగా నిలబడుతున్నాం.
– జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ మ్యాప్ చేస్తున్నాం. ఉచితంగా పరీక్షలు ఇంటి వద్దనే చేస్తున్నాం.
– 4వ దశలో గుర్తించిన వారికి వ్యాధి నయం అయ్యేంత వరకు ఉచితంగా పూర్తి స్థాయిలో చేయూత ఇచ్చే కార్యక్రమం 5వ దశ.
– ప్రజలకెంతో మేలు చేసే ఈ కార్యక్రమానికి ఎంత ఎక్కువ చేరువ చేస్తే ఆ ఫలాలు అంత పేదవాడికి అందుతాయి.
– పేదల ఆశీస్సులు ఘనంగా మనందరికీ, మన పార్టీకి లభిస్తాయి.
– ఇకమీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ప్రతి 6 నెలలకోసారి గ్రామాల్లో కొనసాగుతుంది.
– విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టులు అనుసంధానం జరుగుతాయి.
2. వై ఏపీ నీడ్స్ జగన్
– మనందరి ప్రభుత్వమే మళ్లీ ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలకు మరింతసేవ చేయడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమం.
– ఈ కార్యక్రమం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 దాకా కొనసాగుతుంది.
– ఇందులో రెండు ముఖ్యమైన దశలు. మొదటిది మన గ్రామాల్లోనే సచివాలయాలను సందర్శించడం.
– రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లడం.
– గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా పాలుపంచుకోవాలి.
– తర్వాత మండల స్థాయి నాయకులతో మమేకం కావాలి.
– అదే సచివాలయం పరిధిలో, ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
– ఆ తర్వాత గ్రామంలో ఉన్న స్థానిక పెద్దల ఇంటికి వెళ్లి కలవాలి. వారితో సమావేశం కావాలి. వారి ఆశీస్సులు తీసుకోవాలి.
– ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చిందో మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించా.
– ఆ ప్రసంగాన్ని అర్థం చేసుకొని గ్రామస్థాయిలో ప్రజలకు, పెద్దలకు వివరించాలి.
– మరుసటి రోజు ఇంటింటికీ వెళ్లాలి.
– సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు ప్రతి ఇంటినీ, ప్రతి గడపనూ విధిగా సందర్శించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చెప్పాలి.
– 2019లో మనం ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని ప్రజలకు అర్థమయ్యేట్లుగా చూపించాలి.
– మన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు అదే సమయంలో.. 2014లో గత ప్రభుత్వం మేనిఫెస్టో ప్రతి వాగ్దానాన్ని ఎలా ఎగ్గొట్టిందో, ప్రజలను వాళ్లు ఎలా మోసం చేసిందో చెప్పాలి.
– వినయంగా, సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో టైమ్ తీసుకొని చెప్పాలి. మోసపోకండి అని చెప్పాలి.
3. బస్సు యాత్రలు
– అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో బస్సుయాత్రలు.
– ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా ఉంటారు.
– ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రోజూ 3 ప్రాంతాల్లో మీటింగులు.
– సాయంత్రం బస్సుపై నుంచే నేతల ప్రసంగాలు.
– బస్సు యాత్రలో మీరందరూ పాల్గొనాలి.
– ఇది మామూలు బస్సు యాత్ర కాదు.. సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర.
– రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే యుద్ధం పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధం.
– ఆ పేద వాడి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
– 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో మీటింగులు.
– రేప్పొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందారు మరోవైపు. పేదవాళ్లంతా ఏకం కావాలి.
– అప్పుడే ఈ పెత్తందార్లను మనం గట్టిగా ఎదుర్కోగలుగుతాం.
– మన జెండా మోసే ఆ పేదవాడే బస్సు యాత్రల్లో పాల్గొంటాడు.
4. ఆడుదాం ఆంధ్ర
– డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర. ఇది ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం.
– నైపుణ్యం ఉన్న వారిని గుర్తించాలని, వారిని ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
– భారతదేశ అన్ని టీమ్‌లలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం జరగాలి.
– గ్రామ వార్డు సచివాలయాలు మొదలు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలోక్రీడా సంబరాలు జరుగుతాయి.
– మీరంతా తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.
ఇదీ చదవండి: Krishna Water: కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం