Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాల్లో తరచూ మంత్రులు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మొదట మొదలు పెట్టేది ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి అయినా సరే.. తర్వాత వరుసగా మంత్రులు రియాక్ట్ అవుతుంటారు. తాము గొప్పంటే తామే గొప్పంటూ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botcha Satyanarayana) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలంగాణ మంత్రులు దీటుగా స్పందించారు. అయితే, ఎవరి పాలన వాళ్లు చూసుకోక… ఎందుకు ఇవన్నీ.. అవసరమా.. బాగనే పాలన చేసుకుంటున్నారు కదా… అంటూ సామాన్య జనం చర్చించుకుంటున్నారు. (Andhra Pradesh vs Telangana)
మంత్రి బొత్స ఏమన్నారంటే..
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పై మంత్రి బొత్స నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో స్కామ్ ఎలా జరిగిందో అంతా చూస్తూనే ఉన్నామన్నారు. అన్నీ చూచిరాతలేనంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఎంత మంది అరెస్ట్ అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదంటూ హితవు పలికారు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి విధానం వారిదంటూ కామెట్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తెలంగాణ మంత్రుల కౌంటర్
ఏపీ మంత్రి బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలంటూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణను కించపరిచేలా బొత్స వ్యాఖ్యాలున్నాయని అభ్యంతరం తెలిపారు. బొత్స తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తమ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంత స్థాయి ఆయనకు లేదన్నారు. కేసీఆర్ విజన్ తో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై చర్చకు బొత్స సిద్ధమా? అని ప్రశ్నించారు. గురుకుల్లో ఒక్క విద్యార్థి పై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఏపీలో ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. తమ దగ్గర రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారని వివరించారు. TSPSCలో అవకతవకలపై సిట్ తో విచారణ జరిపిస్తున్నామని మంత్రి సబిత వివరణ ఇచ్చారు.
ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. ఏపీలో 308 గురుకులాలే ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎన్ని గురుకులాలు, ఏపీలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో బొత్స తెలుసుకోవాలని సూచించారు. ఏపీలో విద్యా వ్యవస్థ అసలు ఎక్కడుందంటూ ప్రశ్నించారు. TSPSCలో స్కామ్‌ను బయటపెట్టింది తమ ప్రభుత్వమే కదా? అని సమర్థించుకున్నారు. ఏపీలో బదిలీలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దొడ్డిదారిన తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయని, ఏపీకి ఒక్కటైనా వచ్చిందా? అని గంగుల ప్రశ్నించారు. తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని నిలదీశారు. తెలంగాణలో ఉన్న సంపద ఎత్తుకెళ్లాలని చూస్తున్నారా? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం గురించి ఏపీ ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పారు. తమ జోలికి రావద్దని.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి బొత్స హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని హెచ్చరించారు. బొత్స వ్యాఖ్యలను సీఎం జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. బొత్స వ్యాఖ్యలను సమర్థించకపోతే ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గంగుల డిమాండ్ చేశారు.
రాజధాని లేని రాష్ట్రం…: శ్రీనివాస్ గౌడ్
బొత్స అలా మాట్లాడడం సరికాదంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రాజధాని కూడా లేని రాష్ట్రం అదంటూ ఎద్దేవా చేశారు. స్కామ్‌లు చేసింది వాళ్లేనన్నారు. గతంలో APPSCలో కుంభకోణాలు జరిగాయన్నారు. హైదరాబాద్ కు రాకపోతే వాళ్లకు పూట గడవదని వ్యాఖ్యానించారు. బదిలీల పేరుతో వీళ్లు దందాలు నడిపారంటూ ఆరోపించారు. TSPSC స్కాంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చారు. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశారని, బొత్స బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదన్నారు.
గతంలోనూ ఇలాగే…
ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ సర్కార్‌తో పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకొనే స్థాయికి చేరింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎంగా ఉన్న చంద్రబాబుతో ఫైటింగ్ ప్రకటించారు. నీకు ఏసీబీ ఉంది.. నాకూ ఏసీబీ ఉందంటూ ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రులే స్థాయికి మించి విమర్శలు చేసుకున్న పరిస్థితులు చూశాం. అయితే, ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చారని ఇప్పటికీ తెలంగాణలో, ఏపీలో చెబుతుంటారు.
అటు తర్వాత చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ముఖ్యమంత్రిగా జగన్ వచ్చాక కేసీఆర్‌తో సఖ్యతగానే మెలుగుతున్నారు. ఇరువురూ ఒకరి ఇంటికి మరొకరు వచ్చి భోజనం కూడా తిన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకొనే దిశగా అడుగులు పడినట్లు కనిపించాయి. అయితే, రానురాను ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ వ్యతిరేకించారు. కేంద్రంపై భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో జగన్ మాత్రం బీజేపీ ప్రభుత్వంతో సానుకూలంగానే మెలుగుతున్నారు.
అప్పటి నుంచి ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రులకు బదులుగా మంత్రులు, ముఖ్య నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అప్పుడప్పుడూ రాజకీయంగా పబ్బం గడుపుకోడానికి మాత్రమే మంత్రులు కామెంట్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఎందుకు ఇవన్నీ… బాగాన పాలన చేసుకుంటున్నారు కదా..! ఇవన్నీ మానుకొని ఎవరి పాలన వాళ్లు చూసుకుంటే మంచిది కదా…! అని సామాన్య జనం అనుకుంటున్నారని టాకు!!
Read Also : Pawan Kalyan on Volunteers: మారిన పవన్ స్వరం.. వలంటీర్లు తనకు సోదర సమానులన్న జనసేనాని!