Tirumala Samacharam 29-07-2023: కలియుగ వైకుంఠం శ్రీవారి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. గోవిందుడి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. మెట్ల మార్గంలో కాస్త భక్తుల తాకిడి కొనసాగుతోంది. అలాగే 10 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,378 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala Samacharam 29-07-2023)
శ్రీవారి పుష్కరిణి మూసివేత..
శ్రీవారి సన్నిధి, ఆలయం వద్ద గల పుష్కరిణిని నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని అధికారులు తెలిపారు.
Read Also: TTD Chairman: టీటీడీ చైర్మన్ రేసులో భూమన? సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉండదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ టీటీడీ అందుబాటులో ఉంచింది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తీసివేసి స్వల్ప మరమ్మతులు నిర్వహించనున్నారు.
ఆగస్టు 7న టీటీడీ పాలకమండలి సమావేశం
ఆగస్టు 7న టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఆగస్టు 8న టీటీడీ పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. అధిక మాసం కావడంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ.
Read Also : Global Tigers Day: ఎస్వీ జూ పార్కులో గ్లోబల్ టైగర్స్ డే వేడుకలు