Target YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) మరణానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో ఓ రకమైన రాజకీయం నడుస్తోంది. అదేంటంటే… వైఎస్ కుమారుడు జగన్ ఒక్కడే ఒకవైపు, మిగతా అందరూ ఒకవైపు! అదెలాగంటారా…? ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రతో మొదలైన ఒంటరిపోరు.. నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టడం మొదలు.. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించడం జరిగిపోయాయి. 2011 మార్చి 11న ఆయన వైఎస్సార్‌సీపీని నెలకొల్పారు. (Target YS Jagan)
ఆ తర్వాత తన వెంట ఎవరు వచ్చినా రాకున్నా, తన బాట ముళ్లబాట అని, తన దారిలో వచ్చే వారికి కష్టాలు తప్పవని ముందే హెచ్చరించారు. అయితే, ఆయన వెన్నంటి నడిచే సైన్యం అప్పట్లో కూడా ఆగలేదు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ఒక్కడే ఒకవైపు మిగతా అన్ని పార్టీలు మరోవైపున ఏకమయ్యాయి. ఆ తర్వాత కొవ్వూరు ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీటు. ఇక్కడ మిగతా అన్ని పార్టీలూ అంటే తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎం, అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కూడా. అయినప్పటికీ జగన్‌ను ఆపలేకపోయారు.
2012లో జగన్ వెంట నడిచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా తమ రాజీనామాల ఆమోదం కోసం ఇంత మంది ఎమ్మెల్యేలు బహుశా చరిత్రలో పోరాటం చేసి ఉండరేమో. అప్పట్లో 18 అసెంబ్లీ, 1 ఎంపీ ఉప ఎన్నికకు వచ్చిన సందర్భంలోనూ జగన్ పార్టీ ఒక్కటే ఒకవైపు ఉంది.. మిగతా పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఆ సందర్భంగా తన వైపు నిలిచిన ఎమ్మెల్యేల గెలుపును జగన్ శాసించారని చెప్పొచ్చు. ఇక 2014లో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా అప్పుడు కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొని జనసేనతో కలిసి పోటీ చేశాయి.
అప్పట్లో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా వీరితో కలిసి జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అప్పుడు కూడా ఎమ్మెల్యేల సంఖ్య 67కు పెంచుకున్నారే తప్ప.. జగన్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్లీ 2019లో కూడా.. టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు విడిపోయినట్లు యాక్ట్ చేసి పోటీ చేశాయి. ఫలితం.. దిమ్మతిరిగేలా జగన్‌కు 151 ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పరాభవం ఎదురైంది. అప్పుడు కూడా జగన్‌కు ఏ ఒక్క పార్టీ అండగా లేదు. ఇక 2024లో కూడా 2014 సీన్ రిపీట్ కాబోతోందని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ప్రస్తుతం పొత్తు కోసం పరితపిస్తున్నారు. తనకివే చివరి ఎన్నికలని, ఈసారి టీడీపీని గెలిపించకపోతే పార్టీ కనుమరుగు కాక తప్పదనే భయంతో చంద్రబాబు శతవిధాలా ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. బీజేపీతోనూ పొత్తు పెట్టుకొని ఈసారి ఎలాగైనా గెలవాలనే తాపయత్రయంలో ఉన్నారు. అంటే… 2024లోనూ జగన్ ఒంటరే. అందరూ కలిసి ఇప్పటికే జగన్‌ను టార్గెట్ చేశారు.
ఏరకంగా చూసుకున్న జగన్ బిజినెస్ సక్సెస్సే..!
మొదట 1 ఎమ్మెల్యే 1 ఎంపీ, తర్వాత 17 ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 151…. ఇలా అందరూ కలిసి ఏకమైతే జగన్‌కే ప్లస్ అవుతోంది తప్ప.. ఏరకంగా చూసినా జగన్ ఓటమిని చూడలేకపోతున్నారు ప్రత్యర్థులు. అంటే.. జగన్‌ను ఎంత టార్గెట్ చేస్తే అంత ఆయన పైకెదిగిపోతున్నాడనే వాస్తవం ప్రతిపక్షాలు తెలుసుకోవడం లేదు. ఈ లాజిక్కు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ… అందరూ ఏకం కావాలి.. తమనే టార్గెట్ చేయాలి.. ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందాలని ఉవ్విళ్లూరుతోంది. అటు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కూడా జోరుమీదుంది. అందరూ కలిసి జగన్‌నే టార్గెట్ చేస్తే.. తమ పోరాటాన్ని, ప్రజాదరణను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రత్యర్థి వర్గ సోషల్ మీడియాతో పెద్ద యుద్ధమే చేస్తోంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా. ఈ పోరులో జగన్ గెలుపు తమ కళ్లముందు కనిపిస్తోందని శ్రేణులు చెప్పకనే చెబుతున్నాయి.
లక్షకోట్ల దోపిడీ, క్విడ్ ప్రోకో, తండ్రి పదవిని అడ్డుపెట్టి దోచుకున్నారు.. ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేస్తే అంత జగన్‌కే ప్లస్ అవుతోందనడంలో అణువంతైనా సందేహం లేదు. ఇప్పుడు కూడా అదే ప్యాట్రన్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన జతకట్టి జగన్‌పై విరుచుకుపడుతున్నాయి. నిన్నగాకమొన్న అమిత్ షా వచ్చి కూడా జగన్ టార్గెట్‌గా ప్రసంగం చేశారు. ఇక జగన్‌కు వ్యతిరేకమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ లాంటివి ఎలాగూ రోజూ జగన్ నెత్తిన పాలుపోసి ప్రజలు గెలిపించేంతగా అదేపనిగా టార్గెట్ చేస్తున్నాయనుకోండి.. వీటన్నింటినీ క్రోడీకరిస్తే… ఒక్క ముక్కలో చెప్పాలంటే.. జగన్‌ను అందరూ కలిసి ఎంత తిడితే అంత ఆయనకే ప్లస్ అవుతోందన్నమాట.