Kilaru Rajesh : ఏపీలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో (Skill Develepment Scam) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. లోకేష్ (Nara Lokesh) సన్నిహితుడు కిలారు రాజేష్‌ను ఇవాళ ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేశారు. (Kilaru Rajesh)
రేపు కూడా విచారణకు రావాలని కిలారు రాజేష్‌కు అధికారులు సూచించారు. స్కిల్ స్కామ్‌లో కిలారు రాజేష్ ను సీఐడీ (AP CID) 25 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మనోజ్ వాసుదేవ్ పార్థసానితో సంబంధాల పై రాజేష్ కు ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. పార్థసాని ఎవరో తనకు తెలియదంటూ కిలారు రాజేష్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పార్థసానితో వాట్సాప్ చాటింగ్, నగదు ట్రాన్సక్షన్ వివరాలను కిలారు రాజేష్ ముందు ఉంచడంతో కాస్త ఖంగారుపడ్డాడని సమాచారం.
ఈ పరిణామంతో కిలారు రాజేష్ సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి కిలారు రాజేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల నుంచి వచ్చిన నగదును ఎవరెవరికి చేరవేశారని సీఐడీ ఆరా తీసింది.
ఈ ప్రశ్నలకు కూడా తనకు తెలియదంటూ కిలారు రాజేష్ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. చంద్రబాబు, లోకేష్ కు పంపిన మెయిల్స్ పై కూడా సీఐడీ అధికారులు కిలారుకు ప్రశ్నలు గుప్పించారు. తాను మెయిల్స్ చేయలేదు అనడంతో కొన్ని మెయిల్స్ వివరాలను కూడా అతని ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదంటూ కిలారు సమాధానం దాట వేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి ఇంటరాగేషన్ చేసిన తర్వాత కిలారు పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Ponnavolu: ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వెరవను.. కోర్టులో వాదనలపై ఇంత దిగజారాలా? పొన్నవోలు ఫైర్