Jagananna Thodu: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు రూ.10 వేల చొప్పున సీఎం జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌నొక్కి నిధులు జమ చేశారు. అలాగే సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి రుణ రాయితీని కూడా బ్యాంకు ఖాతాల్లో తిరిగి చెల్లించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం జగన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (Jagananna Thodu)
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏం మాట్లాడారంటే.. (Jagananna Thodu)
“దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల మందికి మంచి జరిగించే కార్యక్రమం జరగలేదు. దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మరో అడుగులో కనిపిస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యసవ్థ, వలంటీర్ వ్యవస్థ, సర్వే వ్యవస్థ, తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తలా ఓ చెయ్యి వేస్తేనే పేద వాడికి మంచి ఫలితాలు అందుతాయి. 5,10,412 మంది అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మంచి చేస్తూ చిరు వ్యాపారాలకు నిజంగా గొప్ప తోడు ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది.
ఇంత వరకు 1,58,7000 మంది అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు చిరు వ్యాపారులందరికీ మంచి జరిగింది. జీవనోపాధి వాళ్లంతకు వాళ్లే చూసుకుంటున్నారు. వాళ్లందరికీ మంచి జరిగింది. 4,54,267 మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్లీ రూ.10 వేలు ఆపైన సున్నా వడ్డీ ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నాం. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి సుమారు 13 వేల వరకు పెంచుకుంటూ పోతున్నాం. కొత్తగా 56 వేల మందికి ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందుతున్న మంచి సందర్భం. ఈ రౌండ్‌లో ఒక్కొక్కరికి కనీసం 10 వేల చొప్పున ఇవ్వడం వల్ల రూ.549 కోట్ల వడ్డీ లేని రుణాలు వారి చేతిలో పెడుతున్నాం.
15,87,492 మంది చిరు వ్యాపారులకు లబ్ధి
ఈ ఏడాది మే వరకు వారు కట్టిన 11 కోట్ల 3 లక్షలు కూడా మళ్లీ తిరిగి వాళ్ల బ్యాంకు అకౌంట్లలోకి వెనక్కి ఇస్తున్నాం. 549 కోట్ల 70 లక్షల రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. 15,87,492 మంది చిరు వ్యాపారులు నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు అందరికీ కూడా వడ్డీ లేని రుణం 2,955 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. వీరిలో ఒకసారి బ్యాంకుల నుంచి రుణం తీసుకొని దాన్ని మళ్లీ తిరిగి చెల్లించి మళ్లీ రుణం పొందిన వారు 13,29,011 మంది. జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారాలు 15.31 లక్షల మందికి సున్నా వడ్డీ కింద 74.69 కోట్లు లబ్ధి చేకూరుస్తూ బ్యాంకు ఖాతాల్లో తిరిగి ఇచ్చాం. చిరు వ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా చాలా సందర్భాల్లో చేస్తున్న పని సమాజ సేవ అని కూడా చెప్పొచ్చు.
ఒకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా వాళ్లంతట వాళ్లే ఇంకా ఒకరికోఇద్దరికో ఉపాధి చూపిస్తూ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు చేసే వారందరికీ కూడా హృదయపూర్వకంగా తోడుగా నిలబడే ఆలోచన చేశాం. చిరు వ్యాపారులందరికీ సున్నా వడ్డీకి రూ.10 వేలు వాళ్ల చేతిలో పెడుతున్నాం. తిరిగి సకాలంలో చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. వాళ్లు కట్టిన వడ్డీ మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. రూ.10 వేలతో మొదలైన ఈ కార్యక్రమం.. క్రమం తప్పకుండా కడితే మరుసటి సంవత్సరం ఒక వెయ్యి ఎక్కువగా 11 వేలు, రెండో సంవత్సరం 12 వేలు.. ఇలా 13 వేల దాకా వాళ్లకు సపోర్ట్ చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరాం.
నా పాదయాత్రలో వారి కష్టాలు కళ్లారా చూశా..
నేను 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా చోట్ల కళ్లారా చూశాను. ఫుట్‌పాత్‌ల మీద వ్యాపారాలు, కూరగాయలు, బండ్ల మీద టిఫిన్లు అమ్ముకొనే వారు.. అందరితోనూ మాట్లాడాను. వెయ్యి రూపాయలు అవసరమైతే రూ.100 కట్ చేసుకొని మొత్తం సాయంత్రానికి 1000 ఇవ్వాలని చెప్పే పరిస్థితి. వర్కింగ్ క్యాపిటల్ లోన్ల పరిస్థితి అంత దారుణంగా ఉండేది. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం నిజంగా ఇబ్బంది. వేరే గత్యంతరం లేక వడ్డీ వ్యాపారస్తులపైనే బతకాల్సిన పరిస్థితి. 10 రూపాయలు వడ్డీ కూడాచెల్లించే పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మార్చాలి అనే పరిస్థితి కోసం జగనన్న తోడు పుట్టింది.
జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులో 80 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే ఉండటం ఇంకో విప్లవం. సామాజికంగా అట్టడుగున ఉన్న వారందరికీ ఇది ఉపయోగపడుతుంది. చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంకా ఎవరికైనా ఈ పథకం రాని పరిస్థితి ఉంటే వాళ్లందరికీ తెలియజేస్తున్నా. సచివాలయ వ్యవస్థలోకి వెళ్లి అడిగినా అక్కడ సిబ్బంది తోడుగా నిలబడి మంచి చేసే కార్యక్రమం చేస్తారు.
వలంటీర్‌ను అడిగినా అప్లికేషన్ పెట్టించి వెరిఫై చేసి ప్రాసెస్ చేస్తారు. 1092కు ఫోన్ చేసినా చెబుతారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేసే ప్రభుత్వం మనది. ఈ ఇంకా ఎక్కువ మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.” అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.