Alliances in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మి నెలల్లోపు ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తులపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో విపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయి. ఆ పార్టీ మద్దతు దారుల్లోనూ తికమక నెలకొంది. తాజాగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో భేటీ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. రేపు మిత్రపక్షాలతో సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుకు సిద్ధమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే, వాస్తవంగా కార్యరూపం దాల్చడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. (Alliances in Andhra Pradesh)
ఏపీలో గడచిన 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ ఒంటరిగా ఉంటోంది. అటు జనసేన మాత్రం బీజేపీతో అలయన్స్‌లో (Alliances in Andhra Pradesh) ఉంది. అది ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేననూ కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 2019 ఎన్నికలకు ముందు మోదీని విమర్శించిన చంద్రబాబు, రాహుల్ గాంధీతో జతకట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లిన చంద్రబాబు.. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీజేపీపై విమర్శలు ఆపేశారు. మోదీ నిర్ణయాలను సమర్థించడం మొదలు పెట్టారు.
ప్రస్తుతానికి ఏపీలో జనసేన-బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతోంది. ఇది కొనసాగుతుందంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తోంది. అయితే, టీడీపీతో పొత్తు విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణం గతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు బీజేపీపై, మోదీపై దూషణలు చేయడమే. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. ఆ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి భేటీకి పవన్ కల్యాణ్‌ను మాత్రమే ఆహ్వానించింది బీజేపీ అగ్ర నాయకత్వం.
చంద్రబాబుకు ఆహ్వానం పలకకపోవడం దేనికి సంకేతం?
కొంత కాలం కిందట పొత్తు విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాషాయం వైఖరేంటనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారుతోంది. బీజేపీ అగ్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు కుదరదని బీజేపీ నేతలు చెబితే పవన్ రియాక్షన్ ఏంటనేది మరింత ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది. చంద్రబాబుకు ఆహ్వానం పలకకపోవడంతో ఇక బాబును దూరం పెట్టేసినట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే, ఎన్నికలు సమీపించే దాకా వేచి చూద్దామనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారా? అనే సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నాయి. అటు అధికార పార్టీ కూడా బీజేపీని ధిక్కరించే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్రంతో సీఎం జగన్ సానుకూలంగానే మసలుకుంటున్నారు. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి కూడా లేదు. జనసేనాని ఎలాగూ పొత్తులో ఉన్నారు కాబట్టి వ్యతిరేకించరు. ఇక కమ్యూనిస్టు పార్టీలు ఎంత పోరాడినా పెద్దగా ప్రయోజనం లేదు.
అటు ఎన్డీయే, ఇటు యూపీఏ.. బాబును దూరం పెడుతున్నాయా?
బీజేపీతో పొత్తుకోసం ఆ మధ్య చంద్రబాబు ప్రాథమికంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఎలాంటి కదలిక కనిపించడం లేదు. టీడీపీతో పొత్తు కుదరదని కేంద్ర పెద్దలు తెగేసి చెబితే… అలా కాదు.. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని పవన్ ఒప్పంచగలరా? టీడీపీని తమ కూటమిలోకి లాగేంత సత్తా జనసేనానికి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గత ఎన్నికల్లో యూపీఏ కూటమికి దగ్గరగా మెలిగారు చంద్రబాబు. అయితే, ఈసారి యూపీఏ సైతం చంద్రబాబు విషయంలో విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో బీజేపీకి సహకారం.. ఏపీలో పొత్తు ప్లీజ్…
ఈసారి పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగే సాహసం చంద్రబాబు చేయరనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో మొదటిసారి ఒంటరిగా పోటీ చేసి దారుణ వైఫల్యాన్ని చవిచూసిన చంద్రబాబు.. అవసరమైతే ఏం చేసైనా సరే.. బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతారనే విశ్లేషణలు వస్తున్నాయి. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న సంకేతాలు ప్రస్తుతానికి ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే భారీగా నష్టపోతామని చంద్రబాబు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీ ఇటీవల కాస్త యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించి ఖమ్మంలో ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు చంద్రబాబు. ఇలా కొన్ని ఓట్లయినా టీడీపీకి పడేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీతో పొత్తు కోసం తెలంగాణలో బీజేపీకి సహకరించేలా ప్రాథమిక చర్చల్లో ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎలాగూ చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకొని కాంగ్రెస్‌ను దెబ్బతీసి లోపాయికారిగా బీజేపీకి సపోర్ట్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల రైతులకు 24 గంటల కరెంటు అనవసరంగా ఇస్తున్నారని, 3 గంటల కరెంటు చాలంటూ రేవంత్ కామెంట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, పొత్తుకు బీజేపీ తిరస్కరిస్తే పరిస్థితి ఏంటనేది టీడీపీలో గుబులు పుట్టిస్తోంది.