IT Notice to CBN: ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నాలుగు రోజుల కిందట నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం వైయస్సార్‌సీపీ సోషల్ మీడియాలో, అధికార పార్టీకి చెందిన మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, సదరు నోటీసులపై చంద్రబాబుగానీ, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకొని ఊదరగొట్టే మీడియా గానీ ఇంత వరకు పెద్దగా స్పందించలేదు. టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో సైలెంటుగా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? నోటీసులు ఎందుకొచ్చాయి? చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? (IT Notice to CBN)
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై 4 రోజులుగా ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. 46 పేజీల ఐటీ నోటీసుల కాపీ ఇప్పుడు మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. నోటీసులో దర్యాప్తునకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. సంబంధిత వ్యక్తులను ప్రశ్నించినట్టు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలం ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికి 4 సార్లు ఐటీ శాఖ, చంద్రబాబు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు లేవనెత్తిన అనేక రకాల అభ్యంతరాలకు ఐటీ శాఖ సమాధానం ఇచ్చింది. కొన్ని లావాదేవీలపై ఆధారాలతో సహా ఐటీ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. లెక్కల్లో చూపించని డబ్బు గురించే ఐటీ సూటి ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. 2020-21లో వెల్లడించని రూ.118 కోట్ల లెక్క చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.
ఇన్ ఫ్రా కంపెనీల నుంచే రూ.118 కోట్ల ముడుపులు? ముట్టినట్లు ఐటీ శాఖ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఆ డబ్బులపై ఏళ్లుగా దర్యాప్తు సాగుతూనే ఉంది. నెల క్రితం మళ్లీ నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ. అయితే, చంద్రబాబు మాత్రం ఐటీ నోటీసులపై ఇంకా స్పందించలేదు. 153-C సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. తదుపరి యాక్షన్ కోసం సమాయత్తమవుతోందని టాక్ వినిపిస్తోంది.
మనోజ్ వాసుదేవ్ పార్ధసాని కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేసింది. బోగస్ కాంట్రాక్టు, వర్క్ ఆర్డర్లతో షాపోర్ పల్లోంజి సంస్థ నిధులు మళ్లింపునకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి. నిధులు మళ్లించినట్టు అంగీకరించిన మనోజ్ వాసుదేవ్.. ఈ కేసులో కీలకంగా మారారు. మెసేజ్ లు, చాటింగ్ లు, ఎక్సెల్ షీట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ.. తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది.
బాబు తేలు కుట్టిన దొంగ
కాంట్రాక్టు సంస్థల నుంచి నిధులు మళ్లించి చంద్రబాబుకు అందించారనే ఆరోపణలపై ఐటీశాఖ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబు రూ.118 కోట్లు తీసుకున్నారని ఐటీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే, ఇదంతా నూటికి నూరుపాళ్లు నిజమని, అందుకే చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉన్నారని అధికార పార్టీ మండిపడుతోంది.
ఇదీ చదవండి: Gudivada Amarnath: చంద్రబాబు అవినీతి చిట్టా బయటకొస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్